రాజకీయ పార్టీల నేతలతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భేటీ

11 Mar, 2019 18:29 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా అధికార పార్టీ నేతల ప్లెక్సీలు తొలగించలేదని, చనిపోయిన వారి ఓట్లను తొలగించలేదని తదితర విషయాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామని వైఎస్సార్‌సీపీ నేత మల్లాది విష్ణు అన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీ సోమవారం ఏర్పాటు చేసిన సమావేశం ముగిసింది. ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీ నేత మల్లాది విష్ణు, సీపీఎం నేత వైవీ, బీజేపీ నేత కృష్ణ మూర్తి హాజరయ్యారు. భేటీ అనంతరం వైఎస్సార్‌సీపీ నేత మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. చనిపోయిన వాళ్లు, రెండు మూడు నియోజకవర్గాలలో ఓటు హక్కు కలిగి ఉన్నవారి ఓట్లను తొలగించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశామన్నారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న పోలీసులను మార్చాలని కోరామని చెప్పారు.

సీపీఐ నేత వైరా మాట్లాడుతూ..కిందిస్థాయిలో పోలీసులు, ఇతర అధికార యంత్రాంగం అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రంపచోడవరంలో లెఫ్ట్, జనసేన ప్రచార సభకు అనుమతుల్లో పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరించారని, ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామన్నారు. షెడ్యూల్ ప్రకటించాక సీపీఎం కార్యకర్తలనుపోలీసులు బైండోవర్ చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని చెప్పామన్నారు.

బీజేపీ నేత కృష్ణమూర్తి మాట్లాడుతూ.. ఓటరు స్లిప్స్‌ రెండు రోజుల ముందే ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని కోరామని చెప్పారు. అధికార పార్టీ నేతల ప్లెక్సీలు ఇంకా ఉన్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశామన్నారు. రేపటిలోగా అధికార ప్లెక్సీలు తొలగిస్తామని ద్వివేది తెలిపారన్నారు.

మరిన్ని వార్తలు