ఆంధ్రప్రదేశ్‌కు బ్రాండింగ్: బాబు

28 Jan, 2015 02:39 IST|Sakshi
ఆంధ్రప్రదేశ్‌కు బ్రాండింగ్: బాబు

* ఇబ్బందిగానే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి.. అందుకే కొత్తగా కార్యక్రమాలు ఆపేశాం
* ఏపీకి ప్రత్యేక హోదా అవకాశాలు క్షీణించటం వాస్తవమే
* ఉద్యోగులకు పీఆర్సీ అమలుపై ‘చూద్దాం.. అన్నీ చేస్తాం’ అని సీఎం వ్యాఖ్య

సాక్షి, హైదరాబాద్: ప్రపంచ వాణిజ్య రంగంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు (బ్రాండింగ్) కల్పించడానికి దావోస్‌లో తన పర్యటన దోహదం చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పర్యటన విశేషాలను మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులకు వివరించారు. పారిశ్రామిక దిగ్గజాలతో భేటీ వివరాలను ఉత్సాహంగా వెల్లడించిన బాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పీఆర్సీ అమలు, కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం అందకపోవడం, ప్రత్యేక హోదా దక్కే అవకాశాలు మందగించడం.. తదితర అంశాలపై నిరుత్సాహంగా స్పందించారు.

రాష్ట్రం గడ్డుస్థితినుంచి గట్టెక్కడానికి ఏం చర్యలు తీసుకుంటారో వివరించలేకపోయిన ఆయన.. తాను ఆశాజీవినని, సంక్షోభాన్ని అధిగమించడానికి అంతా సహకరించాలని విజ్ఞప్తి చేయడానికే పరిమితమయ్యారు. రాష్ట్రంలో జీతాలివ్వలేని పరిస్థితులు ఉన్నాయని, నిధుల కొరతతో కొత్త పథకాలు ఆపేశానని సీఎం చెప్పారు. ఏపికి ప్రత్యేక హోదా దక్కే అవకాశం లేకపోవడం, కేంద్రం నుంచి సహాయం అందని విషయం వాస్తవమేనని అంగీకరించారు. దీనిపై తాను దావోస్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో మాట్లాడగా.. సానుకూలంగానే సమాధానం చెప్పారన్నారు.
 
దేశంలో వాణిజ్యానికి అననుకూల వాతావరణం
భారత్‌లో వ్యాపారాలు నిర్వహించటానికి అనుకూల వాతావరణం లేదనే అభిప్రాయం దావోస్‌లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో వ్యక్తమైనట్లు చంద్రబాబు చెప్పారు. మన దేశంలో పరిశ్రమలు ఏర్పాటుకు 28 రకాల అనుమతుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి  ఉందన్నారు. ఈ స్థితిని మార్చే  చర్యలు తీసుకుంటామని చెప్పారు.
 
పీఆర్సీ అమలుపై దాటవేత: సచివాలయ ఉద్యోగుల సంఘం రూపొందించిన డైరీ, క్యాలండర్‌ను సీఎం ఆవిష్కరించారు. కేలండర్ మీద చంద్రబాబు ఫోటోలు ఉండటాన్ని గమనించి విలేకరులు.. ‘మన డబ్బా మనం కొట్టుకోవడం వల్ల ప్రయోజనం ఏమిటి?’ అని ప్రశ్నించగా.. ‘నీకేంటయ్యా బాధ?’ అంటూ సీఎం ఎదురు ప్రశ్నించారు. పీఆర్సీ అమలు గురించి మాట్లాడాలని విలేకరులు కోరగా.. ‘చూద్దాం. అన్నీ చేస్తాం’ అంటూ పొడి గా సమాధానం ఇచ్చారు. విలేకరులు కూడా పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వానికి అనుకూల వార్తలు రాయాలని బాబు విజ్ఞప్తి చేశారు.
 
దావోస్‌లో అగ్ర కంపెనీల సీఈవోలు, దిగ్గజ సంస్థల ప్రతినిధులు, సాంకేతిక నిపుణులతో తాను భేటీ అయ్యాయనని సీఎం చంద్రబాబు చెప్పారు. పెప్సికో సీఈవో ఇంద్రానూయి మొదలు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్ వరకు.. పలువురితో చర్చలు జరిపానన్నారు. బిల్‌గేట్స్‌ను విశాఖకు రమ్మని ఆహ్వానించానన్నారు. తనంటే బిల్‌గేట్స్‌కు ఎంతో అభిమానమని, ఆత్మీయంగా మాట్లాడారని చంద్రబాబు పేర్కొన్నారు.
 
ఏపీలో పెట్టుబడులకు సహకరిస్తా: ప్రేమ్‌వత్సా
పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్‌కు సహకరిస్తానని కెనడా పారిశ్రామికవేత్త, ఫెయిర్‌ఫాక్స్ హోల్డింగ్స్ లిమిటెడ్ చైర్మన్, సీఈవో ప్రేమ్‌వత్సా సీఎం బాబుకు హామీ ఇచ్చారు. మంగళవారం ఆయన నేతృత్వంలోని ప్రతినిధి బృందం సచివాలయంలో సీఎంతో సమావే శమైంది.
 
ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయండి
ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. పోలీసింగ్ ద్వారా ఇసుక మాఫియా ఆగడాలను నిరోధించలేకపోవడం సరికాదన్నారు. ఇసుక అమ్మకాలపై సీఎం మంగళవారం సమీక్ష జరిపారు.

మరిన్ని వార్తలు