నేడు సచివాలయానికి సీఎం జగన్‌

8 Jun, 2019 04:02 IST|Sakshi

ఉదయం 8.39 గంటలకు సీఎం కార్యాలయంలోకి ప్రవేశం

అనంతరం కాన్ఫరెన్స్‌ హాల్లో ప్రొటెం స్పీకర్‌ చేత గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణ స్వీకారం

9.30 గంటలకు కార్యదర్శులను ఉద్దేశించి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగం

11.49 గంటలకు మంత్రివర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం  

సాక్షి, అమరావతి: సచివాలయం తొలి బ్లాకులోని మొదటి అంతస్తులో గల సీఎం కార్యాలయంలోకి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం తొలిసారిగా ప్రవేశించనున్నారు. ఇందుకు ఉదయం 8.39 గంటలకు ముహూర్తంగా నిర్ణయించారు. ఈ కార్యక్రమం పూర్తయిన తరువాత ఉదయం 9.30 గంటలకు సీఎం వైఎస్‌ జగన్‌ అన్ని శాఖల కార్యదర్శులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ వెంటనే సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలతో సమావేశం కానున్నారు.  సీఎం కార్యాలయం పక్కనే గల కాన్ఫరెన్స్‌ హాల్లో ప్రొటెం స్పీకర్‌గా నియమితులైన శంబంగి చిన అప్పలనాయుడు చేత 11.15 గంటలకు గవర్నర్‌ నరసింహన్‌ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ కార్యక్రమానికి సీఎం వైఎస్‌ జగన్‌ కూడా హాజరవుతారు.

అనంతరం తొలి బ్లాకు పక్కనే ఏర్పాటు చేసిన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమ వేదికకు ముఖ్యమంత్రి చేరుకుంటారు. ఉదయం 11.49 గంటలకు గవర్నర్‌ నరసింహన్‌ మొత్తం 25 మంది చేత మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆ తర్వాత మంత్రివర్గ సభ్యులందరూ గవర్నర్, ముఖ్యమంత్రితో కలసి గ్రూపు ఫొటో దిగుతారు. ఈ నెల 10వ తేదీన ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి అధ్యక్షతన తొలి కేబినెట్‌ సమావేశం జరగనుంది. ఇందులో ఎన్నికల ప్రణాళికలోని నవరత్నాల అమలుపై ప్రధానంగా చర్చించడంతో పాటు కొన్ని పనులకు ఆమోదం తెలపనున్నారు. 

>
మరిన్ని వార్తలు