మురిసిన విశాఖ

29 Dec, 2019 03:58 IST|Sakshi
అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో ప్రజాప్రతినిధులు

సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజల అపూర్వ స్వాగతం

24 కిలోమీటర్ల మేర మానవహారంతో కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు

అడుగడుగునా పూలవర్షమై కురిసిన అభిమానం

శ్రీకాకుళం, విజయనగరం, గోదావరి జిల్లాల నుంచి తరలివచ్చిన జనం

‘థాంక్యూ సీఎం’ నినాదంతో హోరెత్తిన సాగర తీరం

రూ.1,285 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపనలు

బీచ్‌ రోడ్డులో విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభించిన ముఖ్యమంత్రి

సాక్షి, విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి విశాఖపట్నం ప్రజలు శనివారం అపూర్వ స్వాగతం పలికారు. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖ పేరు తెరపైకి వచ్చిన అనంతరం తొలిసారి నగరానికి వచ్చిన ఆయనకు.. 24 కిలోమీటర్ల మేర మానవహారంగా ఏర్పడి ‘థాంక్యూ సీఎం’ అంటూ కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలిపారు. సీఎం పర్యటన ఆద్యంతం విశాఖ నగరం జన సంద్రమై ఉప్పొంగింది. దాదాపు 4 గంటల పాటు సాగిన ఈ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించింది. విశాఖ పర్యటనలో భాగంగా రూ.1,285.32 కోట్ల అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం బీచ్‌రోడ్డులో విశాఖ ఉత్సవ్‌ను ప్రారంభించారు.

దారిపొడవునా అభిమాన సంద్రమై..
శనివారం మధ్యాహ్నం 3.47 గంటలకు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి సాదర స్వాగతం పలికేందుకు చిన్నా, పెద్దా తేడా లేకుండా అంతా ఏకమై వేలాదిగా తరలివచ్చారు. విమానాశ్రయం నుంచి బయటికి రాగానే పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులందరినీ ఆత్మీయంగా పలకరించి  జగన్‌ కాన్వాయ్‌లో బయలుదేరారు. వివిధ కళాశాలల విద్యార్థులు, మహిళలు, కార్మికులు, ఆటో డ్రైవర్లు, చోడవరం, అనకాపల్లి నుంచి రైతులు రోడ్డుకు ఇరువైపులా నిలబడి హర్షధ్వానాలతో పూలు చల్లుతూ సీఎం జగన్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు. ఎన్‌ఏడీ జంక్షన్, ఆర్‌అండ్‌బీ కూడలి, తాటిచెట్లపాలెం..  కైలాసగిరి అక్కడి నుంచి సెంట్రల్‌ పార్కు.. ఆపై ఆర్‌కే బీచ్‌ వరకూ సాగిన కృతజ్ఞతా యాత్రలో ఆసాంతం కొండంత అభిమానం కనిపించింది. విమానాశ్రయం నుంచి తాటిచెట్లపాలెం వరకూ కాన్వాయ్‌ చేరేందుకు 50 నిమిషాల సమయం పట్టడాన్ని చూస్తే.. అభిమాన తరంగం ఎంతగా ఉప్పొంగిందో అర్థం చేసుకోవచ్చు.

రూ.1,290 కోట్లతో శంకుస్థాపనలు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రూ.1285.32 కోట్ల పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ముందుగా కైలాసగిరిపై వీఎంఆర్‌డీఏ చేపట్టే రూ.379.82 కోట్ల పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పాతజైలు రోడ్డులోని వైఎస్సార్‌ సెంట్రల్‌పార్క్‌లో జీవీఎంసీ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్కులో ఏర్పాటు చేసిన మ్యూజికల్‌ ఫౌంటైన్‌ కార్యక్రమాన్ని వీక్షించారు. వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జీవీఎంసీ చేపట్టనున్న రూ.905.50 కోట్ల పనులకు ముఖ్యమంత్రి జగన్‌ శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి నేరుగా ఆర్‌కే బీచ్‌లో ఏర్పాటు చేసిన విశాఖ ఉత్సవ్‌ ప్రాంగణానికి బయల్దేరారు.

మీ ప్రేమానురాగాల మధ్య ఉత్సవాలు ప్రారంభిస్తున్నా..
సాయంత్రం 6.39 గంటలకు ఆర్‌కే బీచ్‌లో ఏర్పాటు చేసిన విశాఖ ఉత్సవ్‌ వేదిక వద్దకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేరుకున్నారు. నవరత్నాలపై ఏర్పాటు చేసిన లేజర్‌ షో ప్రదర్శనతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం.. సీఎం జగన్‌ మాట్లాడుతూ ఆప్యాయతలూ.. ప్రేమానురాగాల మధ్య.. ఈ రోజు విశాఖ ఉత్సవాలను ప్రారంభిస్తున్నామని ప్రకటించారు. 22 సెకన్లు మాత్రమే మాట్లాడినా.. జనం సీఎం.. సీఎం.. అంటూ జేజేలు పలుకుతూ అభిమానాన్ని చాటుకున్నారు. జిగేల్‌మనే లేజర్‌ షో.. బాణసంచా వెలుగుల నడుమ.. విశాఖ సంబరాలు అంబరానంటేలా ప్రారంభమయ్యాయి. ప్రారంభోత్సవాలు ముగిసిన అనంతరం తూర్పు నౌకాదళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ అతుల్‌కుమార్‌జైన్‌ దంపతులకు సీఎం ఆత్మీయ సత్కారం చేశారు.

ఆ తర్వాత సీఎం జగన్‌కు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి జ్ఞాపిక అందించారు. పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బిరామిరెడ్డి ముఖ్యమంత్రికి ఆత్మీయ సత్కారం చేశారు. అనంతరం  ముఖ్యమంత్రి అశేష జనవాహినికి అభివాదం చేస్తూ విమానాశ్రయానికి పయనమయ్యారు. ఈ కార్యక్రమంలో సీఎం ప్రోగ్రామ్స్‌ కోర్డినేటర్‌ తలశిల రఘురాం, మంత్రులు అవంతి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, ధర్మాన కృష్ణదాస్, ప్రభుత్వ విప్‌ బూడి ముత్యాలనాయుడు, ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, డా.భీశెట్టి సత్యవతి, బెల్లాన చంద్రశేఖర్, ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పాండుగాయిల రత్నాకర్‌తో పాటు ఉత్తరాంధ్రతో పాటు తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనేతలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

పుష్ఫ సోయగం అదరహో
స్వదేశీ, విదేశీ పుష్ఫాలతో డాక్టర్‌ వైఎస్సార్‌ సిటీ సెంట్రల్‌ పార్కులో ఏర్పాటు చేసిన ఫ్లవర్‌ షో సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేసింది. విశాఖ ఉత్సవ్‌లో భాగంగా రూ.60 లక్షలతో 22 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 15 టన్నుల పుష్ఫాలను వాడి పలు ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. వీటిలో నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, థాయ్‌లాండ్‌ నుంచి తెప్పించిన 20 రకాల పుష్ఫాలు కూడా ఉన్నాయి.

అభివృద్ధి విధాతకు జయహో
నగరంలో దాదాపు 24 కిలోమీటర్ల మేర అభిమానం పూలవర్షమై కురిసింది. ‘థ్యాంక్యూ సీఎం సర్‌.. థ్యాంక్యూ జగనన్న..  ‘అభివృద్ధి విధాతకు జయహో’ అనే నినాదాలతో నగరం మార్మోగిపోయింది. పలుచోట్ల తమ అభిమాన నేతతో సెల్ఫీలు దిగాలన్న ఆత్రుతతో కాన్వాయ్‌కు అడ్డు వచ్చేందుకు పలువురు ప్రయత్నించగా.. అతి కష్టంమ్మీద పోలీసులు వారిని నిలువరించారు. విశాఖ నగరం నుంచే కాకుండా.. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన జనం సీఎంకు స్వాగతం పలికేందుకు ఉత్సుకతతో తరలివచ్చారు. ఎయిర్‌పోర్టు నుంచి ప్రారంభమైన అభిమాన యాత్రలో అడుగడుగునా ధన్యవాదాలు చెబుతున్న ప్రజలు, అభిమానులను జగన్‌ చిరు మందహాసంతో ఆత్మీయంగా పలకరిస్తూ అభివాదం చేశారు. ప్రతీ కూడలిలోనూ వాయిద్యాలు, జానపద నృత్యాలతో సందడి నెలకొంది.

చిన్నారి వైద్యానికి సీఎం భరోసా
పెందుర్తి మండలం జుత్తాడ గ్రామానికి చెందిన రెండేళ్ల పాప ఎస్‌.తన్విత ఏడాదిగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు విమానాశ్రయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ వివరించారు. పెద్ద పేగుకు ఆపరేషన్‌ చేయాలని వైద్యులు చెప్పారని, తమకు అంత స్తోమత లేదని తల్లిదండ్రులు ముఖ్యమంత్రికి మొరపెట్టుకున్నారు. చిన్నారి కష్టాన్ని చూసి చలించిపోయిన సీఎం జగన్‌ తక్షణమే తన్వితకి శస్త్ర చికిత్స చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ప్రత్యేక కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డిని ఆదేశించారు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి ఆ పాపకి ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందనీ.. త్వరలోనే ఆరోగ్యంగా తిరుగుతుందని తన్వితని ముఖ్యమంత్రి జగన్‌ ఆశీర్వదించారు. ఆ కుటుంబం సీఎంకు ధన్యవాదాలు చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు.  

మరిన్ని వార్తలు