అతివలకు ఆసరా

28 Sep, 2019 08:17 IST|Sakshi

సాక్షి, అనంతపురం న్యూసిటీ : ‘‘ఎన్నికల రోజు వరకు అక్కచెల్లెమ్మలకు పొదుపు సంఘాల్లో ఉన్న రుణాల మొత్తం సొమ్మును నాలుగు విడతల్లో నేరుగా మీ చేతికే అందిస్తాం.. అంతేకాదు మళ్లీ సున్నావడ్డీకే రుణాల విప్లవం తెస్తాం. ఆ వడ్డీ సొమ్ము మేమే కడతాం.’’ అని ఎన్నికల వేళ మహిళలకు హామీ ఇచ్చిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ‘వైఎస్సార్‌ ఆసరా’, వీధి వ్యాపారులు ఆర్థికంగా పురోగతి సాధించేందుకు ‘వైఎస్సార్‌ చేయూత’ పథకాల అమలుకు శ్రీకారం చుట్టారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 

రూ.360.55 కోట్లతో వైఎస్సార్‌ ఆసరా 
‘వైఎస్సార్‌ ఆసరా’ పథకం కింద జిల్లాలోని నగరపాలక సంస్థ, వివిధ మునిసిపాలిటీల్లో మహిళా సంఘాలకు రూ.360.55 కోట్ల రుణాల మాఫీ కానున్నాయి. ఇక వైఎస్సార్‌ చేయూత కింద మెప్మా ఆధ్వర్యంలో జిల్లాలోని 7,916 మంది వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు ఇవ్వడం. 82 మందికి రూ.72.52 లక్షలు వ్యక్తిగత రుణాలు మంజూరు చేశారు. ఇంకా 2,618 మందికి వ్యక్తిగత రుణాలు మంజూరు చేయించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.  

జిల్లాలో 12,233 సంఘాలు 
జిల్లాలోని నగరపాలక సంస్థతో పాటు 11 మున్సిపాలిటీల్లో మెప్మా పరిధిలో 12,233 స్వయం సహాయక సంఘాలున్నాయి. ఆ సంఘాలకు నాలుగు విడతల్లో రుణాలు మాఫీ కానున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ 14 వరకు రుణాలు తీసుకున్న వారికి మాఫీ చేస్తామని ఎన్నికల ముందు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రకటించిన విషయం విధితమే. ఈ మేరకు వందశాతం మహిళా సంఘాలకు రుణాలు మాఫీ కానున్నాయి.


చిరువ్యాపారుల హర్షం : మెప్మా ఆధ్వర్యంలో జిల్లాలోని నగరపాలక సంస్థ, వివిధ మున్సిపాలిటీల్లో మొత్తం 8,700 వీధి వ్యాపారులను లక్ష్యంగా 7,916 మందిని రిజిస్టర్‌ చేయించారు. వారిలో 1,628 మందికి గుర్తింపు కార్డులను అందజేశారు. దీంతో పాటు 82 మందికి రూ.72.52 లక్షల మేర బ్యాంకుల ద్వారా వ్యక్తిగత రుణాలు అందించారు. 213 గ్రూపుల్లో 24 మంది గ్రూపులకు రూ.21 లక్షల రుణాలు మంజూరయ్యాయి. దీనిపై వీధి వ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిరువ్యాపారులకు వారి వ్యాపారాన్ని బట్టి రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తారు.   

మరిన్ని వార్తలు