ఆక్వా రైతులతో సీఎం సమావేశం

26 May, 2018 14:45 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆక్వా రైతులు, ఎగుమతిదారులతో శనివారం సమావేశం ఏర్పాటు చేశారు. ఆక్వా రంగాన్ని, రాయలసీమలో ఉద్యాన రంగాన్ని తాము ప్రోత్సహిస్తూ వచ్చామని, ఆక్వా రైతు బాగుండాలనే విద్యుత్‌ ధరలు తగ్గించినట్టు చెప్పారు. ఆక్వా సాగుకు వినియోగించే విద్యుత్‌పై మరింత సబ్సిడీ ఇవ్వనున్నామని తెలిపారు. ఏడాది పాటు యూనిట్‌ విద్యుత్‌ రూ.2కే సరఫరా చేయనున్నట్టు పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వంపై రూ.300 కోట్లకు పైగా అదనపు భారం పడనుందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు ఆక్వా రైతులు ప్రాముఖ్యత ఇవ్వాలని, ఇష్టానుసారంగా యాంటీ బయాటిక్స్‌ వినియోగించడం మంచిది కాదని చంద్రబాబు రైతులకు సూచించారు. 

పర్యావరణ రహితంగా వ్యాధుల నియంత్రణపై దృష్టి పెట్టాలని, పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకోవాలని రైతులకు చెప్పారు. రిజిస్ట్రేషన్‌ లేకుండా ఆక్వా సాగు సరికాదని, అ‍క్రమ సాగుపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించకుండా.. నష్టపోకుండా అందరూ జాగ్రత్త పడాలని హెచ్చరించారు. ప్రాసెసింగ్‌ యూనిట్లు నెలకొల్పేందుకు ముందుకొచ్చేవారికి రైతులు సహకరించినప్పుడే గిట్టుబాటు ధర లభిస్తుందని, రొయ్యల ఫీడ్‌ ధరలపై ఉత్పత్తిదారులు-రైతులు ఒకరిని ఒకరు నిందించుకోకుండా సమస్యను పరిష్కరించుకోవాలని చంద్రబాబు సూచించారు.  

మరిన్ని వార్తలు