చేపల ఎగుమతికి సహకరించండి!

19 Apr, 2020 03:57 IST|Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వినతి సానుకూలంగా స్పందించిన అసోం సీఎం సోనావాల్‌

సీఎం చొరవతో ఆ రాష్ట్రంలోకి ప్రవేశించిన ఏపీ లారీలు

సాక్షి, అమరావతి/భీమవరం: ఏపీ నుంచి అసోంకు చేపల ఎగుమతిలో ఎదురవుతున్న ఇబ్బందులు తొలగించి సహకరించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అసోం సీఎం శరబానంద సోనోవాల్‌కు విజ్ఞప్తి చేశారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. చేపల ఎగుమతుల అంశం మీద శనివారం ఇరువురూ ఫోన్లో మాట్లాడుకున్నారు. ఏపీ నుంచి పెద్దఎత్తున ఆక్వా ఉత్పత్తులు అసోంకు ఎగుమతి అవుతున్నందున అక్కడి రాష్ట్ర సరిహద్దుల్లో అవి నిలిచిపోకుండా తగు చర్యలు తీసుకోవాలని వైఎస్‌ జగన్‌ కోరారు. అంతేకాక.. చేపలు విక్రయించే మార్కెట్లను తెరవాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు సోనోవాల్‌ స్పందిస్తూ.. తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే, లాక్‌డౌన్‌ కారణంగా ఏపీలో చిక్కుకుపోయిన అసోం వాసులకు అవసరమైన సహాయాన్ని అందించాలని కోరారు. దీనికి.. ఇప్పటికే తాము అన్ని రకాలుగా అండగా నిలుస్తున్నామని వైఎస్‌ జగన్‌ బదులిచ్చారు.

సీఎం చొరవతో తొలగనున్న అడ్డంకులు : మోపిదేవి
కాగా, రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యల ఫలితంగా అతిత్వరలోనే చేపల ఎగుమతులకు సంబంధించిన అన్ని అడ్డంకులు తొలగిపోనున్నాయని పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. చేపల ఎగుమతికి, వాటి మార్కెటింగ్‌లో అసోంలో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి సీఎం వైఎస్‌ జగన్‌ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శరబానంద సోనోవాల్‌కి వివరించారని చెప్పారు. 

అసోంలో కదిలిన చేపల లారీలు
ఇదిలా ఉంటే.. అసోం సరిహద్దుల్లో తాజాగా నిలిచిపోయిన చేపల లోడు లారీలు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ చొరవతో ముందుకు కదిలాయి. భీమవరం, ఆకివీడు, కైకలూరు ప్రాంతాల నుంచి ప్రతీరోజు సుమారు 200 లారీల్లో చేపలు అసోం, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, పశ్చిమబెంగాల్, బిహార్, మేఘాలయ, త్రిపుర, మిజోరం తదితర రాష్ట్రాలకు ఎగమతి అవుతాయి. లాక్‌డౌన్‌తో లారీల రాకపోకలు నిలిచిపోయాయి. కానీ, ఆక్వా ఎగుమతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అనుమతులివ్వడంతో భీమవరం పరిసర ప్రాంతాల నుంచి పలు లారీలు అసోం బయల్దేరాయి. ఇవి ఆ రాష్ట్ర సరిహద్దుల్లో నిలిచిపోవడంతో శనివారం సీఎం వైఎస్‌ జగన్‌ ఆ రాష్ట్ర సీఎంతో మాట్లాడారు. దీంతో లారీలు అసోంలోకి ప్రవేశించాయి. కాగా, రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో బిహార్, పశ్చిమబెంగాల్‌ తదితర రాష్ట్రాలకు పెద్ద మొత్తంలో చేపల ఎగుమతులు అవుతున్నాయని రాష్ట్ర చేపల ఎగుమతిదారుల సంఘం కోశాధికారి గాదిరాజు సుబ్బరాజు చెప్పారు.  

మరిన్ని వార్తలు