జిల్లాలో పర్యాటక వెలుగులు

13 Oct, 2019 08:43 IST|Sakshi

జిల్లా పర్యాటకానికి నలువైపులా కొత్త ఊపు

అద్దాల వంతెనతో గండికోటకు ఖ్యాతి

ప్రభుత్వ నిర్ణయాలతో ప్రగతి పథంలో పర్యాటకం

సాక్షి, కడప :  జిల్లా పర్యాటకానికి కొత్త ఊపు రానుంది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  జిల్లాలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా అంతర్జాతీయ ఖ్యాతి గల గండికోటలో రెండు కొండల మధ్య అద్దాల వంతెన ఏర్పాటు చేసేందుకు నిర్ణయించడంతో జిల్లా పర్యాటకుల్లో కొత్త ఆశలు మొదలయ్యాయి. ఊహించని రీతిగా సోమశిల ప్రాజెక్టును జల పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని తీసుకున్న నిర్ణయం కూడా జిల్లా పర్యాటక అభిమానుల్లో జోష్‌ నింపుతోంది. ఇంతకుముందే ఇడుపులపాయను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించి ఉండడంతో జిల్లా నలుమూలల ఇక పర్యాటక వెలుగులు కనిపించనున్నాయని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం రాష్ట్ర పర్యాటకాభివృద్దిపై తీసుకున్న నిర్ణయాలలో మన జిల్లాకు సంబంధించి పర్యాటకం అభివృద్ది పథంలో పరుగులు తీయనున్నట్లు అభిమానులు భావిస్తున్నారు. అలాగే జిల్లా పర్యాటకాభిమానులు, సంస్థల్లో కొత్త సంతోషం కనిపిస్తోంది.  

నలు వైపులా..
ఇంతకుముందే ఒంటిమిట్టకు ప్రభుత్వ లాంఛనాలు దక్కడంతో తూర్పు పర్యాటక ప్రాంతం ఇప్పుడు ఇడుపులపాయ అభివృద్ధితో దక్షిణ‡ప్రాంత పర్యాటకం, సోమశిలతో ఉత్తర పర్యాటకం, గండికోటతో పడమర పర్యాటక ప్రాంతాలు అభివృద్ధి చెందే అవకాశాలు పెరిగాయి. తిరుపతి నుంచి రైల్వేకోడూరు ఉద్యాన పరిశోధన కేంద్రం, రాజంపేటలో కన్నప్ప ఆలయం, అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాక, నందలూరు సౌమ్యనాథ ఆలయం, బౌద్దారామాలు, ఒంటిమిట్ట వరకు తూర్పు పర్యాటక సర్క్యూట్‌గా ఇప్పటికే అభివృద్ధి పథంలో ఉన్నాయి. గండికోటలో అద్దాల వంతెన పథకం విజయవంతమైతే పడమర పర్యాటక ప్రాంతాలు కూడా సహజంగా అభివృద్ది చెందగలవు. ఇడుపులపాయతో దక్షిణ పర్యాటక ప్రాంతా లు రాయచోటి, రాక్‌ గార్డెన్స్, వెలిగల్లు ప్రాజెక్టు, వేంపల్లె గండిక్షేత్రంలకు పర్యాటక కళ రానుంది. సోమశిల అభివృద్ధితో గోపవరం, మొల్లమాంబ జన్మస్థలి, బ్రహ్మంగారిమఠం, బద్వేలు లక్ష్మిపాలెం ఆలయం, వనిపెంట ప్రాంతాలు ఉత్తర విభాగంగా అభివృద్ది చెందే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న   పర్యాటకాభివృద్ది నిర్ణయాలతో జిల్లా నాలుగు వైపుల నాలుగు ప్రత్యేకమైన పర్యాటక సర్క్యూట్‌లు ఏర్పడినట్లయింది. ఇవి అభివృద్ది చెందడం ప్రారంభమైతే జిల్లా అంతటా పర్యాటకుల సందడి నెలకొంటుంది. దీని ద్వారా జిల్లాకు ఆర్థిక ఆదాయం కూడా లభించనుంది.

పెరగనున్న ప్రతిష్ఠ
గండికోటకు అంతర్జాతీయ స్థాయి పర్యాటక ప్రదేశంగా ఇండియన్‌ గ్రాండ్‌ క్యానియన్‌గా పేరుంది. ఇప్పటికే నాలుగుమార్లు వారసత్వ ఉత్సవాలు నిర్వహించడంతో ఈ ప్రదేశానికి వస్తున్న పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. రెండేళ్లుగా వారాంతాలలో హరిత పర్యాటక హోటల్‌లో గదులు లభించని పరిస్థితి ఉంది. ఇప్పుడు గండికోట పెన్నా ప్రవాహంపై అద్దాల వంతెన ఏర్పాటు గురించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాన్ని ప్రకటించగానే జిల్లా పర్యాటక అభిమానులు, అభివృద్ధి సంఘాలు, పర్యాటక అభిమానుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయాలు జిల్లా పర్యాటకానికి పట్టాభిషేకం చేయనున్నట్లు అభిమానులు భావిస్తున్నారు. పర్యాటక ప్రాంతాల అభివృద్దికి నిధుల కొరత ఉన్న విషయాన్ని ఆ శాఖ ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చినా ఈ విషయంగా ముందడుగు వేయాలని ఆయన సూచించడం పర్యాటక రంగ అభివృద్దికి ఆయన కృత నిశ్చయంతో ఉన్నారని స్పష్టమవుతోంది.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా