వందేళ్లలో ఎంత నీరొచ్చింది

15 May, 2015 02:28 IST|Sakshi

 గోదావరిలో నీటిమట్టాలు..
 పోలవరం ప్రాజెక్ట్
 పనులపై సీఎం ఆరా
 ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించిన చంద్రబాబు
 అధికారులతో సమీక్ష
 ప్రాజెక్ట్ ప్రాంతంలో
 నిద్రకు ఉపక్రమించిన
 ముఖ్యమంత్రి

 
 సాక్షి ప్రతినిధి, ఏలూరు :గడచిన వందేళ్లలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో ఏ మేరకు వరద నీరు వచ్చిందని, గోదావరిలో నీటి మట్టాల పరిస్థితి ఏమిటని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను అడిగి తెలుసుకున్నారు. గురువారం సాయంత్రం ఆరు గంటల సమయంలో పోలవరం మండలం రామయ్యపేటలో పోలవరం ప్రాజెక్టు కొండ వద్దకు హెలికాప్టర్‌లో ముఖ్యమంత్రి చేరుకున్నారు. అనంతరం గోదావరిలో నీటిమట్టాలు, ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో వరద పరిస్థితి, ప్రాజెక్ట్ వివరాలను సీఎం ఆరా తీశారు. ప్రాజెక్టు ఇంజినీరింగ్ చీఫ్ ఎం.వెంకటేశ్వరరావు, ఎస్‌ఈ వీఎస్ రమేష్‌బాబు, కాంట్రాక్ట్ ఏజెన్సీ ఎండీ చెరుకూరి శ్రీధర్ ప్రాజెక్టు వివరాలను సీఎంకు వివరించారు. వరద సమయంలో పోలవరం ప్రాజెక్ట్ ప్రాం తం వద్ద గోదావరిలో 28లక్షల క్యూసెక్కుల నుంచి 36లక్షల క్యూసెక్కుల వరకు నీరు వచ్చిందని ఇంజినీరింగ్ చీఫ్ వెంకటేశ్వరరావు సీఎంకు వివరించారు.
 
 చరిత్రలో ఇంతకంటే ఎక్కువ వరద ఎప్పుడైనా వచ్చిందా అనిముఖ్యమంత్రి ప్రశ్నించగా.. రాలేదని చెప్పారు. ప్రాజెక్ట్ నుంచి 50 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్లేలా డిజైన్ చేశామని సీఈ ముఖ్యమంత్రికి వివరించారు. స్పిల్ వే, ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్, కాపర్ డ్యామ్, శాడిల్ డ్యామ్, డయా ఫ్రమ్ వాల్ నిర్మాణ వివరాలను సీఎం అడిగి తెలుసుకున్నారు. హెలికాప్టర్ దిగిన వెంటనే పక్కనే ఏర్పాటు చేసిన వేదికపైకి చేరుకున్న ముఖ్యమంత్రి ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు వివరాలను తెలుసుకుని అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాన్వాయ్‌లో ట్రాన్స్‌ట్రాయ్ క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రాత్రి ప్రాజెక్ట్ ప్రాంతంలోనే నిద్రించారు.
 
 సీఎం కోసం ఎదురుచూపులు
 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాయంత్రం 4 గంటలకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకోవాల్సి ఉండగా, 6 గంటల సమయంలో హెలికాప్టర్‌లో కొండపై ఏర్పా టు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి కోసం రెండు గంటలకు పైగా ఎదురుచూడాల్సి రావడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు కొంత అసహనానికి గురయ్యారు.
 
 ఒకపక్క చీకటి పడుతోందని, ఇంకా ముఖ్యమంత్రి రాలేదంటూ ఆందోళన చెందారు. భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు హెలికాప్టర్‌లో సీఎం వెంట వచ్చారు. సీఎంకు రాజ్యసభ సభ్యులు తోట సీతారామలక్ష్మి, మంత్రి పీతల సుజాత స్వాగతం పలికారు. మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, పీతల సుజాత, దేవినేని ఉమామహేశ్వరరావు, జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, డీసీసీబీ చైర్మన్ ముత్యాల వెంకటరత్నం, ఎంపీ మాగంటి బాబు ఎమ్మెల్యేలు మొడియం శ్రీనివాస్, బూరుగుపల్లి శేషారావు, ముప్పిడి వెంకటేశ్వరరావు, పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), కేఎస్ జవహర్, బండారు మాధవనాయుడు, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, శాసనమండలి విప్ అంగర రామ్మోహన్, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, కలెక్టర్ కె.భాస్కర్, డీఐజీ పి.హరికుమార్, ఎస్పీ భాస్కర్‌భూషణ్ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు