ప్చ్‌..! ఎమ్మెల్యేలా?

18 Feb, 2018 13:40 IST|Sakshi

ఎవరికీ పట్టని విజయవాడ సిటీ ఎమ్మెల్యేలు

మేయర్‌ మార్పులో చెల్లని గద్దె మాట

మంత్రి పదవి ఆశించి భంగపడిన బొండా ఉమా

వక్ఫ్‌బోర్డు పదవి దక్కని జలీల్‌ఖాన్‌

మేయర్‌ కోనేరు శ్రీధర్‌కు చినబాబు వత్తాసు

వారు పేరుకు మాత్రమే అధికార పార్టీకి చెందిన  ఎమ్మెల్యేలు. వారి మాట ఎక్కడా సాగదు. మంత్రివర్గ   విస్తరణలో కానీ, కీలక పదవులు పొందడంలో కానీ.. వారికి నో చాన్స్‌. కనీసం వారు చేసిన సూచనలను కూడా ప్రభుత్వం పట్టించుకోదు. దీంతో విజయవాడ సిటీ ఎమ్మెల్యేల్లో అంతర్మథనం ఆరంభమైంది. అధికార పార్టీలో ఉన్నా ఏం సాధించుకోలేకపోతున్నామన్న నైరాశ్యం చేరిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

సాక్షి, విజయవాడ: ఓ అక్రమ నిర్మాణానికి సహకరించాలని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామోహ్మన్‌ చేసిన సిఫారసును మేయర్‌ కోనేరు శ్రీధర్‌ పట్టించుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య వివాదం ఏర్పడింది. కార్పొరేషన్‌లో మేయర్‌ ఏకపక్షంగా ఉంటూ తమ సిఫారసులను పట్టించుకోకపోవడంతో గుర్రుతో ఉన్న సెంట్రల్‌ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న  అంతర్గతంగా గద్దె రామ్మోహన్‌కు మద్దతుగా నిలిచారు. పలువురు కార్పొరేటర్లు మేయర్‌ శ్రీధర్‌ అవినీతిపై రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకువెళ్లారు. ఎమ్మెల్యేలంతా మేయర్‌ను మార్చాలని సూచించినా రాష్ట్ర ప్రభుత్వంలో కీలకపాత్ర వహించే చినబాబు కోనేరు శ్రీధర్‌కు అండగా నిలవడంతో మార్పు ప్రతిపాదన పక్కకు పోయింది.

మంత్రి పదవి భంగపడ్డ బొండా ఉమా
గతంలో జరిగిన మంత్రివర్గ విస్తరణలో రాజధాని నుంచి తనకు అవకాశం లభిస్తుందని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆశపడ్డారు. అయితే, ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోలేదు. కాపుల గొంతు కోస్తున్నారంటూ బొండా ఉమా చేసిన వ్యాఖ్యలపై సీఎం సీరియస్‌ అయ్యారు. రవాణాశాఖ కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యంతో రవాణాశాఖ కార్యాలయం వద్ద వివాదం జరిగినప్పుడు కూడా ఉమాపై చంద్రబాబు ఆగ్రహించారు. ఆ తరువాత ఎంపీ కేశినేని శ్రీనివాస్‌తో కలిసి బొండా ఉమా సదరు అధికారికి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. స్వాంత్రంత్య్ర సమరయోధుడికి చెందిన స్థలం కబ్జాలోనూ ఎమ్మెల్యే బొండా ఉమా పాత్ర ఉండటంతో సీఎం సీరియస్‌ అయ్యారు.

వక్ఫ్‌బోర్డు చైర్మన్‌ పదవి దక్కని జలీల్‌ఖాన్‌
మైనారిటీ కోటాలో మంత్రి పదవి వస్తుందని ఆశపడిన ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ తన నైతిక విలువలను పక్కనపెట్టి పచ్చ కండువా కప్పుకున్నారు. అయితే, మంత్రివర్గ విస్తరణలో ఆయనకు సీఎం మొండిచేయి చూపించారు. కనీసం రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ పదవితోనైనా సరిపెట్టుకునేందుకు జలీల్‌ సిద్ధమయ్యారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కోటా నుంచి ఒకరిని వక్ఫ్‌ బోర్డు సభ్యుడిగా ఎన్నుకుంటారు.

ఆ సభ్యుడితో పాటు ఇంకా ఎనిమిది మంది సభ్యులుగా ఉంటారు. వీరిలో ఒకరిని మిగిలిన సభ్యులు చైర్మన్‌గా ఎన్నికుంటారు. అయితే, ఎమ్మెల్సీ గురించి పట్టించుకోకుండా కేవలం ఎమ్మెల్యేలకు జలీల్‌ఖాన్‌ను మాత్రమే సభ్యుడిగా నియమిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే ముస్తఫా కోర్టులో సవాల్‌ చేశారు. ఈ కేసు ప్రస్తుతానికి హైకోర్టులో పెండింగ్‌లో ఉండటంతో జలీల్‌ఖాన్‌కు కనీసం చైర్మన్‌ పదవి కూడా దక్కలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.  

మేయర్‌ వెనుక మాస్టారు
త న భార్య డైరెక్టర్‌గా ఉన్న కేఎంకే ఈవెంట్స్‌ సంస్థకు మేయర్‌ పుష్కరాల వర్క్స్‌ కట్టబెట్టారని, మిగిలిన సంస్థల కంటే ఆ సంస్థకుæ బిల్లులు ముందుగానే మంజూరు చేయించి అవినీతికి పాల్పడ్డారని కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. అయితే, అదే కేఎంకే సంస్థలోని కీలక డైరెక్టర్లతో చినబాబుకు పరిచయాలెక్కువే. కేఎంకే సంస్థ డైరెక్టర్ల నుంచి తమ వాటా పర్సంటేజ్‌లు రావడం వల్లే మేయర్‌ మార్పునకు ఎమ్మెల్యేలు పట్టుబట్టినా చినబాబు పదవి నుంచి తప్పించలేదని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మేయర్‌ కోనేరు శ్రీధర్‌నే కొనసాగిస్తూనే విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌పై పెత్తనం చేయాలని చినబాబు భావిస్తున్నారు. రాబోయే ఏడాదిలో వీఎంసీలో జరిగే అభివృద్ధి పనుల్లో తమకు రావాల్సిన వాటాలను మేయర్‌ ద్వారానే తీసుకునేందుకు తగిన ఏర్పాట్లు చేసుకున్నారని కార్పొరేటర్లు చర్చించుకుంటున్నారు. చినబాబే తన వెనుక ఉండటం వల్ల మేయర్‌ ఎమ్మెల్యేలను, కార్పొరేటర్లను లెక్క చేయట్లేదు.

మరిన్ని వార్తలు