జేఎన్‌టీయూ నిర్మాణానికి స్థలం కేటాయింపు

23 Jan, 2018 18:15 IST|Sakshi

86 ఎకరాలు అప్పగించడానికి క్యాబినెట్‌ ఆమోదం

సంవత్సరంలో పూర్తి చేస్తామంటున్న వర్సిటీ యాజమాన్యం

రూ.కోట్లతో ప్రారంభం కానున్న పనులు

నరసరావుపేట రూరల్‌: ఎట్టకేలకు జేఎన్‌టీయూ నరసరావుపేట ఇంజినీరింగ్‌ కళాశాల సొంత భవన నిర్మాణ పనులకు మార్గం సుగమమైంది. 2012–13 విద్యా సంవత్సరంలోనే వర్సిటీ ఏర్పాటుకు పునాది పడింది. అప్పటి వర్సిటీ పాలక మండలి నరసరావుపేటలో వర్సిటీ అనుబంధ కళాశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. నరసరావుపేట మండలం కాకానిలో కొంత ప్రభుత్వ భూమి ఉండటంతో అక్కడ కళాశాల ఏర్పాటు చేయాలని భావించింది. ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రతిపాదనలు వచ్చినప్పటికీ రాష్ట్ర విభజన జరిగి, టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం అవే భూములను ఏపీఐఐసీకి కేటాయిస్తూ జీవో జారి చేసింది. దీనిపై మీడియాలో భారీ దుమారం రావడంతో వెనక్కి తగ్గిన ప్రభుత్వం చివరికి వర్సిటీకి స్థలం కేటాయించింది.

రెండేళ్ల నుంచి స్థలం కోసం ఎదురుచూపు..
రెండేళ్ల క్రితం నరసరావుపేటలో జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ వర్సిటీ కళాశాల ఏర్పాటైంది. కళాశాల ప్రారంభమైనప్పటి నుంచి అధికారికంగా భవనాలు నిర్మించడానికి ప్రభుత్వం స్థలం కేటాయించలేదు. దీంతో ప్రైవేటు స్థలాల్లోనే తరగతులు కొనసాగుతున్నాయి. ఏపీఐఐసీకి కేటాయించిన కాకాని స్థలాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్ట్‌లో జీవో కూడా జారీ చేసింది. ఈ స్థలాన్ని తిరిగి కళాశాలకు కేటాయించడంలో ప్రభుత్వం అలసత్వం వహించింది. రెండేళ్లుగా కళాశాలకు భూములను కేటాయించాలని కోరుతూ వర్సిటీ అధికారులు అనేక సార్లు ప్రభుత్వ పెద్దలను కలిశారు. అయినా ప్రయోజనం లేకపోయింది.

చివరకు 86 ఎకరాలు కేటాయింపు..
భవనాల నిర్మాణానికి ఇప్పటివరకూ అధికారులు ప్రభుత్వ స్థలం కేటాయించకపోవడంతో ప్రస్తుతం అద్దె భవనాల్లోనే  తరగతులు నిర్వహించాల్సి వస్తోంది. రూరల్‌ పరిధిలోని పెట్లూరివారిపాలెం ఎ.ఎం.రెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలలో గతేడాది తరగతులు నిర్వహించగా ఈ ఏడాది పట్టణంలోని ఎన్‌.బి.టి అండ్‌Š ఎన్‌.వి.సి కళాశాలలో తరగతులు  కొనసాగుతున్నాయి. ఎట్టకేలకు ప్రభుత్వం కళాశాలకు 86 ఏకరాలు కేటాయిస్తూ శనివారం క్యాబినేట్‌ నిర్ణయం తీసుకోవడంతో విద్యార్థులు, అధ్యాపకుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. నిర్ణయం తీసుకోవడానికి మరింత సమయం తీసుకున్నప్పటికీ పల్నాడు విద్యా హబ్‌గా ఉన్న నరసరావుపేటలో జేఎన్‌టీయూ భవన నిర్మాణాల కల సాకారం కానుందని పలువురు విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిధులను సమకూర్చుకుని సిద్ధంగా ఉన్న కళాశాల యాజమాన్యం సైతం భూమి కేటాయింపు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తోంది.

మరో ఏడాదిలో నిర్మాణాలు పూర్తి..
 కళాశాల భవన నిర్మాణాలకు వర్సిటీ రూ.80 కోట్లు ఖర్చుచేయనుంది. ప్రస్తుతానికి రూ.30 కోట్లతో పనులు ప్రారంభం కానున్నాయి. గతంలో టెండర్లు పిలిచినా భూములు అప్పగించకపోవడంతో పనులు ఆగిపోయాయి. భూములను మాకు అప్పగించిన వెంటనే పనులను ప్రారంభిస్తాం. ఇందుకోసం అవసరమైన ప్రిలిమినరీ వర్క్‌ ఇప్పటికే పూర్తి చేశాం. భవనాలు పూర్తిగా అందుబాటులోకి రావడానికి మరో ఏడాది సమయం పడుతుందని భావిస్తున్నాం.   – కె.ఎస్‌.ఎస్‌ మురళీకృష్ణ, వర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్‌

మరిన్ని వార్తలు