పల్లె పల్లెకు ప్రగతి ఫలాలు

22 Dec, 2019 02:31 IST|Sakshi
శనివారం అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగిన ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో చేనేత మహిళలకు చెక్‌ అందజేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌

పేదలందరికీ సామాజిక, ఆర్థిక న్యాయం

మారుమూల గ్రామీణులకు కూడా ప్రభుత్వ పథకాలు

వివక్ష, అవినీతికి తావు లేకుండా అర్హులందరికీ మేలు

‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ ప్రారంభ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

ప్రతి చేనేత కుటుంబానికి ఐదేళ్లలో రూ.1.20 లక్షల సాయం

రైతులు, ఆటో డ్రైవర్లు, అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకున్నాం

విప్లవాత్మక నిర్ణయాలతో అన్ని వర్గాల వారికీ లబ్ధి

బీసీలంటే బ్యాక్‌ బోన్‌ క్లాసులని నిరూపిస్తాం

నామినేషన్‌ పదవులు, పోస్టుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50 శాతం

ఆత్మహత్య చేసుకున్న చేనేతల కుటుంబాలకు ఆర్థిక సహాయం

నేతన్నల సమస్యలు విన్నది.. తీర్చేది ఒక్క జగనే..

సాక్షి ప్రతినిధి, అనంతపురం : అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షలకు విలువ ఇవ్వాలని తమ ప్రభుత్వం భావిస్తోందని, సామాజిక న్యాయంతో పాటు ఆర్థిక న్యాయం కూడా జరగాలన్నదే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. మన ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడవకముందే అనేక పనులు చేస్తున్నామని చెప్పారు. రైతులకు రైతన్న భరోసా, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం, అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవడం, రాష్ట్రంలో ఏకంగా 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చామన్నారు. తన పాదయాత్రలో నేతన్నల కష్టాలను చూశానని, అందుకే ఇచ్చిన హామీ మేరకు మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24 వేల చొప్పున ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని చెప్పారు.

అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగిన సభకు హాజరైన ప్రజలు. నేతన్నలు ఇచ్చిన కండువాతో సీఎం వైఎస్‌ జగన్‌

అనంతపురం జిల్లా ధర్మవరంలో శనివారం ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 85 వేల కుటుంబాలకు రూ.196 కోట్లకు పైగా సహాయాన్ని ఇక్కడి నుంచే విడుదల చేయబోతున్నామని చెప్పారు. ఈ సభ ముగిశాక కంప్యూటర్‌లో బటన్‌ నొక్కిన వెంటనే ఆ 85 వేల చేనేత కుటుంబాలకు నేరుగా వారి బ్యాంకు అకౌంట్లో డబ్బు జమ అవుతుందన్నారు. ఈ డబ్బును పాత అప్పులకు జమ చేసుకోవద్దని బ్యాంకులకు చెప్పామని, ఈ పథకం ద్వారా రానున్న ఐదేళ్లల్లో మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి అక్షరాలా లక్షా 20 వేల రూపాయల ఆర్థిక సహాయం చేస్తామని ఆయన వివరించారు. ఈ సభలో సీఎం వైఎస్‌ జగన్‌ ఇంకా ఏం మాట్లాడారంటే..

బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం
2014 నుంచి 2019 వరకు ఒక్క అనంతపురం జిల్లాలోనే 57 మంది చేనేతలు ఆత్మహత్య చేసుకున్నారని, ఈ కుటుంబాలను గత ప్రభుత్వం పట్టించుకోలేదని సీఎం వైఎస్‌ జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకు తమ ప్రభుత్వం ఆదుకుంటుందని చెబుతూ రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. ఈ మేరకు ఆయా కుటుంబాలకు ఆయన మెగా చెక్కును అందజేశారు. ‘మన ప్రభుత్వం అన్ని వర్గాల వారికి లబ్ధి కలిగేలా పలు కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ ఇవాళ రాజకీయ స్వార్థంతో శత్రువులందరూ ఏమేం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో మీరందరూ చూస్తున్నారు.

మరణించిన నేతన్నలకు సంబంధించిన ఆర్థిక సాయం చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

నా బలమంతా మీ ఆశీస్సులు, దేవుడి దీవెనలు. అవి మీ ఇంటి బిడ్డగా నాకు అందాలి’ అని సీఎం జగన్‌ అన్నారు. కాగా, ముఖ్యమంత్రి పుట్టిన రోజు సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇతర నాయకులు వైఎస్‌ జగన్‌తో కేక్‌ కట్‌ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, మేకపాటి గౌతమ్‌ రెడ్డి, శంకర్‌నారాయణ, ఎంపీలు గోరంట్ల మాధవ్, రంగయ్య, సంజీవ్‌కుమార్, స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.

నేతన్నలకు తోడుగా ఉన్నది జగనొక్కడే
‘నేతన్నలకు మొదటి నుంచి ఏ కష్టం వచ్చినా తోడుగా ఉన్నది కేవలం జగన్‌ ఒక్కడే. ధర్మవరంలో నేతన్నల పరిస్థితి, వారి అగచాట్ల  గురించి బహుశా నా కంటే ఎక్కువ తెలిసిన వారు ఎవరూ ఉండరేమో. ఎందుకంటే పక్కనే పులివెందుల నియోజకవర్గం. ధర్మవరంలో నేతన్నలకు సంబంధించిన సమస్యల మీద, ఎప్పుడు ఏమి జరిగినా ఇక్కడకు వచ్చింది.. నిరాహార దీక్షలు చేసింది.. నేతన్నలకు తోడుగా నేనుంటాను అని భరోసా ఇచ్చింది ఒక్క జగన్‌ తప్ప ఇంకో నాయకుడు లేడు. ఇన్ని ఇబ్బందులు పడుతున్నారో చూశాను. సబ్సిడీ రాక అవస్థలు పడుతుంటే పట్టించుకోని పరిస్థితుల్లో ఇక్కడకు వచ్చి ధర్నా చేశా.

ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాలను ఏ ఒక్కరూ పట్టించుకోకపోతే గళంవిప్పి గట్టిగా అడిగా. అయినా ఎటువంటి స్పందన రాని పరిస్థితి. నా 3,648 కిలోమీటర్ల పాదయాత్రలో ప్రతి అడుగులోనూ చేనేతలు పడిన కష్టాలు చూశాను. ధర్మవరం, మంగళగిరి, వెంకటగిరి, ఎమ్మిగనూరు, చీరాల, ప్రొద్దుటూరు, జమ్ములమడుగు, ఉప్పాడ, తిప్పసముద్రం, పొందూరు.. ఎక్కడ చూసినా చేనేతల పరిస్థితి ఏమిటంటే పేదరికంలో ఉండటం, అప్పుల్లో కూరుకుపోవడం.. ఇవే వారి జీవితగాథలు. ఇదే ధర్మవరంలో చేనేత కుటుంబాలు ఆత్మహత్య చేసుకున్నా పట్టించుకోని గత ప్రభుత్వాన్ని చూశాం. ఆప్కోను స్కాంల మయం చేశారు. దీనిపై విచారణ జరిపిస్తున్నాం. నివేదిక  రాగానే ఆప్కోను పూర్తిగా సంస్కరించి చేనేత కుటుంబాలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటాం.

ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రవేశ పెడితే ఒక గ్రామం ఎంత మారుమూల ఉన్నా కూడా అక్కడి ప్రజలకు దాని ఫలాలు అందాలి. ఆ పథకాలు అందేటప్పుడు వివక్ష, అవినీతి ఉండకూడదు. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు అనే తేడా చూడకుండా అర్హులందరికీ  శాచ్యురేషన్‌ (సంతృప్త స్థాయి) పద్ధతిలో మేలు జరగాలి. ఈ దిశగా ఎన్నికల్లో మన పార్టీకి ఓటు వేయని వారిని కూడా పిలిచి.. బొట్టుపెట్టి మరీ లబ్ధి కలిగించే కార్యక్రమం ఈ రోజు జరుగుతోంది.
– సీఎం వైఎస్‌ జగన్‌

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా