కడప స్టీల్‌ప్లాంట్‌పై సీఎం జగన్‌ సమీక్ష

15 Jun, 2020 14:06 IST|Sakshi

ఈక్విటీ కింద రూ.500 కోట్లు కేటాయించాలని సీఎం ఆదేశం

సాక్షి, అమరావతి: కడప స్టీల్‌ప్లాంట్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం ఈక్విటీ కింద రూ.500 కోట్లు కేటాయించాలని ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశానికి  పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్‌ సహా పలువురు అధికారులు హాజరు అయ్యారు. కడప స్టీల్‌ప్లాంట్‌ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్‌ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌తో భాగస్వామ్యం కోసం ఆసక్తి చూపిస్తున్న సంస్థలతో చర్చల  వివరాలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. హ్యుందాయ్, టాటా స్టీల్స్, ఎస్సార్‌ స్టీల్‌ సహా పలు కంపెనీలతో జరిపిన చర్చల వివరాలను ముఖ్యమంత్రికి తెలిపారు.

ఆ సంస్థలు చేసిన ప్రతిపాదనలపై సమావేశంలో సీఎం జగన్‌ చర్చించారు. ప్రతిపాదనలు చేసిన సంస్థలతో చర్చలు జరపాలని అధికారులను ఆదేశించారు. ఎంపిక చేసిన భాగస్వామ్య సంస్థతో రెండు నెలల్లోగా ఒప్పందం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి సూచించారు. అదే సమయంలో రెండు సంవత్సరాల్లో టౌన్‌షిప్‌, అనుబంధం మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేయాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా ఈ నెలాఖరులోగా సాయిల్‌ టెస్టింగ్‌, జియో టెక్నికల్‌ సర్వే పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. (వెండి తెర వెలుగు రేఖ.. విశాఖ)

ఫ్యాక్టరీ నిర్మాణం కోసం అవసరమైన రోడ్లు, కాంపౌండ్‌ వాల్, విద్యుత్‌ సరఫరా కోసం నిర్మాణపు పనులు, అలాగే ఫ్యాక్టరీ నిర్మాణ కార్యకలాపాల కోసం కరెంటుతో పాటు ఆర్టీపీపీ లైన్‌ ద్వారా నిర్మాణ పనుల కోసం నీరు, అలాగే ఫ్యాక్టరీ నిర్వహణ కోసం నీటిని తరలించేందుకు అవసరమైన పనులను పూర్తి చేయడానికి అన్ని రకాల చర్యలూ తీసుకుంటామన్న అధికారులు వివరించారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు