సూరంపల్లిలో ‘సీపెట్‌’  ప్రారంభం

24 Oct, 2019 11:33 IST|Sakshi

సీపెట్‌తో మరిన‍్ని ఉపాధి అవకాశాలు: సీఎం

సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో నిర్మించిన సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీని (సీపెట్‌) గురువారం సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేంద్ర మంత్రి సదానంద గౌడ ప్రారంభించారు. గురువారం ఉదయం 11.00 గంటలకు కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి సదానందగౌడతో కలసి సీపెట్‌ ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.


కేంద్రం మరిన్ని సంస్థలు ఏర్పాటు చేయాలి: సీఎం
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ.. ‘సీపెట్‌లో శిక్షణ పొందిన విద్యార్థులకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 25  పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో నైపుణ్య అభివృద్ధి (స్కిల్‌ డెవలప్‌మెంట్‌) సెంటర్లు ఏర్పాటు చేస్తాం. 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్న చట్టం చేసిన తొలిరాష్ట్రం మనదే. యువతను ప్రోత్సహించేందుకు చట్టాన్ని తీసు​కొచ్చాం. పరిశ్రమలకు ఉపయోగపడే విధంగా యువతలో నైపుణ్యాన్ని తీర్చిదిద్దే బాధ్యతను తీసుకున్నాం. సీపెట్‌ లాంటి సంస్థలు మరిన్ని రావాల్సి ఉంది. ఇలాంటి సంస్థలను మరిన్ని ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరుతున్నాం.’ అని అన్నారు.

అలా అయితే నెంబర్‌ వన్‌ స్థానం మనదే..
కేంద్రమంత్రి సదానంద గౌడ మాట్లాడుతూ.. సీఎం జగన్‌తో వేదిక పంచుకోవడం ఆనందంగా ఉంది. ఏపీలో ఇలాంటి సంస్థ ఏర్పాటుకు ముఖ్యమంత్రి అందించిన సహకారం అభినందనీయం. దేశ, రాష్ట్రాభివృద్ధికి ఇలాంటి సంస్థలు ఎంతో ఉపయోగపడతాయి. మన దేశంలో యువత శాతం ఎక్కువగా ఉంది. యువతను సరైన విధానంలో ఉపయోగించుకుంటే నెంబర్‌ వన్‌ స్థానానికి చేరుకుంటాం. యువతలో నైపుణ్యాన్ని పెంచేవిధంగా చర్యలు తీసుకుంటున్నాం. దేశవ్యాప్తంగా ఇప్పటికే 37 సీపెట్‌ కేంద్రాలున్నాయి. మరో అయిదుచోట్ల సీపెట్‌ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం.’ అని తెలిపారు.

అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను కేంద్రమంత్రితో కలిసి ముఖ్యమంత్రి వీక్షించారు. 12 ఎకరాల విస్తీర్ణంలో రూ.50కోట్లతో  సీపెట్‌ భవనాలను నిర్మించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్‌, సీపెట్‌ డైరెక్టర్‌ కిరణ్‌కుమార్, కలెక్టర్‌ ఏఎండీ ఇంతియాజ్, జేసీ కె.మాధవీలత, సబ్‌ కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌, ఎమ్మెల్యే పార్థసారధి, పలువురు వైఎస్సార్‌ సీపీ నేతలు పాల్గొన్నారు.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా