వైశ్యులకు అండగా నిలవాలి..

16 Feb, 2020 16:23 IST|Sakshi

ఆర్య వైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌గా కుప్పం ప్రసాద్‌ ప్రమాణం

ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రులు

సాక్షి, విజయవాడ: రాష్ట్ర ఆర్య వైశ్య వేల్ఫేర్‌, డవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా కుప్పం ప్రసాద్‌ ప్రమాణం చేశారు. తుమ్మలపల్లి  కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో కుప్పం ప్రసాద్‌తో మంత్రులు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్‌, శంకర్‌ నారాయణ, వెల్లంపల్లి శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మంత్రులు ప్రసంగించారు. 

వైశ్యులకు గత ప్రభుత్వం చేసిందేమీ లేదు..
గత టీడీపీ ప్రభుత్వం ఆర్య వైశ్యులకు చేసిందేమీ లేదని మంత్రి ఆదిమూలపు సురేష్‌ అన్నారు. రాష్ట్రంలో 10 శాతం జనాభా ఆర్యవైశ్యులు ఉన్నారని.. వేల కోట్లతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను బలపరుస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశ్వసనీయత, నిబద్ధతకు నిదర్శనం అయితే.. చంద్రబాబు మోసం, దోపిడీకి నిదర్శనమని పేర్కొన్నారు. చంద్రబాబు.. ఎన్నికలకు ఐదు నెలల ముందు కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి తూతూ మంత్రంగా నిధులు కేటాయించారని విమర్శించారు. గత టీడీపీ ప్రభుత్వం కుల రాజకీయాలకు చేసిందని ధ్వజమెత్తారు. కుల, మత, పార్టీలకతీతంగా సీఎం జగన్‌ సంక్షేమ పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేద వైశ్యులకు కార్పొరేషన్‌ అండగా నిలవాలని కోరారు.

ఆర్య వైశ్యులకు అండగా నిలవాలి..
ఆర్థికంగా వెనుకబడిన వైశ్యులకు అండగా ఉండాలని మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన కుప్పం ప్రసాద్‌కు ఆయన అభినందనలు తెలిపారు. ప్రాంతాలకు అతీతంగా పనిచేసి.. పేదలకు చేయూత నివ్వాలని ఈ సందర్భంగా కోరారు. ప్రభుత్వానికి, వైశ్యులకు సంధాన కర్తగా ప్రసాద్‌ పనిచేయాలన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ తనపై ఉంచిన బాధ్యతను నెరవేర్చాలన్నారు.

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు..
వైశ్యులకు ఇచ్చిన మాటను సీఎం వైఎస్‌ జగన్‌ నిలబెట్టుకున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. గత టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపకుండా పొట్టి శ్రీరాములు త్యాగాన్ని అవమానించారని ధ్వజమెత్తారు. నవంబర్‌ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరిపి సీఎం జగన్‌ గౌరవించారని పేర్కొన్నారు. ఆయనకు వైశ్యులంతా అండగా ఉండాలని కోరారు. వైశ్యుల ఆరాధ్య దైవం పెనుగొండ వాసవిమాత ఆలయ అభివృద్ధి సీఎం వైఎస్‌ జగన్‌ కోటిన్నర నిధులు మంజూరు చేశారని వెల్లడించారు. ఆర్య వైశ్యులకు ఆర్థిక ప్రోత్సాహం ఇచ్చేందుకే కార్పొరేషన్‌ ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రంలో పేదలైన ఆర్యవైశ్యులకు కార్పొరేషన్‌ ద్వారా ఆర్థిక సాయం అందజేస్తామని వెల్లడించారు.

ఆ ఆరోపణలు అవాస్తవం..
ఆర్య వైశ్యుల్లో అధిక శాతం పేదలున్నారని.. కార్పొరేషన్‌ ద్వారా వారికి ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రోశయ్య సీఎం గా ఉన్నప్పుడు ఆయనను వైఎస్‌ జగన్‌ చిన్నచూపు చూశారనే ఆరోపణలు అవాస్తమన్నారు. రోశయ్య సీఎంగా ఉన్నప్పుడు జగన్‌ గౌరవించారని పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌ తన పోరాటం సోనియాగాంధీపై చేశారే తప్ప రోశయ్యపై కాదని వివరించారు. రోశయ్యను జగన్‌ ఎన్నడూ ఒక మాట కూడా అనలేదని.. రోశయ్య సీఎం గా ఉన్నంత కాలం జగన్‌ కాంగ్రెస్‌లోనే ఉన్నారని పేర్కొన్నారు. కిరణ్‌కుమార్‌ రెడ్డి సీఎం అయిన తర్వాతే జగన్‌ వైఎస్సార్‌సీపీ పార్టీని స్థాపించారని తెలిపారు. కార్పొరేషన్‌కు సీఎం జగన్‌ వచ్చే బడ్జెట్‌లో తగిన నిధులను కేటాయిస్తారని వెల్లడించారు. రాష్ట్రంలో ఆర్య వైశ్యులందరికీ కార్పొరేషన్‌ ద్వారా న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. 

వైశ్యులంతా వైఎస్సార్‌సీపీ వెంటే..
ఆర్య వైశ్య సమాజం అంతా వైఎస్సార్‌సీపీ వెంట నడుస్తోందని మంత్రి శంకర్‌ నారాయణ అన్నారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేసిన పాలనా కృషి ఫలితంగానే ఆర్య వైశ్యులంతా వైఎస్సార్‌సీపీకి అండగా నిలిచారని పేర్కొన్నారు. పేద వైశ్యులకు కార్పొరేషన్‌ ద్వారా ఆర్థికంగా పరిపుష్టి కల్పించాలని కోరారు. బీసీ సంక్షేమ శాఖ నుంచి  పూర్తి సహకారం అందిస్తామని తెలిపారు.

చంద్రబాబు మోసం చేశారు..
వైశ్యులంటే సేవ, నిజాయితీకి నిదర్శనమని మాదిగ కార్పొరేషన్‌ చైర్మన్‌ కనకారావు అన్నారు. గత టీడీపీ పాలనలో అనేక కులాలకు కార్పొరేషన్లు ఇస్తామని చంద్రబాబు మోసం చేశారని దుయ్యబట్టారు. అడిగితే వరాలు ఇచ్చేది దేవుడయితే... పేదల కళ్లలో కష్టాలు చూసి వరాలు ఇచ్చే దేవుడు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని పేర్కొన్నారు. గాంధీజీ, పొట్టి శ్రీరాములు ఆశయ సాధనలో పాలన సాగిస్తున్న వైఎస్‌ జగన్‌కు అందరూ అండగా నిలవాలని కోరారు.

మరిన్ని వార్తలు