ప్రధాని మోదీకి సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ

13 Apr, 2020 22:00 IST|Sakshi

వివిధ రంగాలపై లాక్‌డౌన్‌ ప్రభావాన్ని నివేదించిన సీఎం జగన్‌

వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానికి విజ్ఞప్తి

సాక్షి, తాడేపల్లి: ప్రధాని మోదీకి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. వివిధ రంగాలపై లాక్‌డౌన్‌ ప్రభావాన్ని ఆయన లేఖలో ప్రస్తావించారు. వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానికి విజ్ఞప్తి  చేశారు. పలు అంశాలను లేఖలో నివేదించారు. లాక్‌డౌన్‌ దేశ ఆర్థికాభివృద్ధిపై ప్రభావం చూపిందని డిమాండ్‌, సప్లై చైన్‌కు తీవ్ర ఆటంకం కలిగించిందని అందులో పేర్కొన్నారు. ఏప్రిల్‌ 11న జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో దీనికి సంబంధించి కొన్ని విషయాలను మీ ముందుంచానని.. ఆర్థిక రథచక్రాన్ని వేగంగా పరిగెత్తించలేకపోయినా కనీస వేగంతో నడపాల్సిన అవసరం ఉందని మీకు నివేదించానని గుర్తు చేశారు.

ప్రధానమంత్రికి సీఎం రాసిన లేఖలోని ప్రధాన అంశాలు
ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయాధారిత రాష్ట్రం. రాష్ట్ర జీఎస్‌డీపీలో 34 శాతం వ్యవసాయరంగానిదే. 60 శాతానికి పైగా ప్రజలు ప్రత్యక్షంగా, పరోక్షంగా వ్యవసాయ దాని అనుబంధ కార్యకలాపాల మీదే ఆధారపడి ఉన్నారు. 80 లక్షల ఎకరాల్లో పంటలు పండుతుండగా... అందులో 17 లక్షల ఎకరాల్లో ఉద్యానవన పంటలను సాగుచేస్తున్నారు. మిర్చి, అరటి, కొబ్బరి, టమోటా, వంగ, బొప్పాయి, ఆయిల్‌ పాం, పొగాకు, చేపలు,రొయ్యలు, ఫౌల్ట్రీ ఉత్పత్తిలో ఏపీదే ప్రథమస్థానం  వరి, వేరుశెనగ, మొక్కజొన్న, మామిడి, మాంసం ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్నాం.  పాల ఉత్పత్తిలో దేశంలోనే మూడో స్ధానంలో ఉన్నాం.  పెద్ద సంఖ్యలో పండ్లను ఉత్పత్తి చేస్తున్నాం.  దేశంలోని ఇతర రాష్ట్రాలకే కాకుండా విదేశాలకు  కూడా ఎగుమతులు చేస్తున్నాం. లాక్‌డౌన్‌ కారణంగా సప్లై చైన్‌కు పెద్ద ఎత్తున అంతరాయం ఏర్పడింది.  వ్యవసాయ, ఉద్యానవన, ఆక్వా ఉత్పత్తులు మార్కెటింగ్, రవాణాకు తీవ్ర అవాంతరాలు ఏర్పడ్డాయి. లాక్‌డౌన్‌ కారణంగా దేశంలోనే 50 శాతం మార్కెట్లు మాత్రమే  నిర్వహిస్తుండగా... అందులో కార్యకలాపాలు 20–30శాతం మించి జరగడం లేదు.  దీనివల్ల అరటి, మొక్కజొన్న లాంటి పంటల మార్కెటింగ్‌కు అంతరాయం ఏర్పడింది. దీనివల్ల వ్యవసాయం, దాని ఆధారిత రంగాల మీద అత్యధికంగా ఆధారపడి ఉన్నవారి జీవనోపాధికి తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. 

అస్సాం, బెంగాల్, బీహార్, యూపీ రాష్ట్రాలలోని మార్కెట్‌లు మూతపడటం వల్ల నెల రోజులగా రాష్ట్రంలో ఉన్న ఆక్వా ఉత్పత్తులు మార్కెటింగ్‌ కావడం లేదు. అమెరికా, యూరప్‌ దేశాల నుంచి డిమాండ్‌ లేకపోవడంతో ఎగుమతులు గణనీయంగా  పడిపోయాయి. అలాగే లాక్‌డౌన్‌ కారణంగా తలెత్తిన పరిస్థితులు వల్ల రవాణా కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోయాయి. ప్రస్తుతం 25  శాతం రవాణా మాత్రమే సాగుతోంది. వ్యవసాయం సహా పారిశ్రామిక ఉత్పత్తుల పంపిణీ సరఫరాల కోసం పూర్తిస్థాయిలో రవాణావ్యవస్థ నడిచేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అన్ని రాష్ట్రాల్లో కూడా వ్యవసాయ, ఉద్యానవన, చేపలు, రొయ్యల మార్కెట్లలో కార్యకలాపాలు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

అమెరికా, యూరప్, ఆగ్నేయ ఆసియా దేశాల్లో ఆక్వా ఎగుతులు కోసం ఆయా దేశాల్లో మార్కెట్లు ఓపెన్‌ అయ్యేలా కేంద్రా వాణిజ్య శాఖ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాష్ట్రంలోని ఎఫ్‌సిఐ, సెంట్రల్‌ వేర్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ గోదాములు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యానికి చేరుకున్నాయి. రబీలో ఉత్పత్తి అయిన ఆహార ధాన్యాలను నిలువ చేయడం కష్టంగా మారింది. ఈ గోదాములను వీలైనంత త్వరగా ఖాళీ అయ్యేలా చూడాలని సంబంధిత శాఖలను ఆదేశించాల్సిందిగా కోరుతున్నాం.  అలాగే గొడౌన్స్‌ ఖాళీ చేసేటప్పుడు సమీపంలో ఉన్నవాటిని ఖాళీ చేసేలా ఆదేశించాలని కోరుతున్నాను. తద్వారా ఖర్చులు, సమయం రెండూ ఆదా అవుతాయి.  దక్షిణాది గోదాముల్లో నిల్వలు ఉన్నప్పటికీ, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ఉత్తరాది నుంచి తీసుకొస్తున్నారు.
 
ఎంఎస్‌ఎంఈ రంగం కూడా లాక్‌డౌన్‌ కారణంగా బాగా ప్రభావితమైంది.  రాష్ట్రంలో ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌ ద్వారా 1 కోటి 10 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు.  రాష్ట్ర జీఎస్‌డీపీలో 7–8 శాతం వాటా ఎంఎస్‌ఎంఈల దే. 94 శాతం ఎంఎస్‌ఎంఈ యూనిట్లు లాక్‌ డౌన్‌ అయ్యాయి. కేవలం 6 శాతం ఎంఎస్‌ఎంఈ యూనిట్లు 25–30 శాతం సామర్ధ్యంలో నడుస్తున్నాయి.  రాష్ట్రంలో 1,03, 986 ఫ్యాక్టరీలుండగా.. 7,250 మాత్రమే పనిచేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ మందగించడం కారణంగా లాక్‌డౌన్‌ తర్వాత కూడా వ్యాపారాల మీద ప్రతికూల ప్రభావం ఉండే అవకాశాలున్నాయి.  గూడ్స్, సిమెంటు, స్టీలు,  గార్మెంట్స్,  పుట్‌వేర్, ఆటోమోటివ్‌ తదితర రంగాలు లిక్విడిటీ, క్యాష్‌ ప్లో సమస్యను ఎదుర్కొంటాయి. 

ఇలాంటి పరిస్ధితుల్లో ఒక వైపు ప్యాక్టరీలు నడవకుండా మరోవైపు వాటి ఫిక్స్‌డ్‌ ఖర్చులు తగ్గకుండా జీతాలు, వేతనాలు ఏ విధంగా చెల్లిస్తాయి. రవాణా కూడా పూర్తి స్ధాయిలో అందుబాటులో లేకపోవడం వల్ల, సిమెంటు, స్టీలు లాంటి రంగాలు తీవ్ర కష్టాలను ఎదుర్కొంటున్నాయి.  నేషనల్‌ హైవేలతో పాటు రైల్వేల ద్వారా రవాణాను తిరిగి ప్రారంభించాలని తద్వారా ఇండస్ట్రియల్‌ ఎకానమీకి  ఊతం ఇవ్వాలని కోరుతున్నాను.  ఈ పరిస్థితుల నేపథ్యంలో దీర్ఘకాలిక పర్యవసానాలను దృష్టిలో ఉంచుకుని దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలు, కోవిడ్‌ –19 నివారణా చర్యల మధ్య సరైన సమతుల్యత తీసుకురావాల్సిన అవసరం ఉంది.  పై పరిస్థితులనే దృష్టిలో ఉంచుకుని కోవిడ్‌– 19 నివారణా చర్యల్లో భాగంగా రెడ్‌ జోన్, ఆరెంజ్‌ జోన్, గ్రీన్‌ జోన్‌లను గుర్తించి ఆమేరకు నియంత్రణ చర్యలను చేపట్టాలన్న ప్రతిపాదన సహా, కోవిడ్‌ –19 నివారణా చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా హృదయపూర్వకంగా మద్దతు తెలుపుతున్నానని లేఖలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు