ఏపీ బడ్జెట్‌ : స్త్రీ, శిశు సంక్షేమానికి పెద్దపీట

16 Jun, 2020 14:32 IST|Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో మహిళలు అభివృద్ధి పథంలో పయనించిప్పుడే రాష్ట్ర అభివృద్ధి మరింత ముందుకెళుతుందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఎన్నోసార్లు పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా మహిళా,శిశు సంక్షేమానికి పెద్దపీట వేస్తామని చెప్పిన విధంగానే 2020-21 బడ్జెట్‌లో ఈ రంగానికి పెద్ద ఎత్తున కేటాయింపులు జరిపారు. మంగళవారం రాష్ట్ర శాసనసభలో రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ విధాన లక్ష్యాల్లో అత్యంత ముఖ్యమైన వాటిలో స్త్రీ అభ్యున్నతి ఒకటని ఆయన పేర్కొన్నారు.(ఏపీ బడ్జెట్‌ హైలైట్స్‌)

జగనన్న అమ్మ ఒడి 
బడి ఈడు పిల్లల​ నూటికి నూరు శాతం బడిలో చేరాలని, వాళ్లు బడి మానకుండా ఉండాలని, వారి ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడాలని కోరుకుంటూ ప్రభుత్వం జగనన్న అమ్మ ఒడి పథకం ప్రారంభించింది. జగనన్న అమ్మ ఒడి పథకం కింద ఈ ఏడాది బడ్జెట్‌లో రూ. 6వేల కోట్లు కేటాయిస్తున్నట్లు బుగ్గన తెలిపారు. దీనివల్ల రాష్ట్రంలోని 8,68,233 మంది షెడ్యూల్‌ కులాల తల్లులకు, 19,65, 589 మంది వెనుకబడిన తరగతులకు చెందిన నిరుపేద తల్లులు, 2,76, 155 గిరిజన మాతృమూర్తులకు , 4, 03, 562 మంది ఆర్థికంగా వెనుకబడిన వారికి , 2,95, 540 మైనారిటీ వర్గాలకు చెందిన వారికి ఈ పథకం కింద సహాయమందనుంది. 

వైఎస్సార్‌ చేయూత
రాష్ట్రంలో 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్కులైన స్రీలకు ఆర్థిక సహాయాన్ని పరిపుష్టం చేయడం కోసం వైఎస్సార్‌ చేయూత పథకం ఏర్పాటు చేశారు. ఈ పథకం కింద 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ . 3వేల కోట్లు కేటాయించారు. ఈ పథకం కింద 2020-21 ఆర్థిక సంవత్పరంతో మొదలైన నాలుగు సంవత్సరాల పాటు షెడ్యూల్‌ కులాలు, షెడ్యూలు తెగలు, వెనుకబడిన తరగతులు, మైనారిటీ సామాజిక వర్గాలకు చెందిన మహిళకు రూ. 18750 వార్షిక సహాయం అందించబడుతుంది.
(ఏపీ బడ్జెట్‌ : గిరిజన ప్రాంతాలకు శుభవార్త)

వైఎస్సార్‌ ఆసరా
స్వయం స్వహాయక ఆర్థిక బృందాల కార్యకలాపాల్లో పెద్ద ఎత్తున గ్రామీణ, అసంఘటిత ఆర్థిక వ్యవస్థలో ఎంతో మంది స్త్రీలు ఆధారపడ్డారు. వీరిని దృష్టిలో పెట్టుకొని రూపొందించిన పథకమే వైఎస్సార్‌ ఆసరా. ఇందుకుగానూ 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 6,300 కోట్లు కేటాయించారు.  2019 ఏప్రిల్‌ 11 నాటికి డ్వాక్రా మహిళలకు ఉన్న రుణం రూ. 27,168.83 కోట్ల బకాయిలను చెల్లించేందుకు నాలుగు దశల్లో ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2020–21 ఏడాది నుంచి నాలుగేళ్లపాటు అమలు చేయనుంది.(కరోనా వారియర్స్‌కు ధన్యవాదాలు)

వైఎస్సార్ సంపూర్ణ పోషణ
పేదరికం, నిరక్షరాస్యత, వైద్య ఆరోగ్య పద్ధతులపై కనీస పరిజ్ఞానం లేకపోవడం, పోషక ఆహారం గురించి జాగ్రత్తలు తీసుకోకపోవడం, పరిసరాల అపరిశుభ్రత వంటివి దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకాన్ని ప్రారంభించింది. 2020-21 ఏడాదికి గానూ వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ పథకాని​కి రూ . 1500 కోట్లు కేటాయించారు. దీని ద్వారా 7 సమగ్ర  గిరిజనాభివృద్ధి సంస్థల పరిధిలో ఉన్న 0.66 లక్షల గర్భిణీ బాలింత స్త్రీలు, 6 నుంచి 72 నెలల లోపు వయసు కలిగిన 3.18 లక్షల మంది చిన్నారులకు లబ్ధి చేకూరనుంది. దీంతో పాటు స్త్రీలు, శిశువులు, విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సంక్షేమశాఖ నిమిత్తం 2020-21 సంవత్సరానికి గానూ రూ. 3456 కోట్లు కేటాయించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా