అందరి నోటా వికేంద్రీకరణ మాట

5 Jan, 2020 02:13 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు అందరి నోటా వికేంద్రీకరణ అంశం నానుతోంది. పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమన్న వాదన రోజురోజుకీ బలపడుతోంది. ఒకేచోట కేంద్రీకృతమయ్యే పాలన, అభివృద్ధి వల్ల ఇతర ప్రాంతాలు నిర్లక్ష్యానికి గురై వెనుకంజ వేస్తాయని, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే వికేంద్రీకరణ అవసరమని మేధావులు ఎప్పటి నుంచో చెబుతున్నా దానికి పెద్దగా ప్రాధాన్యం లభించలేదు. ఇటీవల అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో రాజధానిపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వికేంద్రీకరణ అంశాన్ని తెరపైకి తెచ్చారు. మూడు రాజధానుల ఏర్పాటు అభిప్రాయం వ్యక్తం చేసినప్పటి నుంచి దానిపైనే సర్వత్రా చర్చ జరుగుతోంది.  
– సాక్షి, అమరావతి

- అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేలా పరిపాలనను వికేంద్రీకరించే ఆలోచనను ముఖ్యమంత్రి వెలిబుచ్చారు. సహజంగానే ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ దీన్ని వ్యతిరేకించి, రాద్ధాంతం మొదలు పెట్టినా ఆ పార్టీలోనూ భిన్న వాదనలు వినిపించాయి.  
- ఉత్తరాంధ్రకు టీడీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, రాయలసీమకు చెందిన ముఖ్య నేత కేఈ కృష్ణమూర్తి వికేంద్రీకరణకు మద్దతు ప్రకటించారు.  
- అమరావతిలోని గ్రామాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ వికేంద్రీకరణ ప్రతిపాదనకు మద్దతు లభించింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహంపై రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి జీఎన్‌రావు కన్వీనర్‌గా నియమించిన నిపుణుల కమిటీ అభివృద్ధి, పాలన వికేంద్రీకరణకు సిఫార్సు చేసింది.
- విశాఖపట్నంలో సచివాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం, అమరావతిలో అసెంబ్లీ, రాజ్‌భవన్, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని జీఎన్‌ రావు కమిటీ సూచించింది.  
 వికేంద్రీకరణపై నిర్ణయం తీసుకునేందుకు మంత్రులు, ఉన్నతాధికారులతో హైపవర్‌ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.  మరోవైపు బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూపు(బీసీజీ) వికేంద్రీకరణపై ఇచ్చిన నివేదిక హాట్‌టాపిక్‌గా మారింది.  
- రూ.1.10 లక్షల కోట్లు అమరావతిలో ఖర్చు పెట్టడానికి బదులు అదే సొమ్మును సాగునీటి ప్రాజెక్టులపై ఖర్చు పెడితే రాష్ట్రంలో సాగు భూమి పెరిగి, ఐదేళ్లలో ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చినట్లవుతుందని బీసీజీ నివేదిక స్పష్టం చేసింది.  

మరిన్ని వార్తలు