చంద్రుడికి చుక్కలు చూపించారు

12 Feb, 2015 00:52 IST|Sakshi
చంద్రుడికి చుక్కలు చూపించారు

మాకు గ్రామాన్ని రాజధాని భూసమీకరణ నుంచి మినహాయించండి
సీఆర్‌డీఏ అసిస్టెంట్ కమిషనర్‌ను పురుగుమందు డబ్బాలతో చుట్టుముట్టిన కురగల్లువాసులు


మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కురగల్లు గ్రామంలో భూసమీకరణను పరిశీలించేందుకు వచ్చిన సీఆర్‌డీఏ అసిస్టెంట్ కమిషనర్ గంధం చంద్రుడుకు గ్రామస్తులు బుధవారం రాత్రి చుక్కలు చూపించారు. ఇప్పటి వరకు భూములు మాత్రమే రాజధానికి తీసుకుంటామని చెబుతున్న అధికారులు ఇళ్లు సైతం తీసుకుంటారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారి వచ్చిన విషయం తెలిసిన గ్రామస్తులు, రైతులు, మహిళలు, పిల్లలతో సహా పంచాయతీ కార్యాలయానికి పురుగుమందు డబ్బాలతో చేరుకుని ఒక్కసారిగా అధికారులపై విరుచుకుపడ్డారు.

‘మాకు రాజధాని వద్దు.. మా గ్రామాన్ని రాజధాని నిర్మాణంలో తొలగించాలి..’ అని డిమాండ్ చేశారు. లేకపోతే పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. వారికి ఎలాగో నచ్చచెప్పిన ఆయన కారులో వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో మహిళలు తమను చంపి రాజధాని నిర్మించుకోండంటూ కారును చుట్టుముట్టి రెండుగంటలు ఆయన్ని ఘెరావ్ చేశారు.

భూసమీకరణ డిప్యూటీకలెక్టర్ వరభూషణరావు, తహశీల్దార్ చంద్రశేఖర్ నచ్చచెప్పినా గ్రామస్తులు వినకపోవడంతో కారుదిగిన చంద్రుడు గ్రామస్తులు, రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఒకదశలో రైతులు మహిళలు బాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చివరకు అధికారులు వారికి ఎలాగోలా నచ్చజెప్పి అక్కడినుంచి బయటపడ్డారు.
 

>
మరిన్ని వార్తలు