‘దిశ’ పోలీసు స్టేషన్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌

8 Feb, 2020 11:19 IST|Sakshi

సాక్షి, రాజమండ్రి: మహిళలు, బాలల భద్రత కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టం అమలులో భాగంగా రాజమహేంద్రవరంలోని ‘దిశ’ తొలి పోలీస్‌ స్టేషన్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ప్రారంభించారు. మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి ఆయన దిశ ప్రత్యేక పోలీసు స్టేషనును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఎమ్మెల్యే రోజా, మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ సహా డీజీపీ గౌతం సవాంగ్‌, దిశ చట్టం పర్యవేక్షణా అధికారులు దీపిక పాటిల్, కృతికా శుక్లా పాల్గొన్నారు. 

కాగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 దిశ పోలీస్‌ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో స్టేషన్‌లో డీఎస్పీలు, సీఐలు ఇద్దరు, ఐదుగురు ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లతో కలిపి మొత్తం 52 మంది పోలీస్‌ సిబ్బంది ఉంటారు. దిశ చట్టంపై అధికార యంత్రాంగాన్ని సమన్వయం చేయడం, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఐఏఎస్‌ అధికారిణి కృతికా శుక్లా, ఐపీఎస్‌ అధికారి దీపికను ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా నియమించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టిన దిశ చట్టాన్ని తమ రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తామని ఢిల్లీ, మహారాష్ట్ర ప్రకటించాయి.

దిశ చట్టంలో ప్రత్యేకతలు

  • మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు, వేధింపుల కేసుల్లో ఐపీసీ 354 ఎఫ్, 354 జి సెక్షన్లను అదనంగా చేర్చారు. 
  • ఏడు రోజుల్లో దర్యాప్తు, 14 పని రోజుల్లో విచారణ పూర్తి
  • దిశ చట్టం కింద నమోదైన కేసులను డీఎస్పీ స్థాయి అధికారి పర్యవేక్షిస్తారు
  • దర్యాప్తు కోసం రాష్ట్రంలో 18 ప్రత్యేక దిశ పోలీస్‌ స్టేషన్లు
  •  ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా దిశ కోర్టులు
  • 13 మంది ప్రత్యేక పబ్లిక్‌ ప్రాసిక్యూటర్ల నియామకం
  • రేప్, గ్యాంగ్‌ రేప్‌లకు పాల్పడితే ఉరిశిక్ష
  • చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడితే జీవితఖైదు
  • సోషల్‌ మీడియా, డిజిటల్‌ మీడియాలో మహిళలను వేధిస్తే మొదటిసారి రెండేళ్లు జైలు శిక్ష. రెండోసారి తప్పు చేస్తే నాలుగేళ్లు జైలు శిక్ష
  • అత్యాచారం కేసుల్లో శిక్ష పడిన దోషులు అప్పీలు చేసుకునే గడువు 180 రోజుల నుంచి 45 రోజులకు కుదింపు.
  • మహిళలు, చిన్నారులపై అకృత్యాలకు పాల్పడే వారి వివరాలను అందరికీ తెలిసేలా డిజిటల్‌ (ఆన్‌లైన్‌) రిజిస్టర్‌లో నమోదు చేస్తారు.
  • మంగళగిరి, విశాఖపట్నం, తిరుపతిలో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ల ఆధునికీకరణ
  • తిరుపతి, విశాఖపట్నంలో రెండు డీఎన్‌ఏ సెంటర్లు
  • బయాలజీ, సెరాలజీ, సైబర్‌ ల్యాబ్‌లు
  • దిశ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేసే వారికి 30 శాతం ప్రత్యేక అలవెన్సు
  • కేసుల దర్యాప్తునకు నెలకు రూ.లక్ష
  • రాష్ట్రంలో మహిళా పోలీస్‌ స్టేషన్ల అప్‌గ్రేడేషన్‌. ఒక డీఎస్పీ,  మూడు ఎస్‌ఐ పోస్టులు మంజూరు
  • బాధితుల కోసం ప్రత్యేకంగా ఆసుపత్రుల్లో గైనకాలజీ పోస్టుల భర్తీ
  • అన్యాయానికి గురైన మహిళ రాష్ట్రంలో ఎక్కడైనా ఫిర్యాదు చేసేలా జీరో ఎఫ్‌ఐఆర్‌ సౌకర్యం. 

మరిన్ని వార్తలు