నివాసానికి చేరుకున్న ముఖ్యమంత్రి జగన్‌

24 Aug, 2019 04:32 IST|Sakshi

సాక్షి, విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమెరికా పర్యటన ముగిసింది. శనివారం ఉదయం సీఎం వైఎస్‌ జగన్‌ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. తొలుత హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న సీఎం అక్కడ నుంచి గన్నవరం ఎయిర్‌పోర్టుకు  వచ్చారు. ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి ఆయనకు సాదర స్వాగతం పలికారు. సీఎంను చూసేందుకు వెల్‌కమ్‌ ప్లకార్టులతో పార్టీ శ్రేణులు హాజరయ్యాయి. విమానాశ్రయం నుంచి తాడేపల్లిలోని నివాసానికి సీఎం జగన్‌ చేరుకున్నారు. కాగా, ఈ నెల 15వ తేదీ రాత్రి సీఎం జగన్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి వారం రోజులపాటు అమెరికా పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.


ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా అమెరికా పర్యటనకు వెళ్లిన సీఎం జగన్‌కు అక్కడి తెలుగువారి నుంచి అపూర్వ స్వాగతం లభించింది. ఆయన ఎక్కడకు వెళ్లినా తెలుగు ప్రజలు జేజేలు పలికారు. ఈ పర్యటనలో భాగంగా సీఎం వైఎస్‌ జగన్‌ యూఎస్‌ విదేశాంగ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. అలాగే  భారత రాయబారి హర్షవర్థన్‌ శ్రింగ్లా వాషింగ్టన్‌ డీసీలో ఇచ్చిన విందులో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా 60 మందికిపైగా సీనియర్‌ అధికారులు, వ్యాపార, వాణిజ్యవేత్తలను ఉద్దేశించి సీఎం వైఎస్‌ జగన్‌ ప్రసంగించారు. పెట్టుబడిదారులకు అవసరమైన అన్ని అంశాలను ఒకేచోట సుహృద్భావ వాతావరణంలో కల్పిస్తామని చెప్పారు. డల్లాస్‌లోని హచిన్సన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో తెలుగు కమ్యూనిటీ ఆఫ్‌ నార్త్‌ అమెరికా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవాస తెలుగువారిని ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగం ఆకట్టుకుంది.  

>
మరిన్ని వార్తలు