‘స్మార్ట్’ అంతంతే

5 May, 2015 03:01 IST|Sakshi

 గ్రామాల దత్తతకు స్పందన కరువు
 అభివృద్ధి చేసే విషయంలో దూరం
 
 ఏలూరు :గ్రామాల అభివృద్ధిపై సర్కారు శీతకన్ను వేస్తోంది. ‘స్మార్ట్ విలేజ్’ పేరిట గ్రామాలను దాతలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ఆచరణలో మాత్రం చతికిలపడుతోంది. గ్రామాల దత్తతకు ప్రవాస భారతీయులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రాకపోవడంతో అధికారులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. జిల్లాలో మొత్తం 902 గ్రామాలున్నాయి. గడచిన నాలుగు నెలల్లో 425 గ్రామాలను దత్తత తీసుకోవడానికి ప్రవాస భారతీయులు, దాతలతోపాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకువచ్చాయి. అయితే, అధికారికంగా 355 గ్రామాలను మాత్రమే దత్తత ఇచ్చారు. వీటిలోనూ ఇప్పటివరకూ ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదు. ఇదిలావుంటే, మిగిలిన 547 గ్రామాలను ఎవరికి దత్తత ఇవ్వాలో తెలియక అధికారులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు.
 
 జిల్లాకు చెందిన 700 మంది విదేశాల్లో స్థిరపడినట్టు గుర్తిం చారు. వారిలో 45 మంది మాత్రమే గ్రామాల దత్తతకు ముందుకు వచ్చినట్టు సమాచారం. వీరంతా ఆయా గ్రామాల్లో గతంనుంచీ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నవారే. స్వగ్రామాల్లో ఎంతోకొంత అభివృద్ధి చేస్తున్న ప్రవాస భారతీయులు తాము చేపట్టిన కార్యక్రమాలను కొనసాగించేందుకు ఆ గ్రామాలను దత్తత తీసుకున్నట్టు చెబుతున్నారు. కొత్తగా గ్రామాల దత్తతకు ఎవరూ ముం దుకు రావడం లేదు. పట్టణాల్లో స్మార్ట్ వార్డుల విషయానికి వస్తే నిడదవోలు మిన హా జిల్లాలో ఎక్కడా ఆశాజనకమైన పరిస్థితి లేదు. గ్రామాల దత్తతపై జిల్లా స్థాయిలో కలెక్టర్, రాజధాని స్థాయిలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీడి యో కాన్ఫరెన్స్‌లు, సమీక్షలు నిర్వహించినా పురోగతి కనిపించడం లేదు.
 
 20 అంశాల మాటేమిటి!
 గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. ఆర్థిక సంఘం నిధులే గ్రామాలను ఆదుకుంటున్నాయి. ఇందులో సగం విద్యుత్ బకాయిలకు పోతోంది. మిగిలిన సగం నిధులు మంచినీరు, పారిశుధ్య పనులకు సరిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్ధేశించిన 20 అంశాల పురోగతి గాలిలో దీపంలా ఉంది. ప్రభుత్వం నిర్ధేశించిన 20 అంశాల్లో గృహ నిర్మాణం, శిశు సంక్షేమం, పిల్లలకు పౌష్టికాహారం, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల నిర్వహణ, పారిశుధ్యం, డంపింగ్ యార్డులు, శ్మశాన వాటికల అభివృద్ధి, అక్షరాస్యత శాతం పెంపు వంటివి ఆచరణకు నోచుకోవడం లేదు.  
 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా