రాయలసీమ రుణం తీర్చుకునే అవకాశం: సీఎం జగన్‌

23 Dec, 2019 14:43 IST|Sakshi

కృష్ణ, గోదావరి జలాలతో ఏపీని సస్యశ్యామలం చేస్తాం

బ్రహ్మంసాగర్  నీటి తరలింపుతో తెలుగుగంగా ఆయకట్టు స్థిరీకరణ

టీడీపీ హయాంలో ప్రాజెక్టుల నిర్లక్ష్యం: సీఎం జగన్‌

సాక్షి, వైఎస్సార్‌: వెనుకబడిన రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో ముందడుగు వేశారు. సోమవారం  వైఎస్సార్‌ కడప జిల్లాలో పర్యటించిన సీఎం పలు నీటిపారుదుల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. కుందూ నదిపై మూడు ప్రాజెక్టులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా దువ్వూరు మండలం నేలటూరు వద్ద సీఎం వైఎస్ జగన్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నేలటూరు వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు. రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు ఈ ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టినట్టు తెలిపారు. దువ్వురు నుంచి  బ్రహ్మంసాగర్  నీటి తరలింపుతో తెలుగుగంగా ఆయకట్టు స్థిరీకరణ చేస్తామని అన్నారు. బ్రహ్మంసాగర్‌ కింద 90 వేల ఎకరాలను నీరు అందించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. ఆర్టీపీపీకి 1.4 టీఎంసీల నీటిని కేటాయిస్తామన్నారు. టీడీపీ హయాంలో ప్రాజెక్టులను ఏమాత్రం పట్టించుకోలేదని సీఎం విమర్శించారు. (మూడేళ్లలో నిర్మాణం పూర్తి చేస్తాం : సీఎం జగన్‌)


సభలో సీఎం ప్రసంగిస్తూ.. ‘బ్రహ్మంసాగర్ ప్రాజెక్టులో 17 టీఎంసీ లు పూర్తి సామర్థ్యం వైఎస్సార్ హయాంలో జరిగింది. గతంలో భారీ వరదలు వచ్చినా డ్యాంలు నిండలేదు. బ్రహ్మంసాగర్ ప్రాజెక్టు కింద 90 వేల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. ఆర్టీపీపీకి 1.4 టీఎంసీల కేటాయింపు చేస్తాం. 2008లో వైఎస్సార్ జారీ చేసిన 224 జీవోపై చంద్రబాబు నిర్లక్ష్యం వహించారు. కుందూ నదిపై చేపట్టిన మూడు ప్రాజెక్టుల వల్ల వైఎస్సార్ కడప, కర్నూలు జిల్లాలకు మేలు జరుగుతుంది. రూ.2300 కోట్ల తో ఈ పనులు చేపడుతున్నాం.  ఈ ఏడాది భారీ వరదలు రావడంతో..  శ్రీశైలం గేట్లు ఎనిమిది సార్లు ఎత్తాం. ప్రకాశం బ్యారేజీ నుంచి 800 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసింది. వరద నీటిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. గత ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ప్రధాన ప్రాజెక్టు కాలువలను వెడల్పు చేయలేదు. అందుకే వరద నీరు వృథాగా సముద్రంలోకి వెళ్తోంది. రాయలసీమ ఇరిగేషన్ కాలువల సామర్థ్యం చంద్రబాబు పెంచి ఉంటే వరద నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకునే వాళ్లం. రూ.23000 కోట్ల రూపాయలతో సీమలోని అన్ని సాగునీటి కాలువ సామర్థ్యం పెంచుతున్నాం. మొత్తం 60 వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్టుల పనులు చేపడుతున్నాం. గోదావరి నది నుంచి 3000 టీఎంసీల నీరు సముద్రంలోకి వృధాగా వెళ్తోంది. కృష్ణ, గోదావరి జలాలతో ఏపీని సస్యశ్యామలం చేస్తాం. రాయలసీమ రుణం తీర్చుకునే అవకాశం కల్పించిన ప్రజలకు ధన్యవాదాలు’ అని అన్నారు.

ప్రాజెక్టులో భాగంగా జోలరాసి వద్ద 0.8 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టనున్నారు. అలాగే రాజోలి ఆనకట్టకు ఎగువన 2.95 టీఎంసీ సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మించనున్నారు. జొన్నవరం వద్ద ఆనకట్ట నిర్మాణం చేపట్టి.. వరద సమయంలో 8 టీఎంసీ ల నీటిని దువ్వూరు చెరువులోకి ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి బ్రహ్మంసాగర్‌కు తరలించి తెలుగుగంగ ఆయకట్టు స్థిరీకరణ చేస్తారు. ఈ ప్రాజెక్టు ద్వారా మైదుకూరు, బద్వేలు, ప్రొద్దుటూరు నియోజకవర్గాల తాగునీటి సమస్య తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది.  అలాగే కేసీ, తెలుగు గంగ ఆయకట్టు స్థిరీకరణ దిశగా చర్యలు చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టుకు మొత్తం రూ. 2234 కోట్ల రూపాయల వ్యయం చేయనున్నారు. దీంతో రాయలసీమకు నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు