జెన్‌కోకు ఊరట

30 Sep, 2019 04:18 IST|Sakshi

బొగ్గు కొరతపై తక్షణ చర్యలకు ఉపక్రమించిన ప్రభుత్వం

తెలంగాణ సీఎంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సంప్రదింపులు

31,500 మెట్రిక్‌ టన్నులు ఇచ్చేందుకు అంగీకారం

కోత విధించకుండా బొగ్గు సరఫరా చేయాలని కేంద్రానికి లేఖ

ఎల్‌సీ సమస్యను అధిగమించేందుకు రూ.570 కోట్లు మంజూరు

సాక్షి, అమరావతి: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ జెన్‌కో థర్మల్‌ ప్లాంట్లలో నెలకొన్న బొగ్గు సంక్షోభాన్ని నివారించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ చేపట్టింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షించారు. బొగ్గు సరఫరా పెంచాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును కోరారు. ఆయన జరిపిన సంప్రదింపుల ఫలితంగా 31,500 మెట్రిక్‌ టన్నులు  ఇచ్చేందుకు సింగరేణి అంగీకరించినట్టు జెన్‌కో వర్గాలు పేర్కొన్నాయి. ఒప్పందం ప్రకారం బొగ్గు సరఫరా చేయాలని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఢిల్లీలోని ఏపీ భవన్‌ అధికారులు కోల్‌ ఇండియా అధికారులతో, కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారు. 5,010 మెగావాట్ల సామర్థ్యమున్న ఏపీ జెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లకు మహానది కోల్‌ లిమిటెడ్‌ (ఎంసీఎల్‌), సింగరేణి (ఎస్సీసీఎల్‌) సంస్థలు బొగ్గు సరఫరా చేస్తున్నాయి. ఒడిశాలో భరత్పూర్‌లోని ఎంసీఎల్‌ బొగ్గు క్షేత్రంలో జూలై చివరి వారంలో ప్రమాదం జరిగింది. దీంతో అక్కడి కార్మికులు 15 రోజులుగా సమ్మె చేస్తుండటంతో ఉత్పత్తి స్తంభించింది. రోజుకు 70 వేల మెట్రిక్‌ టన్నుల బొగ్గు అవసరం ఉంటే, 45 వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే అందుతోంది. థర్మల్‌ కేంద్రాల వద్ద ప్రస్తుతం రెండు రోజులకు సరిపడా కూడా బొగ్గు నిల్వలు లేకపోవడంతో జెన్‌కో ఉత్పత్తి పడిపోయింది. 

అడుగడుగునా సవాళ్లే
గత ప్రభుత్వం ప్రైవేటు ఉత్పత్తిని ప్రోత్సహించి ఏపీ జెన్‌కోను తీవ్రంగా నిర్లక్ష్యం చేసింది. వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం దిద్దుబాటు చర్యల వల్ల థర్మల్‌ విద్యుత్‌ సామర్థ్యం అనూహ్యంగా పెరిగింది. గత ఏడాది ఇదే సమయంలో 12,679 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి మాత్రమే జరిగింది. ప్రస్తుతం ఇది 14,062 మిలియన్‌ యూనిట్లకు పెరిగింది. ఇదిలా ఉండగా డొంకరాయి, దిగువసీలేరు మధ్య విద్యుత్‌ ఉత్పాదన కోసం ఉద్దేశించిన పవర్‌ కెనాల్‌కు ఆగస్టు 12న భారీ వరద కారణంగా గండిపడింది. దీనివల్ల 300 నుంచి 400 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి ఆగిపోయింది. మహానది కోల్‌ ఫీల్డ్స్, సింగరేణిలో కుండపోత వర్షాల వల్ల సెప్టెంబర్‌లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం విధించిన లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ (ఎల్‌సీ– విద్యుత్‌ కొనుగోలుకు సరిపడా మొత్తాన్ని బ్యాంకు వద్ద డిపాజిట్‌ చేయడం) సమస్యను అధిగమించేందుకు సరిపడా నిధులు లేవు. ఈ నేపథ్యంలో కొన్నింటికి ఎల్‌సీలు తీసుకునేందుకు ప్రభుత్వం రూ.570 కోట్లు మంజూరు చేసిందని ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌ నాగులపల్లి తెలిపారు. పలువురు ఉత్పత్తిదారులకు ఇవ్వాల్సిన బకాయిలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టిందన్నారు.

వెంటాడుతున్న బాబు తీరు
గత ఎన్నికల్లో గొప్పలు చెప్పుకునేందుకు అప్పటి టీడీపీ సర్కార్‌ ఉత్తరాది రాష్ట్రాల నుంచి  స్వాప్‌ (మళ్లీ ఇవ్వాలి) పద్ధతిలో విద్యుత్‌ను తీసుకుంది. హర్యానా, పంజాబ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి గతేడాది ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, నవంబర్, డిసెంబర్‌ నెలల్లో 3,800 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ తీసుకుంది. ఇందుకు బదులుగా ఈ ఏడాది జూన్‌ నుంచి 1,500 మెగావాట్ల విద్యుత్‌ను తిరిగి చెల్లించాల్సి వస్తోంది. ఇందు వల్ల రాష్ట్రంలో రోజుకు 4 మిలియన్‌ యూనిట్ల కొరత ఏర్పడుతోంది. ఏదేమైనా మరో రెండు రోజుల్లో జెన్‌కో ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని ఏపీ జెన్‌కో ఎండీ శ్రీధర్‌ తెలిపారు. బొగ్గు కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఇంధన శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. రైతులకు పగటి పూట 9 గంటల విద్యుత్‌ ఇచ్చే విషయంలో రాజీ ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు