కాపు రిజర్వేషన్లకు సర్కారు ఓకే

2 Dec, 2017 01:36 IST|Sakshi

ఐదు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయం  

సాక్షి, అమరావతి: కాపు రిజర్వేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలను బీసీల జాబితాలో చేర్చి ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. మంజునాథ కమిషన్‌ సిఫారసుల ప్రకారం కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం చట్టాన్ని చేసి దాన్ని కేంద్రం ఆమోదం కోసం పంపనుంది. సంబంధిత బిల్లును శనివారం శాసనసభలో ఆమోదించనున్నారు. రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లోని బీసీల జాబితాలో కాపులను చేర్చేలా బిల్లు రూపొందించి దాన్ని ఆమోదించనున్నారు.   వెలగపూడి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనిపై విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకున్నారు.

విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసిన సమాచారం మేరకు.. బీసీ (కాపు) రిజర్వేషన్లపై ఏర్పాటైన జస్టిస్‌ మంజునాథ కమిషన్‌ శుక్రవారం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. మంత్రివర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి వుందని వెంటనే నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ వర్గాలు కోరడంతో కమిషన్‌ ఆగమేఘాల మీద నివేదికను ప్రభుత్వానికి పంపింది. జస్టిస్‌ మంజునాథ ఈ కమిషన్‌కు చైర్మన్‌గా ఉండగా సుబ్రహ్మణ్యం, మల్లెల పూర్ణచంద్రరావు, శ్రీమంతుల సత్యనారాయణ సభ్యులుగా ఉన్నారు. నలుగురు సభ్యుల్లో చైర్మన్‌ సహా ముగ్గురు కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. మల్లెల పూర్ణచంద్రరావు మాత్రం కాపులకు రిజర్వేషన్లు అవసరం లేదని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ రిజర్వేషన్ల వల్ల ఇప్పటికే ఉన్న బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆయన అభిప్రాయపడినట్లు సమాచారం. అయితే నలుగురిలో ముగ్గురు సభ్యులు రిజర్వేషన్లు ఇవ్వాలని సిఫారసు చేయడంతో మెజారిటీ నిర్ణయం ప్రకారం దాన్నే కమిషన్‌ నిర్ణయంగా తీసుకుని మంత్రివర్గం చర్చించింది. 

కొత్తగా బీసీ ఎఫ్‌
కమిషన్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలను బీసీలుగా గుర్తించి ఐదు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. బీసీల కోసం ఇప్పటికే ఉన్న ఏ, బీ, సీ, డీ, ఈ కాకుండా కొత్తగా ఎఫ్‌ సెక్షన్‌ను సృష్టించి ఈ నాలుగు కులాలను అందులో చేర్చడానికి ఆమోదం తెలిపింది. అయితే విద్య, ప్రభుత్వ ఉద్యోగాలు, ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో మాత్రమే ఈ రిజర్వేషన్లను వర్తింపచేయాలని స్పష్టం చేసింది. రాజకీయ పదవులకు ఈ రిజర్వేషన్లను వర్తింపచేయకూడదని నిర్ణయించింది. శనివారం శాసనసభలో దీనికి సంబంధించిన చట్టాన్ని ప్రవేశపెట్టి ఆమోదించి దాన్ని గవర్నర్‌కు పంపనున్నారు. రాష్ట్రంలో రిజర్వేషన్ల కోటా 50 శాతానికి మించడంతో  ఆమోదం కోసం ఈ చట్టాన్ని కేంద్రానికి పంపాలని నిర్ణయించారు. ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ సవరణ అవసరమా లేదా అనే దానిపై సమావేశంలో చర్చ జరిగింది. బీసీల జాబితాలో ఇతర కులాలను చేర్చాలంటే రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌ను సవరించాల్సిన అవసరం ఉందా, లేదా అనే దానిపై తర్జనభర్జనలు జరిగినా చివరికి సవరణ అవసరం లేదనే అభిప్రాయం వ్యక్తమైనట్లు తెలిసింది. దీంతో ముసాయిదా చట్టాన్ని ఆమోదించేందుకు శనివారం  మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. మంత్రివర్గంలో ఈ బిల్లుకు ఆమోదముద్ర వేసి వెంటనే శాసనసభ, శాసనమండలిలో దాన్ని ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు.  

కాపు రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకునే అంశంపై బీసీ వర్గానికి చెందిన ఒకరిద్దరు మంత్రులు కొన్ని అభ్యంతరాలను లేవనెత్తినట్లు సమాచారం. దీనిపై తాము సమాధానం చెప్పుకోవడం కష్టమవుతుందని, కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల నష్టపోతామనే అభిప్రాయం బీసీల్లో ఉందని చెప్పారు. అయితే ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని ఈ రిజర్వేషన్ల వల్ల బీసీలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పాలని సూచించినట్లు సమాచారం. కాపు రిజర్వేషన్లపై బీసీ మంత్రులెవరూ వ్యతిరేకంగా స్పందించవద్దని ఆదేశించారు. కాపు రిజర్వేషన్లను వ్యతిరేకిస్తారనే కారణంతో బీసీ మంత్రి పితానిని ఈ సమయంలో విదేశీ పర్యటనకు పంపినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే వాల్మీకి, బోయ కులస్థులను ఎస్‌టీల జాబితాలో చేర్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనిపై శనివారం శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని నిర్ణయించింది. విద్య, ఆర్థిక, సామాజిక, రాజకీయ, ఉద్యోగ రంగాల్లో ఈ కులాలకు ఎస్‌టీ జాబితా కింద రిజర్వేషన్లు కల్పించాలని శాసనసభలో తీర్మానం చేయనుంది. దీనికి రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌ను మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు