ఓటుకు నోటు కేసుపై కూడా నిగ్గు తేల్చాలి

14 Feb, 2020 18:16 IST|Sakshi

మండలి చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు

సాక్షి, అమరావతి: రెండు వేల కోట్ల బాగోతం బయటపడితే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎందుకు నోరు మెదపడం లేదని మండలి చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇంత జరిగినా తేలు కుట్టిన దొంగల్లా ఎందుకున్నారని.. దీని వెనుక అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. నిప్పు లాంటి వాడినని చంద్రబాబు చెప్పుకుంటారని.. ఇప్పుడు ఆ నిప్పుకు తుప్పు పట్టిందని ఎద్దేవా చేశారు. ఇంకా ఎన్ని అక్రమాలు జరిగాయో నిగ్గు తేల్చాలని ఆయన డిమాండ్‌ చేశారు. చిన్న ఉద్యోగి వద్దే రూ.2 వేల కోట్లు ఉంటే రాష్ట్రాన్ని చంద్రబాబు ఏవిధంగా పరిపాలించాడో అర్థం చేసుకోవచ్చన్నారు. (రూ. 2 వేల కోట్లు: హైదరాబాద్‌కు చంద్రబాబు పయనం!)

దేశమంతా కోడై కూసింది..
‘గత ఐదేళ్లలో ఏపీలో జరిగిన అక్రమాలపై దేశమంతా కోడై కూసిందని.. ఇవాళ ఆ బండారం అంతా బయటపడిందని’ ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. బయటపడిన అక్రమాలు చాలా తక్కువని ముఖ్యమైన వారిపై దాడులు జరిగితే లక్షల కోట్లు అక్రమాలు బయటకు వస్తాయన్నారు. ఓటుకు నోటు కేసు కూడా నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు.

ఆ విషయంపై ఆలోచన చేస్తాం..
వికేంద్రీకరణ బిల్లులపై ఆర్డినెన్స్ ఇవ్వాలా..? గవర్నర్ ఆమోదానికి పంపాలా..? అనేది ఆలోచన చేస్తామని ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుతానికి వికేంద్రీకరణ బిల్లులను గవర్నర్‌కు పంపలేదని చెప్పారు. ‘టీడీపీ తన వాదనలను వినిపిస్తోంది.. మేం మా వాదనలను వినిపిస్తున్నాం. ఏం జరుగుతుందో చూద్దామని’ ఆయన తెలిపారు. వికేంద్రీకరణ బిల్లుల విషయంలో ప్రస్తుతం నెలకొన్న ప్రతిష్టంభన ఇంకొన్ని రోజులు కొనసాగుతుందని చెప్పారు. (చంద్రబాబు అవినీతి బట్టబయలు)

 ధిక్కారం ఎలా అవుతుంది..?
అసెంబ్లీని ప్రొరోగ్ చేసినా బిల్లులు లైవ్‌లోనే ఉంటాయని తెలిపారు. తన ఆదేశాలు పాటించకుంటే చర్యలు తీసుకుంటానని మండలి ఛైర్మన్ షరీఫ్ సెక్రటరీకి లేఖ రాశారని వెల్లడించారు. సభలో నిర్ణయం తీసుకునే సమయంలో విధిగా ఓటింగ్ జరపాలని ఆర్టికల్ 189/1 ప్రకారం రాజ్యాంగం చెబుతోందని వివరించారు. తప్పులు జరుగుతుంటే.. సరి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. నిబంధనల ప్రకారం చెల్లదని చెబితే ధిక్కారం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. తాను తప్పు చేసినట్టు రుజువు అవుతుందనే మండలి ఛైర్మన్ సభ ప్రొసీడింగ్స్ ఇవ్వడం లేదని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు