చంద్రబాబుకు భూదాహం

12 Jul, 2016 01:34 IST|Sakshi

ఏపీ రైతు సంఘం
 
విజయవాడ (భవానీపురం) : మచిలీపట్నం పోర్టు, ఇండస్ట్రియల్ కారిడార్ కోసం లక్ష ఎకరాల భూమిని సమీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించడం ముఖ్యమంత్రి చంద్రబాబు భూ దాహానికి నిదర్శనమని ఏపీ రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు బి.బలరాం, వంగల సుబ్బారావు సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. బందరు, పెడన మండల పరిధిలో 30 గ్రామాల్లో భూ సమీకరణకు రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించటం, అందుకు ప్రభుత్వం పూనుకోవడం దారుణమని పేర్కొన్నారు. 30 గ్రామాల్లో ఈ భూమినంతటినీ మచిలీపట్నం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ ద్వారా సంవత్సరంలోపు తీసుకోనుందని ఆరోపించారు. కేవలం రెండు వేల ఎకరాలు సరిపోయే పోర్టుకు లక్ష ఎకరాలు సేకరించడం క్విడ్ ప్రోకో కోసమేనని విమర్శించారు. గతంలో భూ సేకరణకు గ్రామాల్లో సభలు నిర్వహించేందుకు ఎంపీ కొనకళ్ల నారాయణ, మంత్రి కొల్లు రవీంద్ర వెళ్తే ప్రజలు తిరుగుబాటు చేశారని గుర్తు చేశారు.


మచిలీపట్నం కోన గ్రామంలో ఇద్దరు నేతలను తరిమి కొట్టారని పేర్కొన్నారు. పొట్లపాలెంలో ఏర్పాటు చేసిన సభను బహిష్కరించారని వివరించారు. భూ సమీకరణ పేరుతో ఏకంగా 426 చదరపు కిలోమీటర్‌ల పరిధిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుందని, దీంతో బందరు మండలంతోపాటు 29 గ్రామాల, పెడన మండలంలోని కాకర్లమూడితో కలిసి 30 గ్రామాలు కనుమరుగుకానున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ గ్రామాల్లో సుమారు 2.25 లక్షల మంది వ్యవసాయంపైనే జీవనం సాగిస్తున్నారని తెలిపారు.  ఇప్పుడుకూడా ప్రభుత్వం భూ సమీకరణ ఆపకపోతే రైతులు తీవ్రంగా ప్రతిఘటిస్తారని హెచ్చరించారు.
 

మరిన్ని వార్తలు