ఢిల్లీ చేరుకున్న సీఎం వైఎస్‌ జగన్‌

14 Jun, 2019 16:53 IST|Sakshi

సాక్షి, న్యూ ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. మరికాసేపట్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో ఆయన భేటీ కానున్నారు. విభజన చట్టంలోని పెండింగ్‌ అంశాలపై అమిత్‌ షాతో ఆయన చర్చించనున్నారు. ఏపీ అభివృద్ధి పనుల నిమిత్తం అక్కడే రెండు మూడు రోజుల పాటు ఉండనున్నారు. రేపు నీతి అయోగ్‌ సమావేశంలో పాల్గొననున్నారు. అలాగే రేపు వైఎస్సార్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి కూడా హాజరుకానున్నారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలతో చర్చించనున్నారు. ఏపీ సమస్యలపై ఎలా వ్యవహారించాలో వైఎస్సార్‌సీపీ ఎంపీలకు వైఎస్‌ జగన్‌ దిశా నిర్దేశం చేయనున్నారు.

విభజన అంశాలపై సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఉభయ రాష్ట్రాల గవర్నర్‌ నరసింహన్‌కు ఇదివరకే ఏపీ ముఖ్యమంత్రి లేఖ రాసిన సంగతి తెలిసిందే. లాభాలు ఆర్జించే ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన నిధులను ఏ ప్రాతిపదికన పంపిణీ చేయాలనే దానిపై విభజన చట్టంలో పేర్కొనలేదని, ఈ నేపథ్యంలో గవర్నర్‌గా విచక్షణాధికారంతో నిర్ణయం తీసుకుని, త్వరగా సమస్యకు పరిష్కారం కనుగొనాల్సిందిగా ముఖ్యమంత్రి ఆ లేఖలో కోరారు. తొమ్మిదవ షెడ్యూల్లోని ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తుల పంపిణీకి సంబంధించి షీలా బేడీ కమిటీ కొన్ని సిఫార్సులు చేసినప్పటికీ అవి అమల్లోకి రాలేదన్నారు.

మరిన్ని వార్తలు