మేడిగడ్డకు చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌

21 Jun, 2019 08:59 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ఉదయం 9.45 గంటలకు మేడిగడ్డకు చేరుకున్నారు. తాడేపల్లి నివాసం నుంచి ఉదయం 8.15 గంటల ప్రాంతంలో ప్రత్యేక హెలికాప్టర్‌లో బయలుదేరిన ఆయన నేరుగా మేడిగడ్డకు విచ్చేశారు. సీఎం జగన్‌కు తెలంగాణ మంత్రులు సాదర స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. సీఎం వైఎస్‌ జగన్‌ వెంట మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఉన్నారు.


కాగా ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మేడిగడ్డకు చేరుకొని జలసంకల్ప యాగంలో పాల్గొన్నారు. మరోవైపు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌ బేగంపేట విమానాశ్రయం చేరుకున్నారు. ఆయనకు సీఎస్‌ సునీల్‌ కుమార్‌ జోషి, మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌ స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్‌ నరసింహన్‌తో కలిసి కాళేశ్వరం బయలుదేరారు.

ఉదయం 10 గంటలకల్లా గవర్నర్, ఇద్దరు ముఖ్యమంత్రులు మేడిగడ్డ బ్యారేజీ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ జరిగే హోమంలో కేసీఆర్‌తోపాటు పాల్గొన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి 11 గంటల మధ్య గవర్నర్, ముగ్గురు ముఖ్యమంత్రులు మేడిగడ్డ బ్యారేజీ వద్ద పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అక్కడే ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకిస్తారు.
 
ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే గవర్నర్, ముగ్గురు ముఖ్యమంత్రులు మేడిగడ్డ పంప్‌హౌస్‌ ఉన్న కన్నెపల్లికి హెలికాప్టర్‌లో చేరుకొని అక్కడ అప్పటికే కొనసాగుతున్న పూర్ణాహుతిలో పాల్గొంటారు. సుగంధ మంగళ ద్రవ్యాలను హోమంలో వేస్తారు. అనంతరం 6వ నంబర్‌ మోటార్‌ను సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారు. అనంతరం నీటి ప్రవాహాలుండే డెలివరీ సిస్టర్న్‌ వద్ద గోదావరి జలాలకు పూజలు చేస్తారు. అక్కడి నుంచి కన్నెపల్లి గెస్ట్‌హౌస్‌లో మధ్యాహ్న భోజనాలు చేసి అనంతరం అక్కడే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగం పంచుకున్న ఇంజనీర్లు, ఏజెన్సీలు, సహకారం అందించిన బ్యాంకర్లకు సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు.

మరిన్ని వార్తలు