ఆర్టీసీ విలీనంపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్ష

26 Jun, 2019 12:09 IST|Sakshi

సాక్షి, అమరావతి : ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పేర్నినానితో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

ఆర్టీసీ విలీనానికి సంబంధించి అధ్యయన ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఆర్టీసీ విలీనం విధివిధానాలు రూపొందించేందుకు ఈ అధ్యయన కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆర్థిక మంత్రి, రవాణా శాఖ మంత్రులతో ఈ కమిటీ సమావేశమైంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సంబంధించిన పలు అంశాలపై కమిటీ అధ్యయనం చేస్తోంది. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి సహా విలీన ప్రక్రియను అమలు పరచడంలో ఉత్పన్నమయ్యే సమస్యల పరిష్కార మార్గాలను కమిటీ సూచించనుంది.

అదేవిధంగా ఉద్యోగుల బకాయిలు, సేకరించిన బ్యాంకు రుణాలపైనా కమిటీ అధ్యయనం సాగనుంది. ప్రస్తుత ఆర్టీసీ ఆర్థిక పరిస్ధితిపై సంస్ధ ఎండీ సురేంద్రబాబు ఇచ్చిన నివేదిక ఆధారంగా వివిధ అంశాలను నిపుణుల కమిటీ పరిశీలిస్తోంది. ప్రస్తుత డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం.. ప్రస్తుత వ్యయ పరిశీలన, సామర్థ్య పరిమితులు తదితర అంశాలపై కమిటీ సూచనలు ఇవ్వనుంది. ఆర్థిక, రవాణాశాఖ మంత్రుల సలహాలు తీసుకుంటూ మూడు నెలల్లో తుది నివేదిక ఇవ్వనుంది.

మరిన్ని వార్తలు