నవరత్నాల స్ఫూర్తితో ఏపీ బ్రాండ్‌ లోగో

31 Jan, 2020 05:36 IST|Sakshi
ప్రథమ, ద్వితీయ బహుమతికి ఎంపికైన లోగోలు

9 రేకులతో వికసించిన పుష్పం ఆకృతి లోగోకు ప్రథమ బహుమతి

‘సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం’ అనే శీర్షికతో లోగో రూపకల్పన 

బ్రాండ్‌థాన్‌ పోటీకి మంచి స్పందన

త్వరలో సీఎం చేతులమీదుగా అవార్డుల ప్రదానోత్సవం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా కొత్త లోగో సిద్ధమైంది. ఏపీకి కొత్తగా బ్రాండింగ్‌ చేసేందుకు నిర్వహించిన బ్రాండ్‌థాన్‌ లోగోల పోటీకి ఔత్సాహికుల నుంచి విశేష స్పందన లభించింది. పోటీలో  47,903 మంది పాల్గొనగా నవరత్నాల స్ఫూర్తితో వికసించిన పుష్పం ఆకృతిలో రూపొందించిన లోగో ప్రథమ బహుమతికి ఎంపికైంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవతో కూడిన కమిటీ విజేతలను ఎంపిక చేసింది. 

47 వేలకు పైగా దరఖాస్తులు..
బ్రాండ్‌థాన్‌ పోటీకి మంచి స్పందన లభించిందని, క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత మూడు ఎంట్రీలను ఎంపిక చేసినట్లు రజత్‌ భార్గవ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఏపీ బ్రాండ్‌ను ప్రచారం చేసేందుకు గతేడాది అక్టోబర్‌ 10న న్యూఢిల్లీలో బ్రాండ్‌థాన్‌ పోటీని ప్రారంభించామన్నారు. నవంబర్‌ 4 వరకు 47,903 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు. మొదటి బహుమతి కింద రూ.50,000, ద్వితీయ బహుమతి రూ.25,000, తృతీయ బహుమతి కింద  రూ.10,000 చొప్పున నగదు పురస్కారం ఇవ్వనున్నట్లు చెప్పారు. త్వరలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందన్నారు.
- నవరత్నాల పథకాలను ప్రతిబింబించేలా తొమ్మిది రేకులతో వికసించిన పుష్పం ఆకృతిలో ఆంధ్రప్రదేశ్‌ పేరుతో ఉన్న లోగో ప్రథమ బహుమతికి ఎంపికైంది. ఈ లోగోకు ‘సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాం’ అనే శీర్షికను చేర్చారు. హైదరాబాద్‌కు చెందిన సిదార్థ మాధవరెడ్డి దీన్ని రూపొందించారు. 
రెండు చేతులు కలిపినట్లుగా ఇంగ్లిష్‌ అక్షరాల్లో ‘ఏపీ’ అని రాసి ఉన్న లోగో రెండో స్థానం సాధించింది. ‘కలసికట్టుగా ఎదుగుదాం’ అనే శీర్షికను దీనికి జోడించారు. 
పారదర్శక పాలనకు ప్రతీకగా రూపొందించిన లోగో తృతీయ బహుమతిని గెలుచుకుంది.  

మరిన్ని వార్తలు