‘తూర్పు’నకు నిట్టూర్పే

21 Aug, 2014 01:09 IST|Sakshi
‘తూర్పు’నకు నిట్టూర్పే

 సాక్షి, రాజమండ్రి :విభజన తర్వాత ప్రవేశపెట్టిన తొలిబడ్జెట్‌పై ప్రజలు గంపెడాశలు పెట్టుకోగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్ని వర్గాల వారికీ నిరాశే మిగిల్చారు. ప్రాధాన్య రంగాలను వదిలి చేసిన కసరత్తులో జిల్లాకు పెద్దగా ఏమీ దక్కలేదని చెప్పాలి. నీటిపారుదల ప్రాజెక్టులకు కూడా ప్రతిపాదిత కేటాయింపుల్లో కోతలు విధించారు. పుష్కర ఎత్తిపోతలు, పోలవరం ప్రాజెక్టులకు నామమాత్రపు నిధులే ఇచ్చారు. ఇతర ప్రాజెక్టుల నిర్వహణా నిధుల్లోనూ కోత పెట్టారు. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని చెప్పిన ప్రభుత్వం బడ్జెట్‌లో మాత్రం అందుకుతగ్గ కేటాయింపులు   జరపలేదు. గతంలో ఆర్థిక మంత్రి ప్రకటించినట్టు రూ.వంద కోట్లకే పరిమితమయ్యారు. ఇక జిల్లాకు మేలనిపించే అంశాల్లో చాలా వరకూ కేంద్రం చేపట్టేవే. కాకినాడలో ఏర్పాటు చేస్తామన్న హోటల్ మేనేజ్‌మెంటు ఇనిస్టిట్యూట్‌కు మాత్రం రూ.12 కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు.
 
 జిల్లాకు ప్రకటించినవి ఇవీ..
  పర్యాటకాభివృద్ధి పేరుతో కాకినాడలో శిల్పారామం
  కాకినాడ- విశాఖ మధ్య (విశాఖ శివార్లలో) గ్రీన్‌ఫీల్డు ఎయిర్‌పోర్టు నిర్మాణం
  చిత్తూరుతో పాటు  కాకినాడలో కూడా ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి ప్రతిపాదన
  కాకినాడ తీరంలో లిక్విడ్ నైట్రోజన్ గ్యాస్ ప్లాంటు ఏర్పాటుకు ఆమోదం
  రాజమండ్రి విమానాశ్రయ విస్తరణకు కేంద్ర ఎయిర్‌పోర్టు అథారిటీకి సహకారం
  కాకినాడలో రూ.12 కోట్లతో హోటల్ మేనేజ్‌మెంటు ఇనిస్టిట్యూట్
  గోదావరి పుష్కరాలకు రూ.100 కోట్లు కేటాయింపు
  ప్రైవేట్ నిర్వహణలో కాకినాడలో వాణిజ్య పోర్టు ఏర్పాటు
 
 పర్యాటకానికి నిరుత్సాహం..
 శిల్పారామం, ఎల్‌ఎన్‌జీ టెర్మినల్ గత ప్రభుత్వం కూడా ప్రతిపాదించినవే. కొత్తగా ప్రతిపాదించిన వాటిలో కేటాయింపులు జరిగినవి పెద్దగా లేవనే చెప్పాలి.  పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్‌లు వస్తున్నా ఆ దిశగా ప్రతిపాదనలు లేవు. కోనసీమ నుంచి రాజమండ్రి వరకూ గోదావరి పర్యాటకాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని పక్కనబెట్టారు.
 
 వికలాంగులకు నిస్పృహ
 వికలాంగుల పింఛనుకు ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.300 కోట్లు కేటాయించింది. రూ. 1500 పెన్షన్ అందుతుందన్న వారి ఆశలపై ప్రభుత్వం నీళ్లు జల్లింది. 80 శాతం వైకల్యం ఉంటేనే అక్టోబర్ రెండు నుంచి రూ.1500 పింఛను వస్తుందని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో సుమారు 64 వేల మంది వికలాంగ పింఛనుదారులు ఉండగా వీరిలో 80 శాతం వైకల్యం ఉన్నవారు ఐదు వేల మంది కూడా ఉండ రని అంచనా. 60 శాతం ఉన్న వారికి రూ.1500 వర్తింప చేస్తారని ఆశించగా నిరాశ మిగిలింది.
 
 ఆ శాఖల బడ్జెట్ లోనే దిక్కు?
 పుష్కరాలకు రాష్ట్రం మొత్తంమీద గోదావరి తీరంలో చేపట్టాల్సిన పనులకు రూ.100 కోట్లు కేటాయించారు. ఆయా శాఖలు తమ స్వంత నిధుల నుంచి కూడా పుష్కరాలకు ఖర్చు చేయాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఆర్‌అండ్‌బీ శాఖకు ఈ పరిస్థితి తలెత్తే అవకాశం కనిపిస్తోంది.
 
 తూర్పు ఆదర్శంగా...
 రేషన్ పంపిణీలో బయోమెట్రిక్ ఆధారిత ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సర్వీస్ విధానాన్ని 2012లో తొలిసారిగా జిల్లాలో అమలు చేయడం వల్ల 15 శాతం రేషన్ ఆదా అవుతోందని, దీన్ని రాష్ట్రం అంతా అమలు చేస్తామని ఆర్థిక మంత్రి ప్రకటించారు.
 
 ఇరిగేషన్‌కు అంతంత మాత్రమే...
 దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యమిచ్చారు. ఆయన మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞం పథకాన్ని నిర్లక్ష్యం చేసింది. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా ప్రాజెక్టుల నిర్వహణా వ్యయంలో కోత పెట్టింది. ఈ ఏడాది ఇరిగేషన్ ప్రాజెక్టులకు అంతంత మాత్రం కేటాయింపులు చేసింది. కేంద్రం పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలు స్వీకరిస్తుందని ప్రకటించిన నేపథ్యంలో ఆ ప్రాజెక్టుకు కేటాయించే నిధుల్లో కూడా కోత పెట్టారు. పుష్కర ఎత్తిపోతల పథకానికి కేటాయింపులు గతం కంటే తగ్గించారు. జిల్లాలోని ఇతర చిన్న, మధ్యతరగతి ప్రాజెక్టుల నిర్వహణ గ్రాంటుల్లో కూడా కోత పెట్టారు. జిల్లాల్లో ఆయా ప్రాజెక్టులకు ప్రణాళికా వ్యయం కింద దక్కిన కేటాయింపులు ఇలా ఉన్నాయి.
 

>
మరిన్ని వార్తలు