ప్రధాన పర్యాటక కేంద్రంగా కొల్లేరు

21 Feb, 2017 17:02 IST|Sakshi
ప్రధాన పర్యాటక కేంద్రంగా కొల్లేరు

కార్యాచరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం
 
అమరావతి : కొల్లేరు సరస్సును రాష్ట్రంలో ప్రధాన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు వన్యప్రాణి సంరక్షణ శాఖ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మంగళవారం ఏపీ స్టేట్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. కొల్లేరును పర్యాటక కేంద్రం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు వారంలోగా పొందేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాను ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించవద్దని, దీనికి అడ్డుకట్ట వేసేందుకు అరికట్టడానికి పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు.

రాష్ట్రంలోని పక్షి సంరక్షణ కేంద్రాలను, జింకలు, ఎలుగుబంటుల పార్కులను మరింత అభివృద్ధి చేసి, ఆకర్షణీయ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలని సీఎం అధికారులను ఆదేశించారు. దేశంలోనే పెద్దదైన పులుల సంరక్షణ కేంద్రం మన రాష్ట్రంలోనే వుందని దానిని టూరిస్ట్ స్పాట్‌గా మార్చాలంటే దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులను అనుమతించాల్సి ఉంటుందన్నారు. ఇందుకోసం అధికారులు కృషి చేయాలని చెప్పారు.
 
ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నగర వనాలను త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభించాలని ముఖ్యమంత్రి నిర్ధేశించారు. విజయవాడలోని ఓ కొండను నైట్ సఫారీకి అనువుగా తీర్చిదిద్దే అంశాన్ని పరిశీలించి నివేదిక అందజేయాలని సూచించారు. అడవుల్లో పెద్దఎత్తున చెక్ డ్యాంలు నిర్మించి అటవీ  విస్తీర్ణం పెంచడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా చెప్పారు. రాష్ట్రంలో ఎవరు మొక్కలు పెంచేందుకు ముందుకొచ్చినా, అడిగిన వెంటనే అందించే విధంగా ట్రీ బ్యాంకు ఏర్పాటు చేయాలని, అవసరమైతే ఆన్‌లైన్‌లో కూడా మొక్కలు అందించడానికి అటవీ శాఖ సిద్ధంగా ఉండాలని అన్నారు. తీర ప్రాంతంలో మామిడి తోటల పెంపకం చేపట్టాలని చెప్పారు. సమీక్షలో ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, అటవీశాఖ ముఖ్య కార్యదర్శి అనంతరాము, పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీకాంత్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు