పవన్‌కల్యాణ్‌ ఓ అమీబా

4 Dec, 2019 10:26 IST|Sakshi
పాదయాత్రలో శ్రీకాంత్ రెడ్డి వెంట చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి

ఒక్కసారి కనిపిస్తే మళ్లీ నాలుగు నెలలు కనిపించరు  

దేవుడిని రాజకీయాల్లోకి లాగాలనుకోవడం దుర్మార్గం 

ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి ధ్వజం

తిరుపతి రూరల్‌ : పవన్‌కల్యాణ్‌ ఓ అమీబా అని, ఒకసారి కనిపిస్తే మళ్లీ నాలుగు నెలల వరకు కనిపించరని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. గండిక్షేత్రం నుంచి తిరుమలకు ఆయన చేస్తున్న పాదయాత్ర మంగళవారం ఐదో రోజుకు చేరింది. మంగళవారం చంద్రగిరి నియోజకవర్గం భాకరాపేట నుంచి శ్రీవారి మెట్టు వరకు ఈ పాదయాత్ర కొనసాగింది. అనంతరం శ్రీనివాసమంగాపురం వద్ద ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజకీయ అజ్ఞానంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై పవన్‌ కల్యాణ్‌ ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. అమీబా ఒక్కసారి తింటే నాలుగు నెలల వరకు నిద్రపోతుందని, ఆయన కూడా ఒకసారి జనంలోకి వచ్చి మళ్లీ నాలుగు నెలల వరకు కనిపించకుండా పోతారని ఎద్దేవా చేశారు.

చిత్తుగా ఓడిన చంద్రబాబును ఆదుకునేందుకు పవన్‌ పడుతున్న ఆరాటం చూస్తుంటే జాలిగా ఉందన్నారు. చంద్రబాబు, తాను ఒకటేనని దమ్ముంటే పవన్‌ కల్యాణ్‌ బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. తమ స్వార్థ రాజకీయాల కోసం దేవుడిని వాడుకోవాలని ప్రయత్నించడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత ఆరు నెలల్లో ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను సీఎం జగన్‌ ప్రవేశపెట్టారని, వాటి పేర్లు చంద్రబాబు గాని, పవన్‌కల్యాణ్‌గాని కరెక్ట్‌గా చెబితే తాను రాజకీయాల నుంచి వైదొలుగుతానని సవాల్‌ విసిరారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన ప్రతి ఒక్కటి అమలుచేసుకుంటూ పోతున్నారని, ఆయన్ని ధైర్యంగా ఎదుర్కోలేకే దేవుడిని రాజకీయాల్లోకి లాగాలని ప్రయతి్నస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి తప్పుడు ఆలోచనలను మానుకోకపోతే జనం తరిమికొడతారని హెచ్చరించారు.
 
ఎమ్మెల్యేల సంఘీభావం 
శ్రీకాంత్‌రెడ్డి పాదయాత్ర మంగళవారం భాకరాపేట నుంచి ప్రారంభమై రాత్రికి శ్రీనివాసమంగాపురంలోని శ్రీవారి మెట్టుకు చేరుకుంది. ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, తిరుపతి, తంబళ్లపల్లె, సత్యవేడు ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి, ఆదిమూలం పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలిపారు. శ్రీనివాసమంగాపురంలో కల్యాణ వెంకన్నను దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు.   

మరిన్ని వార్తలు