‘గ్రామ, వార్టు వాలంటీర్ల వ్యవస్థ ముఖ్యమైనది’

20 Nov, 2019 16:53 IST|Sakshi

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు బలమైన సమాచారాన్ని అందించాలనే ఉద్దేశంతో ఐటీ, ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్ల శాఖలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షా సమావేశాన్ని బుధవారం అమరావతిలో ఏర్పాటు చేశారు. ఈ సమీక్షా సమావేశానికి ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డితో పాటు ఇతర అధికారులు హజరయ్యారు. ఈ సమావేశంలో  సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్దికి గ్రామ, వార్డు సెక్రెటరియట్‌, వాలంటీర్ల వ్యవస్థ అనేది చాలా ముఖ్యమని అన్నారు. ఇందుకోసం వారికి బలమైన సమాచార సాంకేతిక వ్యవస్థ అందించాలని సీఎం అధికారులను అదేశించారు. ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేయగలిగితే అవినీతి తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. ఇకనుంచి రేషన్‌ కార్డు, పెన్షన్‌ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు, ఫీజు రీయంబర్స్‌మెంట్‌ కార్డులన్నీ గ్రామ, వార్డు సచివాలయాలే జారి చేస్తాయని తెలిపారు. కార్డులు అక్కడే ప్రింట్‌ అయి అబ్ధిదారులకు అందాలంటే.. వాలంటీర్ల వ్యవస్థ సక్రమంగా, పటిష్టంగా ఉండాలని అన్నారు.

అలాగే విశాఖపట్నం, తిరుపతి, బెంగుళూరుకు సమీపంలో ఉన్న అనంతపురం ప్రాంతాల్లోని కాన్సెప్టు సిటీల ఏర్పాటుపై ఆలోచనలు చేయాలని, ఒక్కోసిటీ 10 చదరపు కిలొమీటర్ల పరిధిలో ఉండేలా ప్రాథమిక ప్రణాళికలు తయారు చేయాలని సీఎం జగన్‌ అధికారులకు అదేశించారు. గత ప్రభుత్వం ఇవ్వాల్సిన ఇండస్ట్రీయల్‌ ఇన్సెంటివ్‌లు రూ. 4వేల కోట్లు పెండింగులో ఉన్నాయని తెలిపారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరిశ్రమల గురించి, ఇండస్ట్రీస్‌ ప్రమోషన్స్‌, ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని సీఎం అన్నారు. పరిశ్రమలకు వేగంగా అనుమతులు మంజూరు చేయడంతోపాటు, పారదర్శక విధానాలను, అవినీతి రహిత సింగిల్‌ విండో పద్ధతిని అందుబాటులోకి తీసుకు వచ్చామని సీఎం జగన్‌ తెలిపారు. కాగా వచ్చే కంపెనీలకు ప్రోత్సాహక ధరలతో భూములు, నీరు, కరెంటు లాంటి సదుపాయాలను కల్పిస్తామని ముఖచమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు.

>
మరిన్ని వార్తలు