కనబడని రాజధాని కోసం కోట్లు ఖర్చు

14 Jan, 2020 19:38 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ కడప: అమరావతిలో భూములు నష్టపోయిన రైతులకు అండగా ఉంటామని ప్రభుత్వ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. లోటు బడ్జెట్‌లో కేవలం అమరావతికే లక్ష కోట్లకు పైగా కేటాయించడమంటే మిగతా ప్రాంతాలు నిర్లక్ష్యం చేసినవారమవుతామన్నారు. రాజంపేట ఎంపీ మిథున్‌ రెడ్డి, ప్రభుత్వ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్‌లు జిల్లాలో మంగళవారం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బోస్టన్‌, జీఎన్‌ రావు కమిటీల నివేదికలను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతిని గ్రాఫిక్స్‌లో చూపించారని విమర్శించారు. కనపడని రాజధాని కోసం రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేసి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను అధోగతిపాలు చేశారని మండిపడ్డారు. సీఎం జగన్‌ స్వార్థపరుడైతే కడపను రాజధానిగా చేసేవారని చెప్పుకొచ్చారు. కానీ 13 జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరుకుంటున్నారన్నారు. సీఎం జగన్‌ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సినిమా యాక్టర్లతో జనాలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించడం చంద్రబాబుకు మాత్రమే చెల్లిందన్నారు.

శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం రాయలసీమలో హైకోర్టు లేదా రాజధాని ఏర్పాటు చేయాలన్నారు. మేము అడగకముందే మాకు హైకోర్టు ఇస్తున్నందుకు గర్వపడుతున్నామని తెలిపారు. కృత్రిమ ఉద్యమాలు చేయిస్తున్న టీడీపీ ఉత్తరాంధ్ర, రాయలసీమల అభివృద్ధి పట్ల వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. కేవలం ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడి కొనుగోలు చేసిన భూముల విలువలు కాపాడటానికి తప్పితే రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ పోరాడింది లేదని విమర్శించారు. ప్రభుత్వం మీద బురద జల్లడమే టీడీపీ పనిగా పెట్టుకొందని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో టీడీపీ నాయకులకు బయట తిరిగే పరిస్థితి లేదని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు