మొగల్తూరు ఘటనపై దద్దరిల్లిన అసెంబ్లీ

31 Mar, 2017 10:31 IST|Sakshi
మొగల్తూరు ఘటనపై దద్దరిల్లిన అసెంబ్లీ

అమరావతి: మొగల్తూరు ఆక్వాప్లాంట్‌లో ఐదుగురు మృతి చెందిన ఘటనపై శుక్రవారం ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. ఆక్వాప్లాంట్‌ ఘటనపై వాయిదా తీర్మానం ఇచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ.. దానిపై చర్చకు గట్టిగా పట్టుబట్టింది. అయితే ఆ డిమాండ్‌ను స్పీకర్‌ తోసిపుచ్చారు. స్పీకర్‌ చర్చకు అనుమతించకపోవడంతో వైఎస్‌ఆర్‌ సీపీ సభ్యులు పోడియం వద్ద ఆందోళనకు దిగారు. మొగల్తూరు ఆక్వా బాధితులను ఆదుకోవాలంటూ నినాదాలు చేస్తూ.. ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సమయంలో అధికారపక్ష నేతలు వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులపై దూషణలకు దిగారు. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో స్పీకర్‌ సభను తొలుత 10 నిమిషాలు వాయిదా వేశారు.

ఆ తర్వాత సభ మళ్లీ ప్రారంభమైనా కూడా మరోసారి వైఎస్ఆర్‌సీపీ సభ్యులు గట్టిగా పట్టుబట్టి, స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. ఎవరేం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఆక్వాప్లాంటు ఘటనపై ప్రభుత్వం ప్రకటన చేస్తుందని, ఆ తర్వాత దానిపై చర్చిద్దామని మంత్రులు, స్పీకర్ తెలిపారు. ముందుగా ప్రశ్నోత్తరాల సమయానికి సహకరించాలని కోరారు. అయితే, అత్యంత ముఖ్యమైన అంశం అయినందున ఆక్వా ప్లాంటు ఘటనపై చర్చించాలని వైఎస్ఆర్‌సీపీ సభ్యులు పట్టుబట్టారు. విధిలేని పరిస్థితులలో స్పీకర్ సభను మరోసారి వాయిదా వేయాల్సి వచ్చింది.

మరిన్ని వార్తలు