మీకంటే చైనావాళ్లే సూపర్‌ ఫాస్ట్‌

21 Dec, 2018 02:36 IST|Sakshi

తొమ్మిది నెలలు టైం ఇస్తే ఎనిమిది నెలల్లో పూర్తి చేస్తామన్నారు

అదే భారతీయులను పూర్తి  చేయమంటే.. 9 నెలల్లోనా? అంటారు

టీసీఎల్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌  భూమిపూజ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు

సాక్షి, తిరుపతి: ‘‘మీ(భారతీయులు) కంటే చైనీయులు సూపర్‌ ఫాస్ట్‌. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న టీసీఎల్‌ కంపెనీ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి 9 నెలల సమయం ఇస్తున్నానని చెప్పాను. వాళ్లు(చైనీయులు) ఎనిమిది నెలల్లో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అదే తొమ్మిది నెలల్లో పూర్తి చేయమని మీకు(భారతీయులు) చెబితే.. తొమ్మిది నెలలా? అని ఆశ్చర్యంగా అడిగేవారు. అదీ చైనీయుల కమిట్‌మెంట్‌. చైనావారు పట్టుదల, అంకితభావం, స్పీడ్‌తో ముందుకు వెళ్తుంటారు’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు చైనీయులను పొగడ్తల్లో ముంచెత్తారు. చిత్తూరు జిల్లా తిరుపతి శివారులో రేణిగుంట విమానాశ్రయం సమీపంలో వికృతమాల వద్ద టీసీఎల్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌కు గురువారం చంద్రబాబు భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... రేణిగుంట విమానాశ్రయం వద్ద 1,000 ఎకరాల్లో కొత్తగా సిలికాన్‌ సిటీని నిర్మిస్తున్నట్లు తెలిపారు. తిరుపతిని హార్డ్‌వేర్, ఎలక్ట్రానిక్స్‌ హుబ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. టీసీఎల్‌ ప్రాజెక్టు రాకతో 6 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రాష్ట్రంలో 2,618 ప్రాజెక్టుల్లో రూ.15 లక్షల కోట్ల పెట్టుబడితో 33 లక్షల మందికి ఉపాధి కల్పించనున్నట్లు వెల్లడించారు. 

2020 నాటికి 15 శాతం వృద్ధిరేటు 
ఆంధ్రప్రదేశ్‌ను 2029లోపు దేశంలోనే నెంబర్‌ వన్‌ రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచం లోనే అత్యుత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. 2020 నాటికి 15 శాతం వృద్ధిరేటు ఉండేలా పని చేస్తామన్నారు. తిరుపతి, నెల్లూరు, చెన్నైలను కలుపుతూ సిలికాన్‌ కారిడార్‌గా రూపొందిస్తున్నామని తెలిపారు. దుగరాజపట్నం, రామాయపట్నం పోర్టులు ఇందులో భాగమవుతాయని అన్నారు. ఎలక్ట్రానిక్స్, ఐటీ తదితర పరిశ్రమల రాకతో చిత్తూరు జిల్లా రూపురేఖలు మారిపోతాయని, ప్రపంచ పటంలో ప్రముఖ స్థానం పొందుతుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. గ్లోబల్‌ టీవీ మార్కెట్‌లో జపాన్, కొరియాలతో తమ సంస్థ పోటీ పడుతోందని టీసీఎల్‌ ఛైర్మన్, సీఈఓ థామ్సన్‌ లీ పేర్కొన్నారు. టీసీఎల్‌ వ్యూహాత్మక మార్కెట్‌ ఇండియా అని చెప్పారు. టీవీ ప్యానళ్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే టీసీఎల్‌ మూడో స్థానంలో కొనసాగుతోందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ విజయానంద్‌ మాట్లాడారు. 

దేశంలో బీజేపీ పతనం మొదలైంది 
తిరుపతి సమీపంలోని పాడిపేట వద్ద నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మించిన 3,216 గృహాలను ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలో బీజేపీ పతనం ప్రారంభమైందని పేర్కొన్నారు. నరేంద్ర మోదీ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఇవ్వకుండా నమ్మక ద్రోహం చేశారని ఆరోపించారు. బీజేపీ సహకరించి ఉంటే ఏపీని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేవాళ్లమని అన్నారు. ఏపీలో తెలివైనవారు ఉన్నారనే ఉద్దేశంతో నరేంద్రమోదీ కక్షగట్టారని ధ్వజమెత్తారు. కర్ణాటక ఎన్నికల్లో తాను ఇచ్చిన పిలుపుతో బీజేపీని ఓడించామన్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయిందని చెప్పుకొచ్చారు. జాతీయ స్థాయిలో పది మంది ఉంటే రాష్ట్రానికి మేలు జరుగుతుందనే ఉద్దేశంతోనే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో 25 ఎంపీ సీట్లలో టీడీపీని గెలిపించాలని చంద్రబాబు కోరారు. 

మరిన్ని వార్తలు