‘వైఎస్సార్‌‌ సున్నా వడ్డీ' పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్‌

24 Apr, 2020 11:53 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: కరోనా కష్ట సమయంలో కూడా పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిలబెట్టుకున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం ఆయన ‘వైఎస్సార్‌ సున్నా వడ్డీ’ పథకాన్ని తన క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. ఆన్‌లైన్‌ ద్వారా బటన్‌ నొక్కి నగదు బదిలీ  చేశారు. ఈ బటన్‌ నొక్కగానే సెర్ప్, మెప్మాల పరిధిలోని గ్రామ, పట్టణ ప్రాంతాల్లో ఉండే 8,78,874 పొదుపు సంఘాల ఖాతాల్లో సీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా ఒకే విడతన డబ్బులు జమ అయ్యాయి.

90,37,254 మహిళలు సభ్యులుగా ఉండే ఆయా సంఘాల ఖాతాల్లో రూ.1,400 కోట్లు ఒకే విడత జమ అయ్యాయి. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల నుంచి డ్వాక్రా మహిళలతో సీఎం మాట్లాడారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. జులై 8 వైఎస్సార్‌ జయంతి రోజున ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. 27 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని వెల్లడించారు ఇళ్ల పట్టాలతో పాటు ఉచితంగా ఇల్లు కూడా కట్టించి ఇస్తామన్నారు. నామినేటెడ్ పనులు, పదవుల్లో 50% అక్కచెల్లెమ్మలకు ఇవ్వాలని గొప్ప చట్టం తెచ్చామని పేర్కొన్నారు.

‘‘కఠినంగా శిక్ష పడేలా దిశ చట్టాన్ని తీసుకొచ్చాం.13 దిశ పోలీస్‌స్టేషన్లు, జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు తీసుకొచ్చాం. 13 దిశ పోలీస్‌స్టేషన్లు, జిల్లాల్లో ప్రత్యేక కోర్టులు తీసుకొచ్చాం. త్వరలో రాష్ట్రపతి ఆమోదం తెలుపుతారని ఆశిస్తున్నాం.ప్రతి గ్రామ సచివాలయంలో ఒక మహిళా పోలీస్‌ను నియమించాం..11వేలకు పైగా మహిళా పోలీసులను నియమించి ఉద్యోగాలు ఇచ్చాం. గ్రామ సచివాలయాల్లో 8 మంది మహిళా మిత్రలను ఏర్పాటు చేశామని’’  సీఎం పేర్కొన్నారు. వసతి దీవెన కింద 12 లక్షల మందికి మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకున్నామని.. గత ప్రభుత్వం బకాయి పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇవ్వడమే కాకుండా.. మార్చి 31 వరకు ఉన్న బకాయిలను పూర్తిగా చెల్లిస్తామని సీఎం తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి మూడు నెలల సంబంధించి.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నేరుగా తల్లుల అకౌంట్‌ల్లో జమ చేస్తామని సీఎం వైఎస్‌ జగన్‌ వెల్లడించారు.(భవిష్యత్తులో కూడా మేలు జరగాలి: సీఎం జగన్)

2016 నుంచి సున్నా వడ్డీ పథకం నిలిచిపోయిందని.. కరోనా వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా సున్నా వడ్డీ పథకం ప్రారంభించామని సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. ప్రతి గ్రూపునకు రూ.20 వేల నుంచి రూ.40వేల వరకు మేలు జరుగుతుందన్నారు. ‘‘ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకు..రూ.3లక్షల పరిమితి వరకు ఆరు జిల్లాల్లో 7% వడ్డీకి రుణాలు ఇస్తున్నారు. మిగిలిన 7 జిల్లాల్లో డ్వాక్రా మహిళలకు సుమారు 13 శాతం వడ్డీ భారం వేస్తున్నారు. సున్నా వడ్డీ అమలుకు 7-13 శాతం వరకు వడ్డీని ప్రభుత్వమే చెల్లించాలి. ప్రతి పథకంలోనూ అక్కచెల్లెమ్మలకే పెద్దపీట వేశామని’’ సీఎం పేర్కొన్నారు. తల్లుల చేతిలో అక్కచెల్లెమ్మల చేతిలో డబ్బులు పెడితే.. పూర్తిగా సద్వినియోగం అవుతుందని తన భావన అని సీఎం తెలిపారు. 82 లక్షల మంది పిల్లలకు మేలు జరిగేలా అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. పిల్లల చదువులు బాగుండాలనే ఉద్దేశంతో నాడు-నేడు కార్యక్రమం చేపట్టామని సీఎం వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు