జ్యుడిషియల్‌ కమిషన్‌ ముసాయిదా బిల్లుకు ఏపీ మంత్రివర్గం ఆమోదం

19 Jul, 2019 16:33 IST|Sakshi

సాక్షి, అమరావతి : టెండర్ల ప్రక్రియలో ఉత్తమ పారదర్శక విధానానికి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు శ్రీకారం చుట్టింది. సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల హామీల అమలులో భాగంగా జ్యుడిషియల్‌ కమిషన్‌ ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ బిల్లును దేశ చరిత్రలోనే అవినీతిపై పోరాటంలో గొప్ప అడుగుగా మంత్రివర్గం పేర్కొంది. టెండర్లలో పక్షపాతం, గందరగోళం, ప్రజా ధనం లూటీ, అవినీతి తదితర అంశాల అడ్డుకట్టకు ఈ విధానం తోడ్పడుతుందని వెల్లడించింది. మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత, పారదర్శకతకు పెద్దపీట, హైకోర్టు జడ్జి లేదా రిటైర్డ్‌ జడ్జి నేతృత్వంలో టెండర్ల పరిశీలన, అందరికీ సమాన అవకాశాలు, నాణ్యతా ప్రమాణాలు పాటించడం, ఖర్చు విషయంలో జాగ్రత్త పాటించడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యాలని మంత్రివర్గం పేర్కొంది.

చట్టం బిల్లులో ప్రధాన అంశాలు:
ముసాయిదా ప్రకారం.... ‘పనులను ప్యాకేజీలుగా విభజించినా సరే మొత్తం పని విలువ రూ.100 కోట్ల దాటితే.. అన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు హైకోర్టు జడ్జి లేదా హైకోర్టు రిటైర్డ్‌ జడ్జి పరిధిలోకి తీసుకువస్తారు. అన్ని మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పనిని ప్రతిపాదిస్తున్న ప్రతీ శాఖ ఆ పత్రాలను జడ్జికి సమర్పించాల్సిందే. అదే విధంగా టెండర్లను పిలవడానికి ముందుగానే అన్ని పీపీపీ, జాయింట్‌వెంచర్లు, స్పెషల్‌ పర్సస్‌ వెహికల్స్‌ సహా అన్ని ప్రాజెక్టులను జడ్జి పరిశీలిస్తారు. ఈ విషయంలో జడ్జికి సహాయంగా ప్రభుత్వం పలువురు నిపుణులను నియమిస్తుంది. అవసరమైన నిపుణులను జడ్జి కూడా కోరవచ్చు.  జడ్జి సిఫార్సులను తప్పనిసరిగా సంబంధిత శాఖ పాటించాల్సిందే.

కాగా తొలుత వారం రోజులపాటు ప్రజలు, నిపుణుల పరిశీలనకు ప్రజా బాహుళ్యంలోకి పనుల ప్రతిపాదనలు వస్తాయి. ఆ తర్వాత 8 రోజుల పాటు జడ్జి వాటిని పరిశీలించి పలు సూచనలు, సలహాలు అందిస్తారు. ఈ క్రమంలో ఆయనకు సహకరించిన వారికి ప్రభుత్వం తగిన రక్షణ కల్పిస్తుంది. ఈ విధానంలో మొత్తం 15 రోజుల్లో టెండర్‌ ప్రతిపాదన ఖరారు అవుతుంది. ఆ తర్వాతే బిడ్డింగ్‌ ఎవరికీ అదనపు లబ్ధి చేకూర్చకుండా.. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా అర్హత ఉన్న కాంట్రాక్టర్లందరికీ సమాన అవకాశాలు లభిస్తాయి’ అని మంత్రివర్గం పేర్కొంది. ఇక ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా, పనిగట్టుకుని మరీ ఈ ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే.. దానిని నిరోధించడానికి తగిన యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకునేలా జడ్జికి అవకాశం కూడా ఉంటుందని వెల్లడించింది. జడ్జి, జడ్జి దగ్గర పనిచేస్తున్న సిబ్బందిని పబ్లిక్‌ సర్వెంట్లుగా భావిస్తారు గనుక వారికి రక్షణ కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వానిదేనని పేర్కొంది.

మరిన్ని వార్తలు