ఒక్కో ఇంటికి వెయ్యి రూపాయలు

30 Mar, 2020 05:09 IST|Sakshi
సీఎం సలహాదారు లోకేశ్వర్‌రెడ్డి వైఎస్సార్‌ జిల్లా ఉప్పరపల్లిలో ఏర్పాటు చేసిన తాగునీటి ఫ్లాంట్

సొంత ఊరికి సీఎం సలహాదారు లోకేశ్వర్‌రెడ్డి సాయం

రూ.7.5 లక్షలతో మంచినీటి ప్లాంటు ఏర్పాటు

గ్రామంలో ఒక్కో ఇంటికి రూ. వెయ్యి చొప్పున ఆర్థిక సాయం

సాక్షి, అమరావతి/కడప: లాక్‌ డౌన్‌ సమయంలో ఇబ్బంది పడుతున్న తన సొంత ఊరి ప్రజలను ఆదుకోవడానికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి సాంకేతిక ప్రాజెక్టుల సలహాదారు తుమ్మల లోకేశ్వర్‌రెడ్డి ముందుకొచ్చారు. వైఎస్సార్‌ జిల్లా చెన్నూరు మండలం ఉప్పరపల్లి గ్రామంలో మంచినీళ్ల ప్లాంటును యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయిస్తున్నారు. రూ. 7.5 లక్షల వ్యయంతో ఈ ప్లాంటును ఏర్పాటు చేస్తున్నారు. గ్రామంలో ప్రజలందరికీ ఉచితంగా శుద్ధి చేసిన మంచినీరు సరఫరా చేయనున్నారు. గ్రామంలో ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్న పేదలు, ఆర్థికంగా వెనుకబడిన 600 కుటుంబాలకు రూ. వెయ్యి (రూ. 6 లక్షలు) చొప్పున ఆర్థిక సాయం అందజేశారు. దీంతో పాటు జాతీయ రహదారి నుంచి గ్రామంలోపలి వరకూ 1.2 కిలోమీటర్ల మేర వీధి దీపాలను ఏర్పాటు చేశారు.

లోకేశ్వర్‌రెడ్డి సోదరుడు  త్రిలోక్‌నాథ్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. లోకేశ్వర్‌రెడ్డి తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. ‘అదరద్దు, బెదరద్దు.. నిర్లక్ష్యం అసలే వద్దు’ అన్న నినాదంతో తమ గ్రామంలో కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు వివరించారు. వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలు ఇంటింటికి తిరిగి కరోనాపై అవగాహన కల్పించారు.ఈ ప్రమాదకరమైన వైరస్‌ను సామాజిక దూరం పాటించడం ద్వారానే తరిమిగొట్టగలమని ప్రజలకు వివరించారు. 

మరిన్ని వార్తలు