18 రోజుల పాటు ఏపీ బడ్జెట్ సమావేశాలు

17 Aug, 2014 02:05 IST|Sakshi
18 రోజుల పాటు ఏపీ బడ్జెట్ సమావేశాలు

* రేపటి నుంచి వచ్చే నెల 12 వరకు..
* 20న సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న యనమల
* 22న వ్యవసాయ బడ్జెట్ రూ. లక్ష కోట్లతో సాధారణ బడ్జెట్
* కౌన్సిల్‌లో రెండు బడ్జెట్‌లు ప్రవేశపెట్టనున్న మంత్రి నారాయణ

 
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసన సభ బడ్జెట్ సమావేశాలు 18 రోజులపాటు జరగనున్నాయి. సోమవారం ప్రారంభమయ్యే సమావేశాలు సెప్టెంబర్ 12న ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదంతో ముగుస్తాయి. 18వ తేదీ ఉదయం 8 గంటలకు స్పీకర్ కోడెల శివప్రసాదరావు అధ్యక్షతన శాసన సభా వ్యవహారాల సలహా కమిటీ (బీఏసీ) సమావేశం జరుగుతుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సభ సమావేశమవుతుంది. 20వ తేదీ ఉదయం 11 గంటలకు రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు 2014 - 15 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థారుు బడ్జెట్‌ను సభలో ప్రవేశపెడతారు.
 
 వ్యవసాయ, సాగునీటి రంగాలు, అనుబంధ రంగాలకు చెందిన కేటాయింపులన్నింటినీ ఒక చోటకు తీసుకొస్తూ వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక పేరుతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 22వ తేదీ ఉదయం 11 గంటలకు వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. లక్ష కోట్ల రూపాయలతో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇందులో రూ. 20 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్లు ప్రణాళిక వ్యయంగా, రూ. 80 వేల కోట్ల నుంచి రూ. 85 వేల కోట్లు ప్రణాళికేతర వ్యయంగా చూపనున్నారు. వ్యవసాయ బడ్జెట్‌ను రూ.15 వేల కోట్లతో ప్రవేశపెడతారు. పురపాలక మంత్రి డాక్టర్ పి. నారాయణ 20న వార్షిక బడ్జెట్‌ను, 22న వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.
 
 ఇంకా పూర్తికాని మరమ్మతులు
 శాసన సభ ఆవరణలో ఆంధ్ర ప్రదేశ్‌కు కేటాయించిన సమావేశ మందిరంలో ఇంకా మరమ్మతులు పూర్తికాలేదు. గత సమావేశాల సందర్భంగా సీట్లు సౌకర్యంగా లేవని సభ్యులు ఫిర్యాదు చేయటంతో మరమ్మతులు చేపట్టారు. మరికొద్ది గంటల్లో సమావేశాలు ప్రారంభమవుతున్నారుు. అరుునా మరమ్మతులు సాగుతూనే ఉన్నారుు. శాసనసభలో ఇన్నర్ లాబీ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. విపక్ష నేత వైఎస్ జగన్, ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్‌లకు ప్రస్తుతం ఉభయ రాష్ట్రాల అసెంబ్లీ కార్యదర్శులు కె. సత్యనారాయణ, ఎస్. రాజాసదారం వినియోగిస్తున్న కార్యాలయాలను కేటాయించినప్పటికీ, వారింకా వాటిని ఖాళీ చేయలేదు.
 
సర్కారు హామీలపైనే విపక్షం పట్టు
 ప్రభుత్వం ఏర్పడి రెండున్నర నెలలు కావొస్తుండటంతో, అధికార పార్టీ ఇచ్చిన హామీల అమలుపైనే ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన సభలో గట్టిగా పట్టుబట్టనున్నట్టు తెలిసింది. ముఖ్యంగా వ్యవసాయ, డ్వాక్రా రుణాల మాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, పింఛన్లు వంటి తక్షణం కార్యరూపంలోకి తేవలసిన అంశాలతో పాటు ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలపై గట్టిగా నిలదీయాలను ఆ పార్టీ భావిస్తోంది. సోమవారం నుంచి ప్రారంభమవుతున్న శాసన సభ, శాసన మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడానికి వైఎస్సార్ కాంగ్రెస్ శాసన సభాపక్షం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం సమావేశమవుతోంది.

మరిన్ని వార్తలు