తిత్లీ తుపాను బాధితులకు ఆపన్నహస్తం 

4 Sep, 2019 04:49 IST|Sakshi

కొబ్బరి చెట్టుకు పరిహారం రూ.3 వేలకు పెంపు 

జీడిమామిడి తోటకు పరిహారం రూ.50 వేలకు పెంపు 

హామీ నిలబెట్టుకున్న సీఎం వైఎస్‌ జగన్‌  

సాక్షి, అమరావతి : తిత్లీ తుపాను బాధితులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆపన్నహస్తం అందించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా గత ఏడాది డిసెంబర్‌ 30న పలాసలో ఇచ్చిన హామీకి కార్యరూపం ఇస్తూ పరిహారాన్ని భారీగా పెంచారు. ఈ మేరకు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నష్టం వాటిల్లిన కొబ్బరి చెట్టుకు ఇచ్చే పరిహారాన్ని రూ.1,500 నుంచి రూ.3 వేలకు పెంచింది. నష్టం వాటిల్లిన జీడిమామిడి చెట్లకు హెక్టారుకు ఇచ్చే పరిహారాన్ని రూ.30 వేల నుంచి రూ.50 వేలకు పెంచింది. తాజాగా పెంచిన పరిహారాన్ని అందించడానికి అర్హులైన లబ్ధిదారులను గుర్తించి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. గతేడాది శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తిత్లీ తుపాను బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. లక్షలాది కొబ్బరి చెట్లు, వేలాది హెక్టార్లలో జీడిమామిడి తోటలు నేల కూలాయి. ఏళ్లుగా పెంచుకున్న తోటలు నాశనమవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.  

పట్టించుకోని టీడీపీ ప్రభుత్వం 
తిత్లీ తుపాను సమయంలో అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం బాధితులను ఆదుకోవడంలో ఘోరంగా విఫలమైంది. ఏ మూలకూ సరిపోని విధంగా నేలకూలిన కొబ్బరి చెట్టుకు రూ.1500, పూర్తిగా నష్టం వాటిల్లిన జీడిమామిడి తోటకు ఒక హెక్టారుకు రూ.30 వేల చొప్పున పరిహారం ఇచ్చేలా గత ఏడాది అక్టోబర్‌ 19న ఉత్తర్వులు జారీ చేసింది. అయితే టీడీపీ నేతల జోక్యం వల్ల లబ్ధిదారుల జాబితాలో తోటలు నష్టపోయిన రైతుల పేర్లు గల్లంతయ్యాయి. లబ్ధిదారుల జాబితాలో సింహభాగం టీడీపీ నేతలు, కార్యకర్తల పేర్లే కనిపించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ క్రమంలో అప్పటి ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర శ్రీకాకుళం జిల్లాకు చేరుకుంది. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు విన్నవించుకున్నారు. అధికారంలోకి రాగానే పరిహారం పెంచుతామని, అర్హులైన రైతులందరికీ న్యాయం చేస్తామని అప్పట్లో వైఎస్‌ జగన్‌ పలాస సభలో హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం తిత్లీ తుపాను బాధిత రైతులకు పరిహారాన్ని పెంచుతూ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ ఉత్తర్వులు జారీ చేశారు.   

మరిన్ని వార్తలు