ఆరోగ్యాంధ్రకు ఆరు సూత్రాలు

19 Oct, 2019 03:50 IST|Sakshi

1 నుంచి హైదరాబాద్, చెన్నై, బెంగళూరుల్లోని 150 ఆసుపత్రుల్లో ‘వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ’ ద్వారా సూపర్‌ స్పెషాలిటీ సేవలు

ఆరోగ్య, కుటుంబ సంక్షేమంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సమీక్ష

డెంగీ, సీజనల్‌ వ్యాధులకూ ‘వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ’లో చోటు

పథకం ద్వారా శస్త్ర చికిత్సలు జరిగిన వారికి రూ.5,000 వరకు ఆర్థిక సాయం

డబుల్‌ కాక్లియర్‌ ఇంప్లాంట్‌లకు ఆమోదం

గిరిజన ప్రాంతాల్లో బైక్‌ల ద్వారా వైద్యసేవలు

ప్రతి నియోజకవర్గంలో ప్రసూతి కేంద్రం ఏర్పాటు

డిసెంబర్‌ 21న వైఎస్సార్‌ ఆరోగ్య కార్డుల జారీ

కాలేజీ విద్యార్థులకూ ‘కంటి వెలుగు’

ప్రజలందరికీ ఆరోగ్య పరీక్షలు.. స్కూళ్ల నుంచే ఆరంభం

సాక్షి, అమరావతి: ఆరోగ్యాంధ్రప్రదేశ్‌ లక్ష్యంగా ఆరు సూత్రాలతో ముందుకు సాగాలని సీఎం వైఎస్‌ జగన్‌ సూచించారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమంపై సీఎం శుక్రవారం సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఖాళీ పోస్టుల భర్తీ ద్వారా వైద్య ఆరోగ్యశాఖను బలోపేతం చేయడం, ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రమాణాలను పాటిస్తూ  ఔషధాలను అందుబాటులో ఉంచడం, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్ర చికిత్సలు చేయించుకున్న వారికి విశ్రాంతి సమయంలో ఆర్థిక సాయం, తీవ్ర వ్యాధులతో సతమతమవుతున్న వారికి ప్రతి నెలా పెన్షన్, కొత్తగా 108, 104 వాహనాలు సహా బైక్‌ అంబులెన్స్‌లు కొనుగోళ్ల ద్వారా రోగులకు మెరుగైన సేవలు, జాతీయ స్థాయిలో మౌలిక వసతుల కల్పన ద్వారా ఆసుపత్రుల అభివృద్ధి అనే ఆరు సూత్రాలు ప్రాధాన్యాంశాలుగా పని చేయాలని ఆదేశించారు. ఈమేరకు మార్గదర్శకాలతో కూడిన ఆరు సూత్రాల ప్రణాళికను అమలు చేయాలన్నారు. ఈ సందర్భంగా వివిధ వైద్య సేవల అమలుకు సంబంధించి తేదీలతో కూడిన ప్రణాళికను  సీఎం ప్రకటించారు.

పక్షపాతం లేకుండా పథకం అమలు..
‘వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ’ పథకం ద్వారా ఆపరేషన్లు చేయించుకునే వారికి విశ్రాంతి సమయంలో ఆర్ధిక సాయం అందించే అంశంపై సమావేశంలో ముఖ్యమంత్రి అధికారులతో చర్చించారు. ఈ పథకాన్ని ఆరోగ్యశ్రీలో అందరికీ వర్తింప చేయాలా? లేక కొంతమందికే పరిమితం చేయాలా? ఉద్యోగాలు చేస్తున్న వారిని మినహాయించాలా? అనే అంశాలను అధికారులు ప్రస్తావించారు. దీనిపై సీఎం స్పందిస్తూ ఏ పథకాన్నైనా పక్షపాతం లేకుండా అమలు చేయాలని, అలా చేస్తేనే అది విజయ వంతమవుతుందన్నారు. పథకాన్ని పరిమితం చేసే కొద్దీ పక్షపాతం చోటుచేసుకుంటుందని, అందుకే అందరికీ వర్తింపజేయాలని ఆదేశించారు. పక్షపాతం లేకుండా అమలు చేయడమే ప్రతి పథకం వెనకున్న విజయ రహస్యమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆరోగ్యశ్రీ కంట్రోల్‌ రూంలోని నిపుణులైన వైద్యుల బృందం అనుమతిస్తుందని, ఆపరేషన్‌కు ముందు, తర్వాత సంబంధిత వ్యక్తి ఫొటోను అప్‌లోడ్‌ చేస్తారన్నారు. ఏ తరహా ఆపరేషన్‌కు ఎన్ని రోజులు విశ్రాంతి అవసరమో ముందే నిర్ణయిస్తున్నందున ఈ పథకం అమలుకు పరిమితులు విధించాల్సిన అవసరం లేదని  స్పష్టం చేశారు. విశ్రాంతి సమయంలో నెలకు రూ.5 వేలు లేదా రోజుకు రూ.225 చొప్పున ఇచ్చేలా ఇప్పటికే తీసుకున్న నిర్ణయంపై తక్షణమే జీవో విడుదల చేయాలని సీఎం ఆదేశించారు. డాక్టర్ల సిఫారసు మేరకు ఎన్ని రోజుల విశ్రాంతి అవసరమో అన్ని రోజుల పాటు డబ్బులు అందించాలని, దీన్ని డిసెంబరు 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు.

మరికొందరికీ రూ.10 వేల పెన్షన్‌..
తీవ్ర కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారికే కాకుండా తలసేమియా, హీమోఫీలియా, సికిల్‌సెల్‌ ఎనీమియాతో బాధపడుతున్న వారికి కూడా నెలకు రూ.10 వేల చొప్పున పెన్షన్‌ వర్తింప చేయాలని సీఎం ఆదేశించారు. తీవ్ర పక్షవాతంతో వీల్‌ఛైర్‌కు పరిమితమైన వారు, రెండు కాళ్లు లేక చేతులు లేనివారు, పని చేయలేని స్థితిలో ఉన్నవారు, కండరాల క్షీణతతో పనిచేయని పరిస్థితిలో ఉన్న వారికి కూడా నెలకు రూ.5 వేల చొప్పున పెన్షన్‌ జనవరి 1 నుంచి వర్తింప చేయనున్నట్లు సీఎం ప్రకటించారు. దీనికి సంబం ధించి ఉత్తర్వులు జారీ చేయాలని సూచించారు.

ఆసుపత్రులపై ఆరా..
ప్రభుత్వాసుపత్రుల్లో మౌలిక వసతులు, అభివృద్ధి కార్యక్రమాలపై సీఎం ఆరా తీశారు. 174 కమ్యూనిటీ, ఏరియా, జిల్లా ఆసుపత్రుల్లో జాతీయ ప్రమాణాల ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ఐదు బోధనాసుపత్రుల్లో కొత్త భవనాలుండగా 6 చోట్ల భవనాలు పాతబడినట్లు అధికారులు చెప్పారు. భవనాల నిర్మాణం, సదుపాయాల కల్పనకు మే నుంచి పనులు ప్రారంభించేలా కార్యాచరణ సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. అన్ని కమ్యూనిటీ, ఏరియా, జిల్లా ఆస్పత్రుల అభివృద్ది కార్యక్రమాల పనులను డిసెంబర్‌ నుంచి ప్రారంభించి ఏడాదిలో పూర్తి చేయాలని ఆదేశించారు.

డిసెంబర్‌ 21 నుంచి ఆరోగ్యశ్రీ కార్డుల జారీ ప్రక్రియ
జనవరి 1వతేదీ నుంచి వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీలో మార్పులను పైలెట్‌ ప్రాజెక్టు కింద అమల్లోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో 2,000, మిగిలిన జిల్లాల్లో 1,200 వ్యాధులను ఆరోగ్యశ్రీ జాబితాలోకి తెచ్చి పైలెట్‌ ప్రాజెక్టు అమలు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. డిసెంబర్‌ 21వతేదీ నుంచి వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ కార్డుల జారీ ప్రక్రియ ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. డబుల్‌ కాంక్లియర్‌ ఇంప్లాంట్‌ను ఆరోగ్యశ్రీ జాబితాలో చేర్చాలని సీఎం ఆదేశించారు. డెంగ్యూ సహా సీజనల్‌ వ్యాధులకు ఈ జాబితాలో చోటు కల్పించాలని సీఎం ఆదేశించారు. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీకి సంబంధించి నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో తనిఖీలు ఫిబ్రవరి చివరి నాటికి పూర్తవుతాయని, మార్చి 1 నాటికి ఆసుపత్రుల జాబితా ఖరారవుతుందని అధికారులు సీఎంకు తెలిపారు.

కంటివెలుగు తరహాలో ప్రజలందరికీ వైద్య పరీక్షలు
కంటి వెలుగు తరహాలో ప్రజలందరికీ పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. కంటి వెలుగు తరహాలో స్కూల్‌ విద్యార్ధుల నుంచి ప్రారంభించి అందరికీ పరీక్షలు చేయాలని ఆదేశించారు. ఇప్పటివరకు 60,669 పాఠశాలలకుగానూ 56,982 స్కూళ్లలో కంటి పరీక్షలు నిర్వహించామని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి జవహర్‌రెడ్డి ముఖ్యమంత్రికి వివరించారు. 69,33,525 మంది విద్యార్ధులకు గాను 64,08,086 మందికి పరీక్షలు నిర్వహించామని చెప్పారు.

దాదాపు 4.8 లక్షల మంది పిల్లలకు కంటి సమస్యలున్నాయని తెలిపారు. కంటి వెలుగు కింద రాష్ట్రంలోని అన్ని కాలేజీల విద్యార్ధులకు కూడా కంటి పరీక్షలు నిర్వహించాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. మధుమేహం, బీపీ, షుగర్‌ లాంటి వ్యాధులను తగ్గించడానికి అవగాహన, శిక్షణ కార్యక్రమాలను స్కూళ్లు, గ్రామాల్లో నిర్వహించాలని సీఎం సూచించారు. కేన్సర్‌ కారకాలను తగ్గించే ప్రయత్నాలు చేయాలని, గ్రామ సచివాలయాల పక్కనే ఆరోగ్యపరమైన అంశాలపై తరగతులు నిర్వహించాలన్నారు. సబ్‌ సెంటర్లలో హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లను నిర్వహించాలని సీఎం సూచించారు.

ఆస్పత్రుల్లో పారిశుధ్ధ్య కార్మికుల జీతాలు పెంపు
ఆస్పత్రుల్లో పనిచేసే శానిటేషన్‌ వర్కర్ల జీతాలను 100 శాతం పెంచాలని సీఎం నిర్ణయించారు. వీరికి రూ.16 వేలు చొప్పున పెంచుతూ వెంటనే జీవో జారీచేయాలని ఆదేశించారు. వారి వేతనాల విషయంలో ఉదారంగా ఉండాలన్నారు. ఏలూరు పర్యటనలో ఈ కార్మికులు  ప్రస్తావించిన సమస్యలను సీఎం గుర్తు చేసుకున్నారు.

108, 104 వాహనాలు పెంపు
మారుమూల గిరిజన ప్రాంతాల్లో ద్విచక్ర వాహ నాల ద్వారా వైద్యసేవలను అందుబాటులోకి తేవాలని సీఎం ఆదేశించారు. ప్రతి నియోజకవ ర్గంలో ప్రసూతి కేంద్రాన్ని ఏర్పాటు చేయాల న్నారు. 108, 104 కొత్త వాహనాల కొనుగోలుతో పాటు బైక్‌ అంబులెన్స్‌ల సంఖ్య పెంచాలని సీఎం ఆదేశించగా జనవరికి కొత్త వాహనాలు అందు బాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.

మందుల కొరతనే మాట వినపడకూడదు
ప్రభుత్వాసుపత్రిలో మందులు దొరకడం లేదనే ఫిర్యాదులు ఎక్కడా రాకూడదని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఔషధాలు నాణ్యంగా లేవని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్న నేప«థ్యంలో అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్ధ ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన మందులను కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. నవంబరు 20 కల్లా కచ్చితంగా మార్పులు తెస్తామని అధికారులు తెలిపారు. ఏటా జనవరిలో నియామకాల ప్రక్రియ కోసం క్యాలెండర్‌ విడుదల చేయనున్న నేపథ్యంలో డాక్టర్లు, నర్సుల పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలు కసరత్తు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రతి వైద్య విద్యార్ధి, నర్సింగ్‌ విద్యార్ధి తప్పనిసరిగా  ఏడాది పాటు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసేలా చూడాలని నిర్ణయించారు.

175 ప్రసూతి కేంద్రాల అభివృద్ధి
మాతా, శిశు మరణాల నివారణ కోసం 175 నియోజకవర్గాల్లో ప్రసూతి కేంద్రాలను అభివృద్ధి చేయాలని, గ్రామ, వార్డు వలంటీర్ల సేవలను వినియోగించుకోవాలని సీఎం సూచించారు. ఈ మేరకు కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం, అధికారులు పాల్గొన్నారు.

డబ్బుల్లేవని క్షతగాత్రులకు వైద్యం నిరాకరించొద్దు..
జాతీయ రహదారుల వెంట మద్యం దుకాణాలను వెంటనే తొలగించాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. మద్యం దుకాణాల కోసం గత ప్రభుత్వం కొన్ని జాతీయ రహదారులను డీ నోటిఫై చేసిన విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకురాగా వాటిని తిరిగి జాతీయ రహదారుల జాబితాలో చేర్చాలని సూచించారు. గతేడాది 29,012 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 8,321 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారు ఆస్పత్రికి వస్తే డబ్బుల్లేక వైద్యాన్ని నిరాకరించే పరిస్ధితి ఉండకూడదని సీఎం స్పష్టంచేశారు. అందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వమే కొంత మొత్తాన్ని వైద్యం కోసం ఇచ్చేలా కార్యక్రమాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

జ్యుడీషియల్‌ ప్రివ్యూకు తొలి టెండర్‌
టెండర్లలో అక్రమాలను నిరోధించి పారదర్శకంగా వ్యవహరించేందుకు ఉద్దేశించిన న్యాయపరమైన ముందు సమీక్ష ద్వారా పారదర్శకత చట్టం అమలులోకి వచ్చిన తరువాత వైద్య ఆరోగ్యశాఖకు చెందిన తొలి టెండర్‌ను జ్యుడీషియల్‌ ప్రివ్యూకు పంపించారు. 108, 104 వాహనాల నిర్వహణ, సిబ్బంది, మందుల సరఫరా టెండర్‌ను జ్యుడీషియల్‌ ప్రివ్యూ జడ్జి జస్టిస్‌ బి.శివశంకరరావుకు ప్రభుత్వం పంపింది. ఈనెల 16న ఈ టెండర్‌కు సంబంధించిన డాక్యుమెంట్లతోపాటు పూర్తి వివరాలను జస్టిస్‌ శివశంకరరావుకు అందచేసింది. వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి జస్టిస్‌ శివశంకరరావును కలసి  టెండర్‌ అంశాలను వివరించారు. శుక్రవారం నిర్వహించిన సమీక్షలో జ్యుడీషియల్‌ టెండర్ల వివరాలను జవహర్‌రెడ్డి సీఎంకు వివరించారు.

ఆ సూత్రాలు ఇవీ
►వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీ పోస్టుల భర్తీ

►అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ప్రభుత్వాసుపత్రుల్లో ఔషధాలు

►వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా శస్త్ర చికిత్స జరిగినవారికి ఆర్థిక సాయం

►తీవ్ర వ్యాధులతో సతమతమవుతున్న వారికి ప్రతి నెలా పెన్షన్‌

►మరిన్ని 108, 104 వాహనాలు.. బైక్‌ అంబులెన్స్‌ల కొనుగోలు

►మౌలిక వసతుల కల్పన ద్వారా ప్రభుత్వాస్పత్రుల అభివృద్ధి

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా