24న సీఎం జగన్‌ అధ్యక్షతన కలెక్టర్ల సదస్సు

20 Jun, 2019 20:29 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఈనెల 24వ తేదీన జిల్లా కలెక్టర్ల సదస్సు నిర్వహించాలని ఆంధ్రప‍్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సదస్సులో ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, విభాగాధిపతులు, ముఖ్య కార్యదర్శులు పాల్గొంటారు. గతానికి భిన్నంగా సచివాయలంలోనే దీనిని నిర్వహించనుంది. గత ప్రభుత్వం ఈ సదస్సును మొదట ప్రయివేటు (ఎ-1) కన్వెన్షన్‌ సెంటర్‌లోనూ, తర్వాత కరకట్టవద్ద నిర్మించిన గ్రీవెన్సు హాలులోనూ నిర్వహించింది. అయితే కొత్త సర్కారు మాత్రం కలెక్టర్ల సదస్సును రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలోనే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. పారదర్శక పాలన, గ్రామ సచివాలయాల ఏర్పాటు, ప్రజారోగ్యం మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలు, ఇంటింటికీ నిత్యావసర సరకుల పంపిణీ, పాఠశాలల విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫాం సరఫరా, వ్యవసాయ రంగం స్థితిగతులు, కరువు, తాగునీటి ఎద్దడి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఇందులో సమీక్షిస్తారు.  

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన ప్రభుత్వం నిర్వహించనున్న తొలి కలెక్టర్ల సదస్సులో పారదర్శక పాలన, సర్కారు ప్రాధాన్యాలు, కొత్తగా అమలు చేయనున్న సంక్షేమ కార్యక్రమాలకు ఏర్పాట్లు తదితర ప్రధానమైన అంశాలపై చర్చిస్తారు. ప్రభుత్వ ప్రాధాన్యాల ప్రకారం అజెండా రూపొందించి పంపించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అన్ని జిల్లాల కలెక్టర్లు, విభాగాధిపతులు, శాఖల  ముఖ్య కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశారు. సచివాలయం అయిదో బ్లాక్‌ కాన్ఫరెన్సు హాలులో 24వ తేదీ ఉదయం 10 గంటలకు కలెక్టర్ల సమావేశం ప్రారంభమవుతుందని డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ తెలిపారు. రాష్ట్ర భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ) తొలి పలుకులతో కలెక్టర్ల సదస్సు ప్రారంభమవుతుంది.  

మరిన్ని వార్తలు