ఉల్లి ధరలపై సీఎం జగన్‌ సమీక్ష

3 Dec, 2019 13:56 IST|Sakshi

ఉల్లి ధరలతో ప్రజలు ఇబ్బందులు పడకూడదు

రైతు బజార్లలో రూ. 25 కే విక్రయించాలి

సమీక్ష సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశం

సాక్షి, అమరావతి: దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయి. ఉల్లి రేట్లు భారీగా పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల ఇబ్బందులను గుర్తించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సబ్సిడీ ధరలకే రైతు బజార్ల ద్వారా ఉల్లిపాయలు విక్రయిస్తుంది. నవంబర్‌ 2న ఒక్కరోజే కిలో ఉల్లి రూ.90కి చేరింది. అయినా ప్రభుత్వం మాత్రం ఎక్కడా వెనకాడకుండా దాదాపు 548 క్వింటాళ్ళు ఒక్కరోజే కొనుగోలు చేసి రూ.25కే కిలో చొప్పున సామాన్యులకు అందుబాటులో ఉండేలా రైతు బజార్లకు చేర్చింది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సమీక్ష సమావేశం చేపట్టారు. గత వారం రోజులుగా రాష్ట్రంలో ఉల్లిధరలు కిలో రూ.80 నుండి రూ.100 వరకూ పెరగడంతో ఈ అధిక ధరలను అదుపుచేయాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. సబ్సిడీ ఉల్లిపాయలు రైతుబజార్ల ద్వారా విక్రయించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని అన్ని రైతుబజార్లలో సబ్సిడీ ఉల్లిపాయలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. అక్రమంగా ఉల్లిపాయల నిల్వలు చేస్తే వారిపై మార్కెటింగ్‌, పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్‌ అధికారులు దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బహిరంగ మార్కెట్లో ఉల్లిపాయల ధరలు తగ్గేంతవరకూ ఇదే విధంగా అమ్మాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. ధరల స్ధిరీకరణ నిధి నుంచి సబ్సిడీ మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్థిక భారం పడినా.. సామాన్యులకు మాత్రం రైతు బజార్లలో రూ.25 కే కిలో చొప్పున అమ్మాలని సీఎం పేర్కొన్నారు.

ఉల్లి ధరలపై వ్యవసాయశాఖ, పౌరసరఫరాలశాఖ, మార్కెటింగ్‌శాఖ, రైతుబజార్ల ఎస్టేట్‌ అధికారులతో ముఖ్యమంత్రి కార్యాలయం ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తోంది. దేశ వ్యాప్తంగా బహిరంగ మార్కెట్లో ఉల్లి ధర సుమారు 100 రూపాయలకు చేరింది. బహిరంగ మార్కెట్లో అంత ధర ఉన్నా.. రైతు బజార్లలో మాత్రం తక్కవకే దొరుకుతోంది. రోజుకు 500 నుంచి 1200 క్వింటాళ్ళ ఉల్లిపాయలు సేకరించి మార్కెటింగ్‌ శాఖ ద్వారా రైతు బజార్లకు ప్రతీరోజు తరలిస్తున్నారు. ప్రతీ కిలో మీద సుమారు 50 రూపాయల పైగా ప్రభుత్వం సబ్సిడీగా ఇచ్చి రైతు బజార్లకు సరఫరా చేస్తుంది. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్న కారణంగా కిలో ఉల్లి సామాన్యులకు 25 రూపాయలకే దొరుకుతోంది.

మరిన్ని వార్తలు