యావత్‌ దేశం మీవైపు చూసేలా చేస్తా: సీఎం జగన్‌

6 Sep, 2019 16:02 IST|Sakshi

ట్రిపుల్‌ ఐటీలను మరింత అభివృద్ధి చేస్తాం

గత ప్రభుత్వం విద్యావ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసింది

 ప్రతి జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్‌ విడుదల

శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులతో సీఎం జగన్‌ ముఖాముఖి

సాక్షి, శ్రీకాకుళం: రాష్ట్రంలోని ట్రిపుల్‌ ఐటీలను మరింత అభివృద్ధి పరిచి.. యావత్‌ దేశం ఆంధ్రప్రదేశ్‌ వైపు చూసే విధంగా మార్పులు తీసుకువస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. వందరోజుల పాలనను పురస్కరించుకుని వైఎస్‌ జగన్‌ శుక్రవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లాలోని ఎస్‌ఎమ్‌పురం ట్రిపుల్‌ ఐటీ కళాశాలలో తరగతి గదులను, హాస్టల్‌ బ్లాకులను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి సమావేశంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ట్రిపుల్‌ ఐటీలు ఉద్యోగాల కల్పనకు కేంద్రంగా ఉండేవని, గత ప్రభుత్వాలు ట్రిపుల్‌ ఐటీలను పూర్తిగా నిర్వీర్యం చేశాయని విమర్శించారు. గడిచిన ఐదేళ్ల కాలంలో విద్యావ్యవస్థ తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొందని, విద్యాశాఖకు రావాల్సిన రూ.185 కోట్లను టీడీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించిందని సీఎం మండిపడ్డారు. 

ట్రిపుల్‌ ఐటీలను అభివృద్ధి చేసే చిత్తశుద్ధి తమ ప్రభుత్వానికి ఉందని, దానిని మీకు స్పష్టం చేసేందుకే మీ ముందుకు వచ్చానని వైఎస్‌ జగన్‌ అన్నారు. ఇక్కడ పరిస్థితి, సమస్యల గురించి కళాశాల యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నానని, వాటన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంత పిల్లల్ని ఉన్నత ఉద్యోగులుగా తీర్చిదిద్దే ఉద్దేశంతో దివంగత వైఎస్సార్‌ గతంలో ఈ ప్రాంగణాన్ని నిర్మించారని సీఎం గుర్తుచేశారు. వేల మంది చదవాల్సిన ట్రిపుల్‌ ఐటీలో కేవలం 1500 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని, నూజివీడు ప్రాంగణంలో కూడా ఇదే పరిస్థితి ఉందని అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి సమావేశంలో వారు అడిగిన ప్రశ్నలకు సీఎం వైస్‌ జగన్‌ సమాధానాలు ఇచ్చారు.

ఐటీ ఉద్యోగాల కల్పనలో ఏపీ ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకోబోతుంది?.
ఈ ప్రశ్నకు సీఎం జగన్‌ సమాధానమిస్తూ.. 98శాతం ఐటీ ఉద్యోగాలు హైదరాబాద్‌ కేంద్రంగా సాగుతున్నాయి. రాష్ట్ర విభజనతో కేవలం రెండు శాతం మాత్రమే ఐటీ ఉద్యోగాలు ఏపీలో ఉన్నాయి. ఈ పరిస్థితితుల్లో మనం ఐటీని మరింత అభివృద్ధి చేయాల్సి ఉంది. విశాఖపట్నం కేంద్రంగా ఐటీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాని కొరకు ఇప్పటికే చర్యలను మొదలుపెట్టాం. ట్రిపుల్‌ ఐటీల నుంచే ఐటీ మేధావులను తీర్చిదిద్దాలి. అందుకే వాటిని మరింత అభివృద్ధి చేస్తాం. దేశమంతా ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల వైపు చూసే విధంగా తీర్చిదిద్దుతాం.

వైఎస్సార్‌ స్కిల్‌ డెవల్‌ప్‌మెంట్‌ సెంటర్స్‌ ఏ విధంగా ఉండబోతున్నాయి?. అక్కడ ఏవిధమైన ట్రైనింగ్‌ను ఇ‍వ్వబోతున్నారు?.
75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ఇప్పటికే చట్టం చేశాం. ఏ పరిశ్రమ వచ్చినా మొదట ఉద్యోగాలు మనకే ఉంటాయి. ప్రతి లోక్‌సభ స్థానాన్ని ఓ యూనిట్‌గా గుర్తించి వాటిల్లో స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తాం. అక్కడి విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి వారికి ట్రైనింగ్‌ ఇస్తాం. పరిశ్రమల యాజమాన్యాలే వారికి కావాల్సిన ఉద్యోగులను ఎంపిక చేసుకుంటాయి. ఆ విధంగా వారే ట్రైనింగ్‌ ఇస్తారు. స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ సెంటర్లను ఇంక్యుబేషన్‌ సెంటర్‌గా కూడా మారుస్తాం. ఇక్కడి నుంచి రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా ఐటీ సేవలను అందించే విధంగా ఆ సెంటర్లను తయారుచేస్తాం.


గత ప్రభుత్వం చర్యల కారణంగా నిరుద్యోగం తీవ్ర స్థాయిలో పెరిగింది. ఉద్యోగాల కల్పనకు ఏపీ ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు ఏమిటి?
పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి రెండు నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాల నియామకానికి చర్యలు తీసుకున్నాం. గ్రామ వాలెంటీర్ల కింద రెండు లక్షలకు పైగా ఉద్యోగాలను ఇప్పటికే నియమించాం. రానున్న రోజుల్లో మరికొన్ని ఉద్యోగాలు రాబోతున్నాయి. మన పిల్లల మీద పూర్తిస్థాయి నమ్మకంతోనే 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే కల్పించే విధంగా అసెంబ్లీలో చట్టం తీసుకువచ్చాం. దేశ చరిత్రలోనే ఈ విధంగా చట్టం తీసుకురావడం తొలిసారి. ఇతర రాష్ట్రాల ఉద్యోగులతో మన విద్యార్థులు పోటీ పడాలి. ట్రిపుల్‌  ఐటీల ద్వారా అనేక ఉద్యోగాలను సృష్టించబోతున్నాం. ప్రతి జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్‌ను విడుదల చేస్తాం. ఏడాదిలో ఏర్పడిన ఖాళీలను అదే ఏడాదిలో పూర్తి చేస్తాం.

ప్రజా పథకాలను అమలు చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది. మీకు స్ఫూర్తి  ఎవరు?.
గడిచిన ఐదేళ్లల్లో రాష్ట్రంలో  రాష్ట్రమంతా తిరిగాను. పేదరికంను అతిదగ్గర నుంచి చూశాను. పాదయాత్ర చేసే రోజుల్లో అనేక సమస్యలు నా దృష్టికి వచ్చాయి. వాటిని చూసి చలించిపోయాను. పాదయాత్ర నుంచి వచ్చిన ఆలోచనలే ఈ ప్రజాపథకాలు.  డబ్బులు లేవని ఏ పిల్లవాడు కూడా చదువు మానకూడదు. రాష్ట్రంలో నిరక్ష్యరాస్యులు 33శాతం ఉన్నారు. దానిని సున్నా శాతానికి తీసుకురావాలనేదే నా లక్ష్యం.  నా స్ఫూర్తి అంతా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డినే. ఆయన బాటలోనే నడుస్తా. అంటూ సమాధానమిచ్చారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా