అన్ని వర్గాల వారిని ఆదుకుంటాం: సీఎం జగన్‌

21 Nov, 2019 13:21 IST|Sakshi

వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకం ప్రారంభం 

వేట విరామ సాయం రూ.4 వేల నుంచి రూ.10 వేలకు పెంపు

అభివృద్ధిని ఓర్వలేకే ప్రతిపక్షాల విమర్శలు: సీఎం జగన్‌

సాక్షి, తూర్పు గోదావరి: ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని రాష్ట్రంలో వైఎస్సార్‌ మత్స్యకార భరోసాగా జరుపుకోవడం సంతోషంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. పాదయాత్ర సమయంలో మత్స్యకారులకు ఇచ్చిన మాటలు తనకు ఇంకా గుర్తున్నాయని.. ప్రభుత్వం ఏర్పడిన ఐదు నెలల్లోనే వారికి ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని సీఎం తెలిపారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గురువారం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకాన్ని సీఎం జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ఏటా ఏప్రిల్‌ 15 నుంచి జూన్‌ 14 వరకు సముద్రంలో వేట నిషేధ సమయంలో మత్స్యకార కుటుంబాలను ఆదుకునేందుకు గత ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.4 వేలు చెల్లించిన విషయం తెలిసింది. అయితే మత్స్యకార కుటుంబాల్లో సంతోషం నింపడం కోసం తమ ప్రభుత్వం ఏకంగా రూ.10 వేలకు పెంచుతున్నట్లు సీఎం ప్రకటించారు. దీంతో రాష్ట్రంలోని 1.35 లక్షల మత్స్యకార కుటుంబాలకు లబ్ధి చేకూరనుందని, మౌలిక సదుపాయాలను ప్రాధాన్యతా క్రమంలో కల్పించడానికి బడ్జెట్‌లో మత్స్య శాఖకు రూ.551 కోట్లు కేటాయించినట్ల సీఎం వివరించారు.


ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘గంగపుత్రులకు ఇచ్చిన వాగ్ధానానికి కట్టుబడి ఉన్నాను. వేట నిషేధ సమయంలో ప్రతి ఒక్క మత్స్యకార కుటుంబానికి రూ. 10 సాయంగా అందిస్తున్నాం. అది నేటి నుంచే శ్రీకారం చుడుతున్నాం. మత్స్యకారులు వేటకు వెళ్లిన సమయంలో తిరిగి ఇంటికి వస్తారన్న భరోసా కూడా లేదు. సముద్రంలో చేపలు పడుతూ 18 నుంచి 60 ఏళ్లలోపు మత్స్యకారులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకం కింద రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తాం. (గత ప్రభుత్వంలో రూ.5 లక్షలు మాత్రమే).  తొమ్మిది కోస్తా తీర జిల్లాల్లో దశల వారీగా ఫిష్‌ లాండింగ్‌ సదుపాయాలను కల్పిస్తాం. మూడు కొత్త ఫిషింగ్‌ హార్బర్లు (నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె, తూర్పుగోదావరి జిల్లా ఉప్పాడ, ప్రకాశం జిల్లా ఓడరేవులో) ఏర్పాటు. మచిలీపట్నం, నిజాంపట్నం హార్బర్‌ల పటిష్టానికి చర్యలు కూడా తీసుకుంటాం. మర పడవల నిర్వాహకులకు గత ప్రభుత్వం లీటర్‌ డీజిల్‌కు ఇచ్చే రూ.6.03 రాయితీ ఇప్పుడు రూ.9కి పెంచుతున్నాం. మరపడవలకే కాకుండా ఇంజను కలిగిన తెప్పలకూ డీజిల్‌ రాయితీ వర్తింపు. ఒక్కో మర పడవకు నెలకు రూ.27 వేలు, ఇంజను కలిగిన తెప్పలకు రూ.2,700 రాయితీ ఇస్తున్నాం. ఏడాదిలో పది నెలలకు స్మార్డ్‌ కార్డుల ద్వారా రాయితీ అందుతుంది.

ఎంతమందినైనా ఎదుర్కొంటా..
పాదయాత్ర సమయంలో మీకు ఇచ్చిన మాటటు నాకు ఇంకా గుర్తున్నాయి.  మీ బాధలు విన్న సమయంలో నా గుండె తరక్కుపోయింది. నేను విన్నాను అని ఆరోజు మీకు మాటిచ్చాను. దానికి కట్టుబడే ఈ రోజు మీకు నేను ఉన్నానని భరోసా ఇస్తున్నాను. ప్రభుత్వ ఏర్పడిన ఐదు నెలలు తిరగకముందే ఆ నాడు నేను ఇచ్చిన హామీని ఇదే వేదికపై నుంచి నెరవేరుస్తున్నాను. ప్రభుత్వ ఏర్పడిన ఐదు నెలల్లోపే నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వగలిగాం. ఆ  ఉద్యోగులంతా గ్రామీణ ప్రాంతంలో పేదలకు, రైతులకు, మత్స్యకారులకు అండగా ఉంటున్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులకూ సహాయం చేశాం. వారందరినీ ఆదుకున్నాం. ఎస్సీ, బీసీ, ఎస్టీలకు నామినేటేడ్‌ పదవులు, పనుల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాం. అలాగే మహిళలకూ రిజర్వేషన్లు కల్పించాం. రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తాం. నాడు-నేడు పథకంతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నాం. ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియంను ప్రవేశపెట్టబోతున్నాం. పిల్లలంతా ఉన్నత చదువులు చదవాలి. అలాగే పేదలకు మరింత మెరుగైన వైద్యాన్ని అందించడానికి ఆస్పత్రులను కూడా మెరుగుపరుస్తున్నాం. పేదల పక్షపాతిగా వ్యవహరిస్తున్న మన ప్రభుత్వంపై ప్రతిపక్ష నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఎంతమంది శత్రువులు నాపై కుట్ర పన్నినా.. వారందరినీ ఎదుర్కొనే శక్తి నాకుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్షం ఓర్వేట్లేదు. మీ అందరి ఆశీర్వాదాలతో మరింత ముందుకు సాగుతా’ అని అన్నారు.

వైఎస్సార్‌ వారధి ప్రారంభం..
జిల్లా పర్యటనలో భాగంగా తొలుత వృద్ధ గౌతమి గోదావరిపై ఐ.పోలవరం మండలం పశువుల్లంక – సలాదివారిపాలెం మధ్య రూ.35 కోట్లతో నిర్మించిన వైఎస్సార్‌ వారధిని సీఎం జగన్‌ ప్రారంభించారు. (ఈ వంతెన నిర్మాణంతో గోదావరి అటు, ఇటు ఉన్న 11 గ్రామాల్లోని 10 వేల మందికి ప్రయోజనం. ఈ వంతెనకు 2009లో దివంగత వైఎస్సార్‌ శంకుస్థాపన చేశారు.) వారధి వద్ద ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించారు.

మరిన్ని వార్తలు