టాప్‌ గేర్‌లో ఏపీ ఆటోమొబైల్‌

18 Jun, 2020 04:50 IST|Sakshi

ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించిన కియా

ముడి సరుకు కోసం ఎదురు చూస్తున్న ఇసుజు

ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న హీరో మోటార్స్, అశోక్‌ లేలాండ్‌

ఉత్పత్తి ప్రారంభించిన అపోలో టైర్స్, అమర రాజా బ్యాటరీలు

సాక్షి, అమరావతి: ఆటోమొబైల్‌ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ రూపుదిద్దుకుంటోంది. ముఖ్యంగా రాయలసీమలో ఆటోమొబైల్, ఆటో విడిభాగాల తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. రాష్ట్రంలో 100 కు పైగా విడిభాగాల ఉత్పత్తి సంస్థలు ఉన్నాయి. లాక్‌డౌన్‌ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రీస్టార్ట్‌ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే పలు కంపెనీలు ఉత్పత్తిని ప్రారంభించాయి. అనంతపురం జిల్లాలోని కియా మోటార్స్‌ ప్రస్తుతం ఒక షిఫ్టులో పనిచేస్తోంది. నిబంధనలను అనుసరించి కార్లను ఉత్పత్తి చేస్తున్నట్లు కియా మోటార్స్‌ ప్రతినిధులు తెలిపారు. శ్రీసిటీలో 20కిపైగా ఆటో మొబైల్‌ కంపెనీలున్నాయి. ఇందులో జపాన్‌కు చెందినవే అధికం. ఇసుజు మోటార్స్‌ ఇక్కడ ఎస్‌యూవీలను తయారు చేస్తోంది. ఇటీవలే ఈ కంపెనీ రూ. 400 కోట్ల పెట్టుబడితో అదనపు ఉత్పత్తి కేంద్రాన్ని, ప్రెస్‌ షాప్, ఇంజిన్‌ అసెంబ్లీ యూనిట్లతో ప్రారంభించింది. 

అనుబంధ పరిశ్రమలకు ఊతం..
ఇసుజు వాహనాలకు అవసరమైన వివిధ విడి భాగాలలో ప్రస్తుతం 70 శాతం మాత్రమే మన దేశంలో తయారవుతున్నాయి. రాబోయే రోజుల్లో, అన్ని విడి భాగాలను పూర్తిగా ఇక్కడే తయారుచేసేందుకు ఆ సంస్థ ఏర్పాట్లు చేస్తోంది. దీంతో పలు అనుబంధ పరిశ్రమలు త్వరలో శ్రీసిటీకి రానున్నాయి. శిక్షణ, అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించి తిరుపతి ఐటీఐ కళాశాలలో ఇసుజు మోటార్స్‌ నైపుణ్యాభివృద్ధి కేంద్రం ఏర్పాటు చేశారు. కొబెల్కో గ్రూçపు, పయోలాక్స్, యన్‌.యస్‌.ఇన్‌స్ట్రుమెంట్స్, యన్‌.హెచ్‌.కే స్ప్రింగ్స్, మెటల్‌ వన్, నిట్టాన్‌ వాల్వ్‌ తదితర కంపెనీలు, ఇతర విడిభాగాల తయారీ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయి.

ఉత్పత్తికి సిద్ధంగా హీరో, అశోక్‌ లేలాండ్‌
చిత్తూరు జిల్లాలో ఉన్న అపోలో టైర్స్, అమరరాజా బ్యాటరీస్‌ లాక్‌డౌన్‌ తర్వాత తమ కార్యకలాపాలను ప్రారంభించాయి. అలాగే ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటార్‌ కార్ప్‌ తమ ఉత్పత్తులను ట్రయిల్‌ రన్‌ చేస్తోంది. దేశంలో ఆటోమొబైల్‌ రంగం అమ్మకాలు పుంజుకున్న వెంటనే ఉత్పత్తి ప్రారంభించడానికి రంగం సిద్ధం చేసుకుంది. అదేవిధంగా విజయవాడ సమీపంలోని అశోక్‌ లేలాండ్‌ కూడా ఉత్పత్తులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఇవి కాకుండా అవేరా ఈ బైక్స్‌ తమ ఉత్పత్తి కార్యక్రమాలను ప్రారంభించింది. అనంతపురంలో వీరా బస్సు తయారీ కేంద్రం రానుండగా, మరో ఆరు, ఏడు అంతర్జాతీయ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి చర్చలు జరుపుతున్నాయి.

నమ్మకం పెరిగింది..
రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్‌–19 వైరస్‌ వ్యాప్తిని సమర్థవంతంగా అడ్డుకుంది. ప్రభుత్వం ఇచ్చిన సహకారంతో మే మొదటి వారంలోనే ఉత్పత్తి ప్రారంభించాం. రాష్ట్ర ప్రభుత్వంపై నమ్మకం పెరగడంతో మరో రూ. 400 కోట్ల వరకు అదనపు పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. త్వరలో మరో కొత్త మోడల్‌ కారును విడుదల చేయనున్నాం.
– కూక్‌ హ్యూన్‌ షిమ్, ఎండీ, కియా మోటార్స్‌ ఇండియా.

రాయితీలు అందాయి..
రాష్ట్ర ప్రభుత్వం రీస్టార్ట్‌ ప్యాకేజీ కింద ప్రకటించిన రాయితీలు పొందాం. అదే విధంగా వర్కింగ్‌ క్యాపిటల్‌ కింద మరో 20 శాతం అదనపు రుణానికి దరఖాస్తు చేసిన రెండు రోజుల్లోనే విడుదల అయ్యింది. ప్రస్తుతం యూనిట్‌ను 50 శాతం మంది సిబ్బందితో నడుపుతున్నాం. మార్చి నెల ఆర్డర్లను పూర్తి చేసి త్వరలో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమ్మకాలు విస్తరించే యోచనలో ఉన్నాం.
– డాక్టర్‌ రమణ, అవేరా ఈ స్కూటర్స్, ఫౌండర్‌ సీఈవో. 

మరిన్ని వార్తలు