ఎల్లో మీడియా కథనాన్ని ఖండించిన ఏపీ సీఎంవో

24 Sep, 2019 09:56 IST|Sakshi

కేంద్రంపై ఇద్దరు సీఎంల అసంతృప్తి అంటూ ఈనాడు కథనం

ఉద్దేశపూర్వకంగా రాసిన కథనంగా భావిస్తున్నాం

ఇరు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా సీఎంల భేటీ

ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టీకరణ

సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వంపై ఇద్దరు ముఖ్యమంత్రులు అసంతృప్తిగా ఉన్నారంటూ ఎల్లో మీడియాలో ప్రచురితమైన కథనం కల్పితమని ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) స్పష్టం చేసింది. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంలో అలాంటి అంశమేదీ ప్రస్తావనకు రాలేదని తెలిపింది. ఉహాజనిత అంశాలను ప్రచురించి, ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని ఏపీ సీఎంవో హితవు పలికింది. ఈ విషయమై ఈనాడు దినపత్రిక రాసిన కథనాన్ని ఖండిస్తున్నామని, అది ఉద్దేశపూర్వకంగా రాసిన కథనంగా భావిస్తున్నామని ప్రకటించింది. ఇరు రాష్ట్రాల ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ఇద్దరు ముఖ్యమంత్రుల సమావేశం జరిగిందని ఏపీ సీఎంవో స్పష్టం చేసింది.

ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌ సోమవారం హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌ వేదికగా సుదీర్ఘంగా సమావేశమైన సంగతి తెలిసిందే. ఇరురాష్ట్రాల ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ఈ సమావేశం సాగిందని ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. గత నాలుగు నెలలుగా ఉభయ రాష్ట్రాల ప్రయోజనాల లక్ష్యంగా ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య సమావేశాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందేనని, రాజకీయ అంశాలు, రాజకీయ సమీకరణాలకు దూరంగా ఈ సమావేశాలు జరుగుతున్నాయని పేర్కొంది. గోదావరి జలాలను తరలింపు ద్వారా సాగర్‌ కుడికాల్వ కింద ఉన్న కృష్ణా డెల్టా, ప్రకాశం సహా రాయలసీమకూ, తెలంగాణలోని పాత మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు మేలు చేకూర్చే అంశంపై సుదీర్ఘ చర్చలు జరిగాయని, ఈ ప్రాజెక్టును సఫలం చేసేదిశగా నిశితంగా ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించారని సీఎంవో పేర్కొంది.

అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలను కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించారని, పోలీసు అధికారులకు సంబంధించిన విభజన అంశాలపై కూడా చర్చించారని తెలిపింది. తెలంగాణలో కొత్తగా నియామకం అవుతున్న పోలీసు కానిస్టేబుళ్లకు ఏపీలోనూ శిక్షణ ఇచ్చే అంశంపైనా చర్చ జరిగిందని,  విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలపైనా ఇద్దరు ముఖ్యమంత్రులు దృష్టిపెట్టారని సీఎంవో తెలిపింది. సోమవారం నాటి సమావేశంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు తప్ప మరే ఇతర విషయాలూ  చోటు చేసుకోలేదని స్పష్టం చేసింది. ఇలాంటి సమావేశం మీద ఊహాజనిత అంశాలు రాసి ప్రజలను తప్పుదోవపట్టించడం దురదృష్టకరమని, ఇలాంటి కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది.
చదవండి: కృష్ణకు గో‘దారి’పై..

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా